ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4600 కోట్ల వ్యయంతో సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం
ఇండియా సెమీ కండక్టర్ మిషన్: కాంపౌండ్ సెమీకండక్టర్, అధునాతన ప్యాకేజింగ్ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న భారత్
Posted On:
12 AUG 2025 3:18PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద మరో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
ఇప్పటికే వివిధ దశల్లో అమల్లో ఉన్న ఆరు ఆమోదిత సెమీ కండక్టర్ ప్రాజెక్టులతో భారత్‌లోని సెమీ కండక్టర్ వ్యవస్థ వేగం పుంజుకుంటోంది. ఈ రోజు ఆమోదం పొందిన నాలుగు ప్రతిపాదనలు ఎస్ఐసీసెమ్, కాంటినెంటల్ డివైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సీడీఐఎల్), 3డీ గ్లాస్ సొల్యూషన్స్ ఐఎన్‌సీ, అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ (ఏఎస్ఐపీ) టెక్నాలజీల నుంచి వచ్చాయి.
ఆమోదం పొందిన ఈ నాలుగు ప్రతిపాదనలు సుమారుగా రూ.4,600 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసి 2034 మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పిస్తాయని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ తయారీ వ్యవస్థకు ప్రోత్సాహం పరోక్షంగా అనేక ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఈ రోజు మరో నాలుగు ప్రతిపాదనలను ఆమోదించడంతో ఐఎస్ఎం ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల మొత్తం సంఖ్య పదికి, మొత్తం పెట్టుబడులు 6 రాష్ట్రాల్లో రూ.1.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
టెలికాం, ఆటోమోటివ్, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులు, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్‌లో సెమీకండక్టర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా ఆమోదం పొందిన నాలుగు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఆత్మనిర్భర్ భారత్‌కు గణనీయంగా తోడ్పడతాయి.
ఎస్ఐసీసెమ్, త్రీడీ గ్లాస్ లను ఒడిశాలో నెలకొల్పుతారు. సీడీఐఎల్ పంజాబ్‌లో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఏఎస్ఐపీ ఏర్పాటవుతుంది.
ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న ఇన్ఫో వ్యాలీలో సిలికాన్ కార్బయిడ్ (ఎస్ఐసీ) ఆధారిత కాంపౌడ్ సెమీ కండక్టర్ సమీకృత తయారీ కేంద్రాన్ని యూకేకి చెందిన క్లాస్-సిక్ వేఫర్ ఫ్యాబ్ లిమిటెడ్ సహకారంతో ఎస్ఐసీసెమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తోంది. ఇది దేశంలోనే మొదటి వాణిజ్య కాంపౌండ్ తయారీ వ్యవస్థ అవుతుంది. సిలికాన్ కార్బయిడ్ పరికరాలను తయారు చేయాలని ఈ ప్రాజెక్టు ప్రతిపాదించింది. ఈ కాంపౌండ్ సెమీకండక్టర్ తయారీ వ్యవస్థకు ఏడాదికి 60,000 వేఫర్ల తయారీ, 96 మిలియన్ యూనిట్ల ప్యాకేజింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిపాదిత ఉత్పత్తులను క్షిపణులు, రక్షణ పరికరాలు, విద్యుత్ వాహనాలు (ఈవీలు), రైల్వే, ఫాస్ట్ ఛార్జర్లు, డేటా సెంటర్ ర్యాకులు, వినియోగ వస్తువులు, సోలార్ పవర్ ఇన్వర్టర్లలో ఉపయోగిస్తారు.
ఒడిశాలోని భువనేశ్వర్‌లో, ఇన్ఫో వ్యాలీలో సమీకృత అధునాతన ప్యాకేజింగ్, ఎంబెడెడ్ గ్లాస్ సబ్‌స్ట్రేట్ యూనిట్‌ను 3 డీ గ్లాస్ సొల్యూషన్స్ ఐఎన్‌సీ (త్రీడీజీఎస్) ఏర్పాటు చేస్తుంది. ఈ యూనిట్ అత్యంత ఆధునిక ప్యాకేజింగ్ సాంకేతికతను భారత్‌కు తీసుకువస్తుంది. ఈ తయారీ కేంద్రంలో పాసివ్స్, సిలికాన్ బ్రిడ్జిలు ఉన్న గ్లాస్ ఇంటర్ పోజర్, త్రీడీ హెటిరోజీనస్ ఇంటిగ్రేషన్ (3డీహెచ్ఐ) మాడ్యూళ్లతో సహా వివిధ రకాల అత్యాధునిక సాంకేతికతలు ఉంటాయి. ఏడాదికి 69,600 గ్లాస్ ప్యానెల్ సబ్‌స్ట్రేట్స్, 50 మిలియన్ అసెంబుల్డ్ యూనిట్లు, 13,200 త్రీడీహెచ్ఐ మాడ్యూళ్లను తయారు చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంటుంది. ప్రతిపాదిత ఉత్పత్తులను రక్షణ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఆర్ఎఫ్, ఆటోమేటివ్, ఫోటానిక్స్, కో-ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ తదితరమైన వాటిలో ఉపయోగిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో సెమీ కండక్టర్ తయారీ యూనిట్‌ను దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ సంస్థ సహకారంతో అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ (ఏఎస్ఐపీ) ఏర్పాటు చేస్తుంది. దీని వార్షిక సామర్థ్యం 96 మిలియన్ యూనిట్లు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను మొబైల్ ఫోన్లు, సెట్-టాప్ బాక్సులు, ఆటోమొబైల్ అప్లికేషన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.
పంజాబ్‌లోని మొహాలీలో తన ప్రత్యేక సెమీ కండక్టర్ తయారీ యూనిట్‌ను కాంటినెంటల్ డివైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సీడీఐఎల్) విస్తరించనుంది. సిలికాన్, సిలికాన్ కార్బయిడ్ ఉపయోగించి ఎంఓఎస్ఎఫ్ఈటీలు, ఐజీబీటీలు, షాట్కీ బైపాస్ డయోడ్లు, ట్రాన్సిస్టర్లు తరహా హై పవర్ డిస్క్రీట్ సెమీకండక్టర్ పరికరాలు ఇక్కడ తయారవుతాయి. ఇప్పటికే ఉన్న యూనిట్‌ను విస్తరించడం ద్వారా దీని వార్షిక సామర్థ్యం 158.38 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది. ప్రతిపాదిత యూనిట్లలో తయారు చేసే పరికరాలు ఈవీలు, వాటి చార్జింగ్ మౌలిక సదుపాయాలతో సహా ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, విద్యుత్ నిల్వ చేసే పరికరాలు, పారిశ్రామిక అప్లికేషన్లు, ప్రసార మౌలిక సదుపాయాల్లో ఉపయోగిస్తారు.
దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య కాంపౌండ్ తయారీ వ్యవస్థ, అత్యాధునిక గ్లాస్ ఆధారిత సబ్‌స్ట్రేట్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్‌తో సహా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులతో దేశంలో సెమీ కండక్టర్ల వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది.
278 విద్యా సంస్థలు, 72 అంకుర సంస్థలకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు అంతర్జాతీయ స్థాయి చిప్ రూపకల్పన సామర్థ్యాలను దేశంలో విస్తరించేందుకు ఉపకరిస్తుంది.
ఇప్పటికే 60,000 మందికి పైగా విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ప్రయోజనాలను పొందారు.
***
(Release ID: 2155594)