రక్షణ మంత్రిత్వ శాఖ
ఆగస్టు 15 న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దేశభక్తి ప్రదర్శనలతో జాతిని ఉత్తేజపరచనున్న సాయుధ దళాలు, సీఏపీఎఫ్, ఆర్పీఎఫ్, ఎన్సీసీ బ్యాండ్లు
Posted On:
13 AUG 2025 6:28PM by PIB Hyderabad
భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ ప్రదేశాలలో సాయుధ దళాల బ్యాండ్‌లు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) బ్యాండ్‌లు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బ్యాండ్‌లు, నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) బ్యాండ్‌ల ప్రత్యక్ష ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ సంగీత కార్యక్రమాలు జాతీయ ఉత్సవాలకు ఒక లయను, ఔన్నత్యాన్ని జోడించి, స్ఫూర్తిదాయకమైన రాగాలు, క్రమశిక్షణతో కూడిన కళా ప్రదర్శనల ద్వారా ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయేలా దేశభక్తి స్ఫూర్తిని అనుభూతి చెందే అవకాశాన్ని కల్పిస్తాయి.

ప్రత్యక్ష ప్రదర్శనలు జరిగే ప్రదేశాలను, ఆయా ప్రదేశాలలో ప్రదర్శన ఇవ్వనున్న బ్యాండ్‌ల వివరాలను కింద చూడవచ్చు
వరస నెం.
|
ప్రదేశం
|
ప్రదర్శన ఇవ్వనున్న బ్యాండ్
|
1.
|
ఇండియా గేట్
|
భారత సైన్యం బ్యాండ్
|
2.
|
సెంట్రల్ పార్క్ సీపీ
|
భారత నావికాదళం బ్యాండ్
|
3.
|
కర్తవ్య పథ్
|
భారత వైమానిక దళం బ్యాండ్
|
4.
|
కుతుబ్ మినార్
|
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ బ్యాండ్
|
5.
|
విజయ్ చౌక్
|
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బ్యాండ్
|
6.
|
పురానా ఖిల్లా
|
భారత్- టిబెట్ సరిహద్దు పోలీస్ బ్యాండ్
|
7.
|
రెడ్ ఫోర్ట్
|
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం బ్యాండ్
|
8.
|
కేవీ సెక్షన్ 8 ఆర్కేపురం
|
సశస్త్ర సీమా బల్ బ్యాండ్
|
9.
|
నేషనల్ పోలీస్ మెమోరియల్
|
సరిహద్దు భద్రతా దళం బ్యాండ్
|
10.
|
నిజాముద్దీన్ రైల్వే స్టేషన్
|
రైల్వే రక్షక దళం బ్యాండ్
|
11.
|
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్
|
రైల్వే రక్షక దళం బ్యాండ్
|
ఘనమైన సంప్రదాయం: సైనిక బ్యాండ్‌ల పాత్ర - చరిత్ర
భారతదేశంలో సైనిక బ్యాండ్‌లు వలస పాలన కాలం నుంచి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కాలక్రమేణా జాతీయ ఐక్యత కు, గౌరవానికి చిహ్నంగా మారాయి. దశాబ్దాలుగా, సైనిక, నావిక, వైమానిక దళాల, వాటి అనుబంధ విభాగాల బ్యాండ్‌లు జాతీయ ఉత్సవాలు, విజయాలు, ప్రత్యేక లాంఛనాల సందర్భాలలో అంతర్భాగంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాలు, అధికార పర్యటనలు, స్మారకోత్సవాలలో ఈ బ్యాండ్‌లు శౌర్యం, త్యాగం, శాంతిని ప్రతిబింబించే సంగీత ధ్వనులను అందిస్తాయి. వాటి కచ్చితత్వం, క్రమశిక్షణ, సంగీత నైపుణ్యం అవి ప్రాతినిధ్యం వహించే సేవా విభాగాల నైతిక విలువలను సూచిస్తాయి.
సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీతో సహా దేశంలోని వివిధ పారామిలటరీ, పోలీసు దళాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఏపీఎఫ్ బృందాలు సంప్రదాయాన్ని ఆధునికతతో మిళితం చేస్తూ ఉత్సవ సందర్భాలకు తమ ప్రత్యేక బాణీని జోడిస్తాయి. ఆర్పీఎఫ్ బ్యాండ్ రైల్వేకు రక్షణ స్ఫూర్తిని తీసుకువస్తే, ఎన్సీసీ యువజన విభాగంగా, తన సొంత బ్యాండ్ ప్రదర్శనల ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందిస్తుంది.
జాతీయ ఐక్యతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - 2025
ఈ ఏడాది సంప్రదాయ వేదికలతో పాటు ఢిల్లీలోని ప్రధాన బహిరంగ ప్రదేశాలు, పార్కులు, సాంస్కృతిక కేంద్రాల్లో కూడా బ్యాండ్ల ప్రత్యక్ష ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. దేశభక్తి గీతాలు, మార్షల్ మ్యూజిక్, శాస్త్రీయ కృతులతో కూడిన సంపన్న సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇవి దేశం పట్ల గర్వభావాన్ని, జాతీయ సమైక్యతా భావనను ప్రేరేపించనున్నాయి.
సాయుధ దళాలు, సీఏపీఎఫ్, ఆర్పీఎఫ్, ఎన్సీసీ బ్యాండ్ ప్రదర్శనలు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గౌరవించడమే కాకుండా ఐక్యత, దేశభక్తి స్ఫూర్తిని బలపరుస్తాయి. ఆహ్లాదకరమైన, ఉత్తేజభరిత సంగీతం భారతదేశ వైవిధ్యమైన వారసత్వాన్ని, దాని సంరక్షకుల క్రమశిక్షణతో కూడిన అంకితభావాన్ని గుర్తు చేస్తుంది.
ఢిల్లీలో జరిగే బ్యాండ్ ప్రదర్శనలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మరింత ప్రతిష్ఠాత్మకంగా మార్చే దేశవ్యాప్త ప్రయత్నంలో భాగం. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే 96 నగరాలలోని వివిధ ప్రదేశాలలో ఈ బ్యాండ్ ప్రదర్శనలు జరగనున్నాయి.
పౌరులకు ఆహ్వానం
సంగీతం, దేశభక్తి సమ్మేళనంగా జరిగే ఈ అద్భుత ప్రదర్శనలను వీక్షించేందుకు పౌరులను ఆహ్వానిస్తున్నారు. ఇండియా గేట్, కన్నాట్ ప్లేస్ లేదా ఇతర వేదికలలో ఎక్కడైనా, బ్యాండ్ల మృదువైన స్వరాలు, శక్తిమంతమైన లయలు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని మరపురాని వేడుకగా మలచనున్నాయి. ఈ ప్రదర్శనలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి.
దేశ ఘనతను, గర్వాన్ని చాటే సింఫనీ ధ్వనులతో ఢిల్లీ మార్మోగే వేళ - ప్రతి హృదయంలో స్వాతంత్య్ర స్ఫూర్తి ప్రతిధ్వనించాలి!
***
(Release ID: 2156221)