ప్రధాన మంత్రి కార్యాలయం
దేశాధినేతల ప్రకటన: ఐరోపా కమిషన్, ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ అధ్యక్షురాలు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయెన్ భారత పర్యటన (ఫిబ్రవరి 27-28, 2025)
Posted On:
28 FEB 2025 6:05PM by PIB Hyderabad
ఈయూ-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం తమ దేశాల ప్రజలకు, విశాలమైన ప్రపంచ మంచికి సంబంధించిన ప్రయోజనాలను అందించిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఐరోపా కమిషన్ అధ్య క్షురాలు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌లు పునరుద్ఘాటించారు. 20 ఏళ్ల భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, 30 ఏళ్లకుపైగా భారత్-ఈసీ సహకార ఒప్పందం ఆధారంగా ఈ భాగస్వామ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఐరోపా సమాఖ్య కాలేజ్ ఆఫ్ కమిషనర్స్‌కు నేతృత్వం వహిస్తోన్న వాన్ డెర్ లేయెన్ ఫిబ్రవరి 27-28 తేదీల్లో భారత్‍లో చారిత్రాత్మక అధికారిక పర్యటన చేపట్టారు. కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐరోపా ఖండం వెలుపల చేపట్టిన మొదటి పర్యటన ఇది. భారత్-ఈయూ ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఇటువంటి పర్యటన మొదటిది.
బహుళ రకాల విభిన్న ప్రజా సమూహాలతో ఉన్న బహిరంగ మార్కెట్లైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న రెండు అతిపెద్ద ప్రజస్వామ్య దేశాలు శాంతి, స్థిరత్వం, ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధికి ఆధారంగా ఉంటూ అనేక దేశాలు నిర్ణయాలు తీసుకునే ప్రపంచ క్రమాన్ని రూపొందించటంలో క్రమాన్ని రూపొందించడంలో భారతదేశం, ఈయూ తమ నిబద్ధతను, భాగస్వామ్య ఆసక్తిని ప్రధానంగా తెలియజేశాయి.
ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యం, చట్ట పాలన, నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమంతో సహా భాగస్వామ్య విలువలు, సూత్రాలు భారత్‌ను, ఈయూను భావసారూప్య, నమ్మకమైన భాగస్వాములుగా చేస్తాయని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రపంచ సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించడానికి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి, పరస్పర శ్రేయస్సును ప్రోత్సహించడానికి రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం గతంలో కంటే ఇప్పుడు చాలా అవసరం అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వాణిజ్యం, పెట్టుబడులు, నూతనంగా వస్తోన్న కీలక సాంకేతికలు, ఆవిష్కరణలు, నైపుణ్యం, డిజిటల్, పరిశ్రమలను హరితమైనవిగా మార్చటం… అంతరిక్షం, జియోస్పేషియల్ రంగాలు.. రక్షణ రంగం, ప్రజల మధ్య సంబంధాల విషయంలో భారత్, ఐరోపా మధ్య సహకారాన్ని ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను వారు ప్రధానంగా తెలిపారు. వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు విషయంలో నియంత్రణ, అభివృద్ధి విషయంలో ఆర్థిక తోడ్పాటు, ఉగ్రవాదంతో సహా ఉమ్మడి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో పరస్పరం ఆధారపడాల్సి ఉన్న అవసరాన్ని వారు కీలకంగా ప్రస్తావించారు.
వాణిజ్యం, విశ్వసనీయ సాంకేతిక పరిజ్ఞానం, హరిత పరివర్తనల విషయంలో లోతైన సహకారం, వ్యూహాత్మక సమన్వయాన్ని పెంపొందించడంలో ఈ పర్యటన సందర్భంగా జరిగిన భారత, ఐరోపా సమాఖ్య వాణిజ్య, సాంకేతిక మండలి(టీటీసీ-భారత్, ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ) రెండో మంత్రి వర్గ సమావేశం సాధించిన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు.
ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్, భారత మంత్రుల మధ్య జరిగిన చర్చల ద్వారా వెలువడిన నిర్ణయాలను వారు స్వాగతించారు.
ఈ కింది విషయాలపై కట్టుబడి ఉన్నట్లు ఇరువురు నేతలు తెలిపారు:
I. భారత్ ఈయూ వాణిజ్య, ఆర్థిక సంబంధాలను పెంపొందించే విషయంలో ప్రాముఖ్యతను, దీని కేంద్రీకృతంగా ఉన్న ఇతర అంశాలను గుర్తిస్తూ.. సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన ప్రతిష్టాత్మక ఎఫ్‌టీఏ( స్పేచ్చా ఒప్పందం) కోసం సంప్రదింపులను ఒక సంవత్సరంలోగా పూర్తి చేసేందుకు బృందాలను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. మార్కెట్‌లను అందుబాటులో ఉండేలా పరిస్థితిని మెరుగుపరచాలని, వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి విశ్వసనీయ భాగస్వాములుగా పనిచేయాలని నేతలు అధికారులను కోరారు. పెట్టుబడుల రక్షణ ఒప్పందం, భౌగోళిక సూచికల ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను వారికి అప్పగించారు.
2. ఆర్థిక భద్రత, సరఫరా గొలుసుల ధృడత్వం, మార్కెట్లు అందుబాటులో ఉండటం, వాణిజ్యానికి సంబంధించిన అడ్డంకులు, సెమీకండక్టర్ వ్యవస్థల బలోపేతం.. విశ్వసనీయ, స్థిరమైన కృత్రిమ మేధస్సు.. అధిక సామర్థ్యం గల కంప్యూటింగ్, 6జీ, డిజిటల్ ప్రజా మౌలికసదుపాయుల.. విద్యుత్ వాహనాల బ్యాటరీలు, సముద్రాల్లో ప్లాస్టిక్ చెత్తను రీసైక్లింగ్, వ్యర్థాల నుంచి రీసైక్లింగ్ లేదా హరిత హైడ్రోజన్ ఉత్పత్తితో సహా విశ్వసనీయమైన భాగస్వామ్యాలు, పరిశ్రమలపై దృష్టి సారిస్తూ హరిత, స్వచ్ఛ ఇంధన సాంకేతికల విషయంలో సంయుక్త పరిశోధన, ఆవిష్కరణలు వంటి అంశాల్లో ఫలితాల ధారిత సహకారాన్ని రూపొందించడానికి భారత్-ఈయా వాణిజ్య, సాంకేతిక మండలికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల సరఫరా స్థితిని మెరుగుపరిచేందుకు, ఇరువురికి ఉపయోగపడే ప్రధాన బలాలను పెంపొందించడానికి, నైపుణ్య మార్పిడిని సులభతరం చేయడానికి.. విద్యార్థులు, యువ నిపుణులలో సెమీకండక్టర్లకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించేందుకు సెమీకండక్టర్ల విషయంలో అవగాహన ఒప్పందం అమలు దిశగా పురోగతిని వారు స్వాగతించారు. సురక్షితమైన, విశ్వసనీయమైన టెలికమ్యూనికేషన్స్, బలమైన సరఫరా గొలుసులను తయారు చేసేందుకు భారత్ 6జీ కూటమి, ఈయూ 6జీ స్మార్ట్ నెట్‌వర్స్స్ అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీ అసోసియేషన్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరగటాన్ని కూడా స్వాగతించారు.
3. అనుసంధానత, స్వచ్ఛ ఇంధనం, వాతావరణ మార్పు, నీరు, సుస్థిరమైన స్మార్ట్ పట్టణీకరణ, విపత్తు నిర్వహణ రంగాల్లో భారత్-ఈయూ భాగస్వామ్యాల కింద సహకారాన్ని మరింత విస్తరించడం, బలోపేతం చేయడంతోపాటు స్వచ్ఛ హైడ్రోజన్.. సముద్రాలపై పవన, సౌర విద్యుత్.. సుస్థిర పట్టణ రవాణా, విమానయానం, రైల్వేలు వంటి నిర్దిష్ట రంగాల్లో సహకారాన్ని ముమ్మరం చేయడానికి కృషి చేయాలి. ఈ సందర్భంగా భారత్-ఈయూ గ్రీన్ హైడ్రోజన్ ఫోరం, సముద్రాలపై పవన్ విద్యుత్ విషయంలో భారత్-ఈయూ వ్యాపార సదస్సు నిర్వహించేందుకు జరిగిన ఒప్పందాన్ని వారు స్వాగతించారు.
4. పరస్పర పురోగతిని సాధించడానికి, భవిష్యత్తులో ఉమ్మడి వ్యూహాత్మక ఎజెండాను నిర్దేశించేలా ఈయూ కమిషనర్లు, భారత మంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చల సందర్భంగా గుర్తించిన వాటిలో నిర్దిష్ట సహకారం కోసం నూతన విషయాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
5. దిల్లీలో జరిగిన జీ20 నేతల సదస్సు సందర్భంగా ప్రకటించిన భారత్- మధ్య ప్రాచ్యం-ఐరోపా ఆర్థిక నడవా (ఐఎంఈసీ) సాకారం కోసం పటిష్టమైన చర్యలు చేపట్టడం.. అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ), విపత్తులను తట్టుకొనే మౌలిక సదుపాయాల కూటమి(సీడీఆర్ఐ), లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్(లీడ్ఐటీ 2.0), ప్రపంచ జీవ ఇంధన కూటమికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌లలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.
6. ఉన్నత విద్య, పరిశోధన, పర్యాటకం, సంస్కృతి, క్రీడలు.. ఇరు దేశాల యువత, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ఈ విషయంలో వేగాన్ని పెంచేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలని నిర్ణయించారు. భారత్‌లో పెరుగుతున్న మానవ మూలధనం దృష్ట్యా, ఈయూ సభ్య దేశాల జనాభా తీరు, కార్మిక మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, నిపుణుల విషయంలో చట్టపరమైన, సురక్షితమైన, క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించనున్నారు.
అంతర్జాతీయ నియమాల ఆధారంగా ఏర్పడిన స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌ను ప్రోత్సహించడానికి, సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకుంటూ సమర్థవంతమైన ప్రాంతీయ సంస్థల మద్దతుతో వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తమ నిబద్ధతను నేతలు పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ మాహాసముద్రాల కార్యక్రమం(ఐపీఓఐ- ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్)లో ఈయూ చేరడాన్ని భారత్ స్వాగతించింది. ఆఫ్రికా, ఇండో-పసిఫిక్ సహా త్రైపాక్షిక సహకారాన్ని అన్వేషించడానికి ఇరు పక్షాలు కట్టుబడి ఉన్నట్లు ఇరువురు తెలిపారు.
భారత నావికాదళం, ఈయూ సముద్ర భద్రతా సంస్థల మధ్య సంయుక్త విన్యాసాలు, సహకారంతో సహా రక్షణ, భద్రతా రంగంలో పెరుగుతున్న సహకారంపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈయూ పర్మినెంట్ స్ట్రక్చర్డ్ కోఆపరేషన్(పెస్కో) కింద ప్రాజెక్టుల్లో చేరేందుకు, సమాచార భద్రత ఒప్పందం (ఎస్ఓఐఏ) కోసం చర్చల్లో పాల్గొనేందుకు భారత్ ఆసక్తి చూపడాన్ని ఈయూ స్వాగతించింది. భద్రత, రక్షణ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. వాణిజ్యం, సముద్ర మార్గాల రక్షణ కోసం సంప్రదాయ, సంప్రదాయేతర ముప్పులను ఎదుర్కోవడం ద్వారా సముద్ర భద్రతతో సహా అంతర్జాతీయ శాంతి, భద్రత విషయంలో తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఉగ్రవాద నిర్మూలనలో సహకారాన్ని పెంపొందించుకోవాలని.. సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు సహా ఉగ్రవాదాన్ని సమగ్రంగా, సుస్థిరంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వారు ప్రధానంగా తెలిపారు.
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం సహా కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి ఒప్పంద సూత్రాలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంపై గౌరవంతో ఉక్రెయిన్‌లో న్యాయమైన, శాశ్వత శాంతికి వారు మద్దతు పలికారు. ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా గుర్తింపు పొందిన సరిహద్దులతో శాంతి, భద్రతలతో పక్కపక్కనే మనగలిగే రెండు దేశాలు ఉండాలన్న పరిష్కారం విషయంలో తమ నిబద్ధతను పునరుద్ధాటించారు.
చర్చలకు సంబంధించిన ఫలితాలను, ముందుచూపు దృక్పథాన్ని గుర్తించిన ఇరువురు నేతలు ఈ కింది చర్యలను తీసుకునేందుకు అంగీకరించారు:
(i) ఎఫ్‌టీఏ దిశగా ప్రక్రియను సంవత్సరం చివరికి పూర్తి చేయటం.
(II) కొత్త కార్యక్రమాలు, చర్యల ద్వారా అవకాశాలను అన్వేషించడానికి రక్షణ పరిశ్రమ, విధానంపై మరింత దృష్టి సారించటం.
(iii) ఐఎంఈసీ కార్యక్రమాన్ని సమీక్షించేందుకు భాగస్వాములతో సమావేశం.
(iv) మదింపును పంచుకోవటం, సమన్వయం, పరస్పర పనితీరును ప్రోత్సహించే ఉద్దేశంతో సముద్రయాన రంగం అవగాహనపై పనిచేయటం.
(v) సెమీకండక్టర్లు, ఇతర కీలక సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు టీటీసీ తదుపరి సమావేశాన్ని త్వరితగతిన నిర్వహించటం.
(vi) హరిత హైడ్రోజన్‌పై దృష్టి సారిస్తూ ప్రభుత్వాలు, పరిశ్రమల మధ్య స్వచ్ఛ, హరిత ఇంధనంపై చర్చలను పెంపొందించడం.
(vii) త్రైపాక్షిక సహకార ప్రాజెక్టులతో సహా ఇండో-పసిఫిక్‌లో సహకారాన్ని బలోపేతం చేయడం.
(viii) సంసిద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలు, సమన్వయం కోసం విధాన, సాంకేతిక స్థాయి నిమగ్నతతో సహా తగిన ఏర్పాట్లను సృష్టించటం ద్వారా విపత్తు నిర్వహణపై సహకారాన్ని బలోపేతం చేయడం.
ఇరు ప్రాంతాల మధ్య సంబంధాల విషయంలో ఈ పర్యటన ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఇరువురు నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు, బలపరిచేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. పరస్పరం సౌకర్యవంతమైన సమయంలో భారత్‌లో జరగబోయే తదుపరి భారత ఈయూ శిఖరాగ్ర సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు, ఈ సమావేశం సందర్భంగా నూతన ఉమ్మడి వ్యూహాత్మక ఎజెండాను ఆమోదం పొందాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఆత్మీయ ఆతిథ్యానికి ఐరోపా సమాఖ్య అధ్యక్షులు వాన్ డెర్ లేయెన్ కృతజ్ఞతలు తెలిపారు.
***
(Release ID: 2158714)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam