శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ ఎన్ఐఏబీలో దేశంలో మొదటి అత్యాధునిక జంతు మూలకణ బయోబ్యాంకు, ప్రయోగశాలను
ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
రూ. 19.98 కోట్ల వ్యయంతో బయోటెక్నాలజీ శాఖ ఆమోదించిన కొత్త హాస్టల్ బ్లాక్, టైప్-IV క్వార్టర్లకు శంకుస్థాపన
పరిశోధకులు, అధ్యాపకులు, సిబ్బందికి సౌలభ్యంతోపాటు విద్య, ఆవిష్కరణ వ్యవస్థకు ఊతమివ్వనున్న మౌలిక సదుపాయాలు
రోగ నిర్ధారణను మెరుగపరచడంతోపాటు ప్రతిసూక్ష్మజీవి నిరోధకతను ఎదుర్కొనేలా.. అయిదు అధునాతన పశువైద్య టెక్నాలజీల ఆవిష్కరణ
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక దృక్పథాన్ని ప్రశంసించిన మంత్రి... ఆయన కృషి వల్లే బయోటెక్నాలజీ బయో ఇ-3 విధానం అమలు, ఈ రంగంలో దేశ పురోగమనం
Posted On:
09 AUG 2025 4:20PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)లో దేశంలో మొదటి అత్యాధునిక జంతు మూలకణ బయోబ్యాంకు, జంతు మూలకణ ప్రయోగశాలలను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయ, అణు ఇంధన, అంతరిక్ష, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ప్రారంభించారు.
రూ.19.98 కోట్ల వ్యయంతో బయోటెక్నాలజీ విభాగం ఆమోదించిన కొత్త హాస్టల్ బ్లాక్, టైప్-IV క్వార్టర్లకు కూడా ఎన్ఐఏబీలో మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ మౌలిక సదుపాయాలు పరిశోధకులు, అధ్యాపకులు, సిబ్బందికి మెరుగైన సౌకర్యాలను అందించడం ద్వారా విద్యా బోధన, సృజనాత్మకతను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దుతాయి.
9,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 1.85 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక యానిమల్ బయోబ్యాంక్.. జంతువుల కోసం పునరుత్పత్తి ఔషధం, కణ సంబంధిత చికిత్సలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మూలకణ వర్ధన యూనిట్, 3డీ బయోప్రింటర్, బాక్టీరియల్ కల్చర్ ల్యాబ్, క్రయో స్టోరేజ్, ఆటోక్లేవ్ గదులు, అధునాతన వాయు నిర్వహణ వ్యవస్థలు, అంతరాయం లేని పవర్ బ్యాకప్‌తో కూడిన ఈ ప్రయోగశాల.. వ్యాధి చిత్రణ, టిష్యూ ఇంజినీరింగ్, పునరుత్పత్తి సంబంధిత బయోటెక్నాలజీలో పరిశోధనలను ముందుకు తీసుకువెళుతుంది.
బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (డీబీటీ- బీఐఆర్ఏసీ) పరిధిలో ఉన్న నేషనల్ బయోఫార్మా మిషన్ (ఎన్‌బీఎం) సహకారంతో.. జంతు మూల కణాలు, వాటి ఉత్పన్నాల బయోబ్యాంకింగుకు వీలుగా ఈ కేంద్రాన్ని విస్తరించనున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక దృక్పథం వల్లే బయోటెక్నాలజీ బయో ఇ-3 విధానం అమలు సాధ్యమైందని మంత్రి ప్రశంసించారు. తద్వారా ఈ రంగంలో వివిధ కార్యక్రమాలను ముందుగానే ప్రారంభించి పురోగమించే అవకాశం మన దేశానికి కలిగిందన్నారు.
జంతు ఆరోగ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తేవడంతోపాటు ‘వన్ హెల్త్’ విధానానికి అనుగుణంగా రూపొందించిన అయిదు వినూత్న పశువైద్య రోగనిర్ధారణ సాధనాలను ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు:
1. బ్రూసెల్లోసిస్‌ను వేగంగా గుర్తించడం – బ్రూసెల్లా జాతులను ముందస్తుగా, కచ్చితంగా గుర్తించడం కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు అనువుగా రూపొందించిన రోగ నిర్ధారణ సాధనం. ఇది వ్యాధి సోకిన జంతువులను వ్యాక్సిన్ వేసిన జంతువుల నుంచి వేరు చేయగలదు.
2. పొదుగు వాపును గుర్తించే సాంకేతికత – పాడి పశువుల్లో పొదుగువాపును (లక్షణాలు కనిపించని, కనిపించే) గుర్తించడం కోసం తక్కువ ఖర్చుతో క్షేత్రస్థాయిలో చేయగల రోగనిర్ధారణ పరీక్ష.
3. యాంటీ మైక్రోబయల్ సెన్సిటివిటీ టెస్టింగ్ పరికరం – రెండు గంటల్లో ఫలితాలను అందించగల చిన్న సాధనమిది. యాంటీబయాటిక్‌లను బాధ్యతాయుతంగా వినియోగించేలా ప్రోత్సహిస్తుంది.
4. టాక్సోప్లాస్మోసిస్ గుర్తింపు కిట్ – జంతువుల్లో టాక్సోప్లాస్మా గోండి వ్యాధికి సంబంధించి సునిశిత, నిర్దిష్ట పరీక్ష.
5. మెదడువాపు (జపనీస్ ఎన్సెఫాలిటిస్) గుర్తింపు కిట్ – జంతువులు, మానవుల్లో విస్తృతంగా పరిశీలన కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన రాపిడ్ స్ట్రిప్.
ఈ ఆవిష్కరణలు వ్యవసాయాధారిత జీడీపీకి ఊతమిస్తాయని, పశువుల ఉత్పాదకతను మెరుగుపరుస్తాయని, పశుసంవర్ధక రంగంలో ‘సతతహరిత విప్లవానికి’ మార్గం సుగమం చేస్తాయని మంత్రి పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... “డాక్టర్ రాజేశ్ గోఖలే నేతృత్వంలో బయోటెక్నాలజీ విభాగం భారత్‌ను భవిష్యత్ సన్నద్ధంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో కృషిచేస్తుండడం సంతోషాన్నిస్తోంది. బయోటెక్నాలజీ చోదకంగా నడిచే తదుపరి పారిశ్రామిక విప్లవంలో మనం వెనుకబడి ఉండబోము. తయారీ నుంచి పునరుత్పత్తి, జన్యు ప్రక్రియల దిశగా ఆర్థిక వ్యవస్థలో మార్పులొస్తాయి. భారత్ ఇప్పటికే దీనిని అందిపుచ్చుకుంది. ఇదే మంచి తరుణం. విధాన రూపకర్తల నుంచి, ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విశేషంగా సహకరిస్తున్నారు. బయో ఇ-3 విధానం వంటి కార్యక్రమాల దీర్ఘకాలిక ఔచిత్యాన్ని ఆయన స్పష్టంగా గుర్తించారు” అని అన్నారు.
అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫండ్ (ఏఎన్ఆర్ఎఫ్) కింద ఇటీవల ప్రకటించిన రూ. లక్ష కోట్ల ఆర్డీఐ నిధి ప్రైవేటు రంగ పరిశోధన - అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహాన్నిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ అగ్రస్థానానికి చేరుకునేందుకు అది వీలు కల్పిస్తుందన్నారు.
వృక్ష, జంతు, మానవ ప్రపంచాలను బయోటెక్నాలజీ విభాగం ఒకే ఛత్రం కింద ప్రత్యేకంగా అనుసంధానిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అంతరిక్ష విభాగంతో సమన్వయంతోపాటు అంతరిక్ష ప్రయోగాలకు భారత్ అందించిన సహకారాన్ని ఆయన ఉదాహరించారు. అంతరిక్ష వైద్యం, అంతరిక్ష శరీరధర్మ శాస్త్రం వంటి అధునాతన రంగాల్లోనూ పురోగతి సాధిస్తామన్నారు.
వ్యవసాయ రంగాన్నుద్దేశించి మాట్లాడుతూ... “జంతువుల ద్వారా జరిగే వ్యవసాయ ఉత్పాదకతలో ‘సతతహరిత విప్లవం’ వంటి ఓ కొత్త దశకు ఇది నాంది. పశు వైద్య రంగంలో ఆవిష్కరణలు వ్యవసాయ రంగంపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపుతాయి. జీడీపీలో 18 శాతంతోపాటు 60 శాతం శ్రామిక శక్తి ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి ఇవి అత్యంత కీలకమైనవి. వ్యవసాయ పరిశోధన కోసం వెచ్చించే ఒక్కో రూపాయి రూ. 13 రాబడిని అందిస్తుంది. తొలిరోజు నుంచే పారిశ్రామిక భాగస్వాములను అనుసంధానించడం వల్ల ఈ సాంకేతికతలు క్షేత్రస్థాయికి చేరుకునేలా చూస్తుంది” అని అన్నారు.
బ్రూసెల్లోసిస్, పొదుగు వాపు, టాక్సోప్లాస్మోసిస్ వంటి వ్యాధుల గురించి రైతులకు అవగాహన అవసరమన్నారు. చాలా మంది పశు యజమానులకు రోగ నిర్ధారణ, చికిత్స విధానాల గురించి తగినంత అవగాహన లేదన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ జితేంద్ర సింగ్ రైతులతో సంభాషించారు. రైతు సంక్షేమం, గ్రామీణ శ్రేయస్సుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమితంగా ప్రాధాన్యమిస్తున్నారని వివరించారు. పశువుల యజమానులు ఆధునిక రోగ నిర్ధారణ సాధనాలను ఉపయోగించాలని, వ్యాధి నివారణ చర్యలను అవలంబించాలని ఆయన కోరారు. ముందస్తుగా గుర్తించడం ద్వారా జంతువుల ప్రాణాలను కాపాడుకోవడంతోపాటు వ్యవసాయ ఆదాయాలను కూడా పెంచుకోవచ్చని వివరించారు.
దేశంలో మొదటి జంతు మూల కణ బయోబ్యాంకు ఏర్పాటుకు కృషిచేసిన ఎన్ఐఏబీ డైరెక్టర్ డాక్టర్ తరు శర్మను ఆయన ప్రశంసించారు. “మానవ మూల కణాలకు సంబంధించి ఇలాంటి కేంద్రాలున్నాయి. కానీ, జంతు కణాలకు సంబంధించి అవి చాలా అరుదు. ఎన్ఐఏబీ అత్యున్నతంగా ఎదగబోతోంది.. భారత బయోటెక్నాలజీ అత్యున్నతంగా నిలవబోతోంది’’ అని ఆయన అన్నారు.
***
(Release ID: 2154852)