రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు సాయుధ దళాలకు సంపూర్ణ మద్దతునిచ్చారన్న రక్షణమంత్రి

"జాతీయ భద్రత ప్రతి పౌరుడి బాధ్యత""సురక్షితమైన, బలమైన దేశ నిర్మాణం కోసం రక్షణ, విద్య, క్రీడా రంగాల కలయిక కీలకం"

Posted On: 25 AUG 2025 2:33PM by PIB Hyderabad

"ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు సాయుధ దళాలకు సంపూర్ణ మద్దతును అందించారు. దేశ భద్రత బాధ్యత కేవలం ప్రభుత్వానిదో.. సైన్యానిదో కాదు.. అది ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ సంఘటన చాటింది" అని కేంద్ర రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ రోజు జరిగిన రక్షణ-క్రీడా అకాడమీ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రసంగించిన రక్షణమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరులు.. ముఖ్యంగా యువత తమ విధుల పట్ల అవగాహనతో, అంకితభావంతో ఉంటే దేశం ఎలాంటి విపత్కర పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోగలదని, మరింత బలంగా మారగలదని ఆయన పేర్కొన్నారు.

 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి సమాధానంగా భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో యువత ప్రదర్శించిన ఉత్సాహం, దృఢ సంకల్పాన్ని రక్షణమంత్రి ప్రశంసించారు. భారత్‌లో కుల-మత ఆధారిత వివక్ష ఎన్నడూ ఉండదన్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం పేరుతో అమాయక ప్రజలను చంపేశారని.. భారత సాయుధ దళాలు కర్మసిద్ధాంతం ప్రకారం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారినీ నాశనం చేశాయని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ను నవభారత గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

 

రక్షణ-క్రీడా అకాడమీ ఏర్పాటు వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. రక్షణ, విద్య, క్రీడా రంగాల కలయిక సురక్షితమైన, బలమైన దేశాన్ని నిర్మించడానికి చాలా కీలకమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. "విద్య జ్ఞానాన్ని అందిస్తుంది.. రక్షణ భద్రతను నిర్ధారిస్తుంది. పట్టుదల, క్రమశిక్షణ, సహనం, సంకల్పం వంటి లక్షణాలు ఒక సైనికుడికి ఎంత ముఖ్యమో క్రీడాకారులకూ అంతే ముఖ్యమైనవి. రక్షణ, విద్య, క్రీడా రంగాల ఈ సంగమం ద్వారా విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వపడేలా చేయగలరు" అని ఆయన వ్యాఖ్యానించారు. జ్ఞానం, సంస్కృతి, శక్తి పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే దేశాన్ని నిర్మించాలని రక్షణమంత్రి పిలుపునిచ్చారు.

 

దేశ రక్షణలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సైనికుల కీలక సహకారాన్ని ప్రస్తావించిన రక్షణమంత్రి.. ఈ ప్రాంతం నుంచి జవాన్లకు సమానమైన సంఖ్యలో అధికారులు రావడం లేదన్నారు. సాయుధ దళాల్లో అధికారులుగా చేరి జాతీయ భద్రతను మరింత బలోపేతం చేయడానికి పౌరులు కృషి చేయాలని రక్షణమంత్రి కోరారు.

 

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

***

 


(Release ID: 2160691)