యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఖేలో ఇండియా తొలి జల క్రీడా పోటీల్లో 24 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్న అగ్రశ్రేణి జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్లు
జమ్మూకాశ్మీర్ లోని దాల్ సరస్సులో జరిగే తొలి జాతీయ స్థాయి ఓపెన్ ఏజ్ జల క్రీడల పోటీల్లో
ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళ జట్లపైనే అందరి దృష్టి
Posted On:
20 AUG 2025 6:19PM by PIB Hyderabad
జమ్మూకాశ్మీర్ లోని చారిత్రక దాల్ సరస్సులో జరగనున్న మొట్టమొదటి ఖేలో ఇండియా జల క్రీడల (కేఐడబ్ల్యూఎస్ఎఫ్) పోటీల్లో 24 స్వర్ణ పతకాల కోసం దేశంలోని ఉత్తమ జాతీయ అథ్లెట్లు పోటీపడనున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలో రోవింగ్, కానోయింగ్, కయాకింగ్ విభాగాల్లో 400 మందికి పైగా క్రీడాకారులు పతకాల కోసం పోటీ పడతారు.
ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న సమగ్ర ఓపెన్-ఏజ్ కేటగిరీ ఛాంపియన్షిప్. ఇందులోని మొత్తం 14 కయాకింగ్, కానోయింగ్ ఈవెంట్లు, 10 రోవింగ్ ఈవెంట్లు అన్నీ ఒలింపిక్ విభాగాలే. ఈ జల క్రీడల పోటీలకు మరింత ఆకర్షణ జోడించడానికి, వాటర్ స్కీయింగ్, శిఖరా బోట్ స్ప్రింగ్, డ్రాగన్ బోట్ రేస్ ప్రదర్శన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
కేఐడబ్ల్యూఎస్ఎఫ్ లో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. వీరిలో ముఖ్యంగా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళ రాష్ట్రాల అథ్లెట్లపై అందరి దృష్టి ఉంది. ఈ సారి సర్వీసెస్ జట్టు ఒక జట్టురూపంలో పోటీల్లో పాల్గొనకపోవడంతో, రాష్ట్రాల మధ్య పోటీ ఎలా ఉంటుందో, వారు ఎలా ప్రదర్శిస్తారో చూడటం ఆసక్తికరంగా మారనుంది. “ అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్రీడా ప్రణాళికను సిద్ధం చేశాం. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోటీల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాం” అని పోటీల మేనేజర్ బిల్కిస్ మీర్ (మాజీ వరల్డ్ కప్ కానోయిస్ట్, ఒలింపిక్ జడ్జి) తెలిపారు.
ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఖేలో ఇండియా క్యాలెండర్ కు కొత్తగా చేరింది. 2025లో రెండు కొత్త ఈవెంట్లను జత చేశారు. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ మే నెలలో డయ్యూలో జరిగాయి. ఖేలో భారత్ నియమం ప్రకారం, వాటర్ గేమ్స్, బీచ్ గేమ్స్ రెండింటినీ ప్రోత్సహించడం, పర్యాటకాన్ని ఆకర్షించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నారు.
కయాకింగ్, కానోయింగ్ కోసం నవంబర్లో ఉత్తరాఖండ్ లోని తెహ్రీలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌ను అర్హత ప్రమాణంగా తీసుకున్నారు. అందులో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టాప్ 15, ఫోర్స్ విభాగంలో టాప్ 8 జట్లు కేఐడబ్ల్యూఎస్ఎఫ్ లో పాల్గొంటున్నాయి. రోయింగ్ లో ఈ ఏడాది మార్చిలో భోపాల్ లో జరిగిన జాతీయ పోటీల్లో మొదటి 8 స్థానాల్లో నిలిచిన వారు పాల్గొంటారు.
ఈ పోటీలలో అంతర్జాతీయ ఆకర్షణ కూడా ఉంది. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్న ఆర్మీ రోవర్ అర్జున్ లాల్ జాట్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న 28 ఏళ్ల జాట్ 2022లో హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో రజతం సాధించాడు.
ఈ జల క్రీడల పోటీల్లో పురుషులు, మహిళల నుంచి దాదాపు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. పతకాల కోసం పోటీపడుతున్న 409 మంది అథ్లెట్లలో 202 మంది మహిళలు ఉన్నారు. మధ్యప్రదేశ్ (44), హర్యానా (37), ఒడిశా (34), కేరళ (33) కేఐడబ్ల్యూఎస్ఎఫ్ 2025లో అతిపెద్ద జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, గుజరాత్, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ నుంచి అతి చిన్న జట్లు పాల్గొంటున్నాయి.
కయాకింగ్, కానోయింగ్ విభాగాల్లో మూడు బంగారు పతకాలను తొలిరోజు గురువారం ప్రకటిస్తారు. చివరి రోజైన 23వ తేదీన రోయింగ్ ఫైనల్స్ జరుగుతాయి. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సేతో పాటు జమ్మూకాశ్మీర్ కు చెందిన ఇతర ప్రముఖులు పాల్గొంటారు.
గుల్మార్గ్ లో జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ తరువాత జమ్మూ కాశ్మీర్ లో రెండో ఖేలో ఇండియా ఈవెంట్ గా ఈ జల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. 2017-18లో ప్రారంభమైన ఖేలో ఇండియా అట్టడుగు స్థాయిలో క్రీడా సంస్కృతిని పెంపొందించడంతో పాటు ప్రతిభ గుర్తింపు, నిర్మాణాత్మక క్రీడా పోటీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
కేఐడబ్ల్యూఎస్ఎఫ్ కు సంబందించిన మరిన్ని వివరాలు www.water.kheloindia.gov.in. లో అందుబాటులో ఉన్నాయి.
***
(Release ID: 2158725)