రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో వ్యోమగాములు శుభాంశు శుక్లా, పీబీ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్‌లను సత్కరించిన రక్షణమంత్రి
మన వ్యోమగాములు భారత ఆకాంక్షలకు మార్గదర్శకులు: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
"అంతరిక్ష రంగాన్ని భారత్ కేవలం పరిశోధనా రంగంగా మాత్రమే చూడదు..
రేపటి ఆర్థిక వ్యవస్థ, భద్రత, శక్తి, మానవాళి భవిష్యత్తుగా చూస్తుంది"
प्रविष्टि तिथि:
24 AUG 2025 1:25PM by PIB Hyderabad
ఇస్రో మానవ సహిత తొలి అంతరిక్ష ప్రయోగం- గగన్‌యాన్‌లో భాగమైన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, గ్రూప్ కెప్టెన్ పీబీ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్‌లను న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నలుగురు వ్యోమగాములను దేశ రత్నాలుగా, జాతీయ ఆకాంక్షలకు మార్గదర్శకులుగా అభివర్ణించారు.
అంతరిక్ష రంగంలో విస్తరిస్తున్న భారత ఉనికిని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. “మనం అంతరిక్షాన్ని పరిశోధనా రంగంగా మాత్రమే కాకుండా, రేపటి ఆర్థిక వ్యవస్థ, భద్రత, శక్తి, మానవాళి భవిష్యత్తుగా చూస్తాం. మనం భూమి ఉపరితలం దాటి అంతరిక్షంలోని కొత్త సరిహద్దుల్లోకి క్రమంగా ముందుకు సాగుతున్నాం. చంద్రుని నుంచి అంగారక గ్రహం దాకా మనం చేరుకున్నాం. నేడు మన దేశం గగన్‌యాన్ వంటి ప్రయోగాలకు పూర్తిగా సిద్ధంగా ఉంది" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఈ విజయం కేవలం సాంకేతికపరమైన విజయం మాత్రమే కాదు, ఆత్మనిర్భర్ భారత్‌లో ఒక కొత్త అధ్యాయంగా రక్షణమంత్రి అభివర్ణించారు. “ప్రపంచంలో అంతరిక్ష శక్తిని కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ సగర్వంగా నిలిచింది. మన అంతరిక్ష కార్యక్రమం కేవలం ప్రయోగశాలలు, ప్రయోగ వాహనాలకే పరిమితం కాదు. ఇది మన జాతీయ ఆకాంక్షలు, ప్రపంచ స్థాయి దార్శనికతకు ప్రతిబింబం. పరిమిత వనరులే ఉన్నప్పటికీ మన అపరిమిత సంకల్ప శక్తితో అత్యంత సవాలుతో కూడిన లక్ష్యాలను కూడా అద్భుతమైన విజయాలుగా మార్చగలమని చంద్రయాన్ నుంచి మంగళయాన్ దాకా సాగిన ప్రయోగాలతో మనం నిరూపించాం" అని ఆయన పేర్కొన్నారు.
కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, వాతావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి అంతరిక్షం నుంచి పొందిన సాంకేతికతలు దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి రంగానికి సేవలను అందిస్తున్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంతరిక్ష ప్రయాణంలో భారత్ వెనకబడి ఉండకూడదని పేర్కొన్నారు. రాబోయే కాలంలో మానవ నాగరికత గమనాన్ని అంతరిక్ష మైనింగ్, లోతైన అంతరిక్ష అన్వేషణ, గ్రహ వనరులు పునర్నిర్వచించగలవని ఆయన తెలిపారు.
సైనిక శక్తికి, సాంకేతిక పరాక్రమానికి చిహ్నంగా అంతరిక్ష రంగం ఉందనీ, మానవ నాగరికత సమష్టి ప్రయాణంలో ఒక కొత్త దశగా నిలిచే ఒక యుగంలోకి ప్రపంచం ప్రవేశించిందని రక్షణమంత్రి పేర్కొన్నారు. “భారత్ ఎల్లప్పుడూ ప్రపంచానికి వసుధైక కుటుంబమనే సందేశాన్ని అందిస్తూనే ఉంది. మన శాస్త్రవేత్తలు, వ్యోమగాములు అదే సందేశాన్ని నేడు సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు.
విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తిచేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ప్రశంసిస్తూ.. ఆయన దృఢ సంకల్పం, ధైర్యాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఈ యాత్ర భారత స్ఫూర్తిని ప్రతిబింబించింది. శుక్లాను జాతికి గర్వకారణంగా మార్చింది. “రెండున్నర సంవత్సరాల శిక్షణ రెండున్నర నెలల్లోనే పూర్తి చేయడం శుక్లా అంకితభావానికి నిదర్శనం. ఇది భారతీయుల పట్టుదలకు చిహ్నం. ఈ అసాధారణ ఘనత కేవలం సాంకేతిక సాధన మాత్రమే కాదు. ఇది విశ్వాసం, అంకితభావాల సందేశం. ఇది దేశానికి గర్వకారణం మాత్రమే కాదు. ఇది యావత్ మానవాళి పురోగతికి ఆధారం” అని ఆయన వ్యాఖ్యానించారు.
పౌర-సైనిక సేవల సమ్మిళిత చిహ్నంగా గ్రూప్ కెప్టెన్ శుక్లాను రక్షణమంత్రి అభివర్ణించారు. “అయన భారత వైమానిక దళ యూనిఫాం ధరించినప్పటికీ, అంతరిక్షంలోకి ఆయన ప్రయాణం కేవలం సాయుధ దళాలు.. భారత్ తరపున మాత్రమే కాకుండా యావత్ మానవాళికి ప్రతినిధిగా సాగింది. ఈ చారిత్రక లక్ష్యం ద్వారా పౌర సేవల రంగానికి ఆయన అందించిన సహకారం చరిత్రలో నిలిచిపోతుంది” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
వ్యోమగాములను శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆరోగ్యపరంగా సిద్ధం చేయవలసిన అవసరం ఎంతో ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ పోషించిన కీలక పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. "ఆ సంస్థ విజయానికి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఒక గొప్ప నిదర్శనం" అని రక్షణమంత్రి వ్యాఖ్యానించారు.
గ్రూప్ కెప్టెన్ శుక్లా ఆక్సియమ్ మిషన్ 4లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించిన తన అసాధారణ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(रिलीज़ आईडी: 2160462)
आगंतुक पटल : 13