జౌళి మంత్రిత్వ శాఖ
పత్తి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని సెప్టెంబరు 30 వరకు మినహాయించిన ప్రభుత్వం
Posted On:
19 AUG 2025 6:04PM by PIB Hyderabad
ముడి పత్తి దిగుమతులపై అన్ని రకాల కస్టమ్స్ సుంకాలను ప్రభుత్వం ఈ నెల (ఆగస్టు) 19 మొదలు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వర్తించేటట్లుగా మినహాయించింది. దేశీయ పత్తి ధరలు నిలకడగా ఉండేటట్లు చూడడంతో పాటు వస్త్ర పరిశ్రమకు మద్దతిచ్చే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పత్తి పై మొత్తం 11 శాతం దిగుమతి సుంకాన్ని కొంత కాలం పాటు తొలగించినట్లయింది.. దీనిలో 5 శాతం మౌలిక కస్టమ్స్ సుంకం (బీసీడీ), 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (ఐఏడీసీ)తో పాటు రెండింటి పైనా 10 శాతం సామాజిక సంక్షేమ సర్‌చార్జిని తొలగించడం కూడా భాగంగా ఉంది.
పరోక్ష పన్నుల, కస్టమ్స్ కేంద్ర మండలి (సీబీఐసీ) నోటిఫై చేసిన ఈనిర్ణయంతో నూలు, వస్త్రం, దుస్తులు, మేడ్-అప్స్ సహా జౌళి సంబంధిత వేల్యూ చైన్‌లో ఇన్‌పుట్ వ్యయాలు తగ్గడంతో పాటు తయారీదారులకే కాక వినియోగదారులకు కూడా అవసరమైన ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు.
జౌళి పరిశ్రమ పదే పదే కోరుతూవస్తున్న అంశాలను లెక్కలోకి తీసుకొని ఈ మినహాయింపును అమలులోకి తీసుకువచ్చారు. దేశీయంగా ధరలు పెరుగుతూ, సరఫరాలో లోటుపాట్లు ఎదురవుతున్న కారణంగా పత్తిపై దిగుమతి సుంకాలను తీసేయాలని జౌళి పరిశ్రమ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూవచ్చింది. ఈ సుంకాలను తాత్కాలికంగా తొలగించడంలో, ప్రభుత్వ ఉద్దేశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
• భారత మార్కెట్లో ముడి పత్తి అందుబాటును పెంచడం,
• పత్తి ధరలను స్థిరీకరించి, దీని ద్వారా తయారైన వస్త్ర ఉత్పాదనలపై ధరల పెరుగుదల సంబంధిత ఒత్తిడి తగ్గేటట్టు చూడటం,
• ఉత్పాదన ఖర్చులను తగ్గించి భారతీయ వస్త్ర ఉత్పాదనలు ఎగుమతుల పరంగా పోటీపడగలిగేటట్లు ప్రోత్సహించడం,
• ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ఎక్కువ ప్రభావం పడేది జౌళి రంగంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) పైనే కాబట్టి ఈ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడడం
తాజా చర్య దేశంలో పత్తి ధరలపై సానుకూల ప్రభావాన్ని ప్రసరింప చేయడంతో పాటు జౌళి, దుస్తుల రంగానికి చక్కని వెన్నుదన్నుగా నిలుస్తుందన్న అంచనా ఉంది. మన దేశంలో ఉపాధికల్పనలోను, ఎగుమతుల పరంగాను చెప్పుకోదగ్గ తోడ్పాటు అందిస్తున్న ముఖ్య రంగాల్లో జౌళి, దుస్తుల రంగం కూడా ఒకటి. ఈ నెల 19 నుంచి అమలులోకి వచ్చే విధంగా పత్తికి సంబంధించిన అన్ని రకాలను 11 శాతం దిగుమతి సుంకం నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివిధ జౌళి సంఘాలు స్వాగతించాయి. పరిశ్రమ చాలా కాలంగా కోరుతున్నా పెండింగు పడ్డ అంశాన్ని పరిశీలించినందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పాటు గౌరవ జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగుకు కూడా ఈ సంఘాలు ధన్యవాదాలను తెలియజేశాయి.
***
(Release ID: 2158282)
Visitor Counter : 7