ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అందరికీ ఆర్థిక సేవల లభ్యతను పటిష్ఠపరిచే దిశగా పలు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. 2014 నుంచి ఇప్పటివరకు 55.90 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ప్రారంభం


* ‘‘ముద్రా యోజన’ను ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకు రూ.35.13 లక్షల కోట్లకు మించిన దాదాపు 54 కోట్ల రుణాలు మంజూరు

* రుణ మదింపును బలోపేతం చేయడానికి, సంఘటిత రుణ లభ్యతను పెంచడానికి టెక్నాలజీతో పాటు ప్రత్యామ్నాయ సమాచార సేకరణ పద్ధతిని వినియోగించుకొంటున్న ప్రభుత్వం

Posted On: 04 AUG 2025 6:17PM by PIB Hyderabad

ఆర్థిక వ్యవస్థలో భాగమైన వివిధ సేవలు జనాభాలో అధిక శాతం మందికి చేరేటట్లుగా చూడటానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసింది. రుణ లభ్యత సహా సంఘటిత ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు చాలా మందికి అందేందుకు వీలుగా బ్యాంకింగ్ రంగ మౌలిక సేవలు వారికి దక్కే ఏర్పాట్లు కూడా చేసింది. ‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’ (పీఎంజేడీవై)ని 2014 ఆగస్టులో ప్రారంభించారు. దీంతో.. బ్యాంకు సేవలను అందుకోకుండా అల్లంత దూరంలో నిలిచిపోయిన వర్గాలకు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లను తెరవడం సులభమైంది. రూపే డెబిట్ కార్డులు, ఓవర్‌డ్రాఫ్టు సౌకర్యం వంటి అదనపు హంగులను కూడా ఈ అకౌంట్లకు జతచేశారు. ఇంతవరకు, ప్రజలు పీఎంజేడీవై కింద 55.90 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలను తెరిచారు.

సమాజంలో రుణ పథకాలను ఎంత ఎక్కువ మందికి అందిస్తే డిపాజిట్లు అంత ఎక్కువగా సమకూరతాయనే ఉద్దేశంతో, ప్రభుత్వం ఇతరత్రా అంశాలకు తోడు అనేక చర్యలు చేపట్టింది. ఇంతకాలం ఆర్థిక సహాయానికి నోచుకోని వారికి ఆర్థిక సాయాన్ని అందించడంపై దృష్టి కేంద్రీకరించింది:

     i. ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ను (పీఎంఎంవై) ప్రారంభించారు. ఈ  పథకంలో భాగంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రూ.20 లక్షల వరకు ఎలాంటి  పూచీకత్తు అడగకుండా రుణాలు అందిస్తున్నారు. స్వయంఉపాధికి, ఆదాయార్జనకు అండగా నిలవాలనేదే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఈ  పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.35.13 లక్షల కోట్ల విలువైన 53.85 కోట్ల రుణాలను మంజూరు చేశారు.

     ii. స్టాండప్ ఇండియా (ఎస్‌యూపీఐ), పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (‘పీఎంస్వనిధి’), పీఎం విశ్వకర్మ వంటి ప్రత్యేక పథకాలకు తోడు,

రుణాల లభ్యతను ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి, పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఆసక్తిని, ఉత్సాహాన్ని కనబరిచే మహిళలకు, వీధుల్లో తిరుగుతూ సరకులు విక్రయించే వారికి, చేతివృత్తి కళాకారులకు, ఇతర చిరు వ్యాపారులకు విస్తరించే ఉద్దేశంతో ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని’ (పీఎంఈజీపీ)ని కూడా అమల్లోకి తెచ్చారు.

     iii. రుణ హామీ వ్యవస్థలు: వీటిలో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ (సీజీఎఫ్ఎంయూ), క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) భాగంగా ఉన్నాయి. ఇవి రుణదాత సంస్థలకు నష్టభయాన్ని (రిస్క్) తగ్గించడంతో పాటు ఈ తరహా సేవలను అంతగా అందుకోని వర్గాల వారికి సాంప్రదాయక రుణాలను మంజూరు చేసిన పక్షంలో ప్రోత్సాహకాలను కూడా అందిస్తాయి.

ఎప్పుడూ రుణాలు తీసుకోని వ్యక్తుల విషయంలో ఎంత మేరకు రుణాన్ని ఇవ్వవచ్చన్న అంచనా రూపొందించడానికి టెక్నాలజీతో పాటు ప్రత్యామ్నాయ సమాచార వనరులను ప్రభుత్వం వినియోగించుకొంటోంది:

     i. స్వయంసహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) రుణస్వీకర్తలతో పాటు రైతులు, నిరాదరణకు గురైన వర్గాల వారు సహా గ్రామీణుల రుణాల తిరిగి చెల్లింపు స్తోమతను తెలుసుకోవడం కోసం గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ పద్ధతిని తెచ్చారు. ఈ పద్ధతి రుణ మంజూరుకు సంబంధించిన నాణ్యతను, ఉద్దేశాన్ని పక్కాగా నెరవేర్చుతుందని, పల్లె  ప్రాంతాలలో సంఘటిత  రుణ సదుపాయాన్ని మెరుగుపరచగలుగుతుందని భావిస్తున్నారు.

     ii. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు అనుసరిస్తున్న ఎంఎస్ఎంఈ న్యూ డిజిటల్ క్రెడిట్ అసెస్‌మెంట్ ఫ్రేంవర్క్ కచ్చితత్వంతో కూడిన, త్వరితగతి మదింపు కోసం ఆదాయపు పన్ను రిటర్నులు, జీఎస్‌టీ నివేదికలు, వివిధ సేవలకు చేసిన చెల్లింపుల సమగ్ర సమాచారాన్ని వినియోగించుకుంటున్నాయి.

     iii. రుణాలు తీసుకోదలుస్తున్న వర్గాలను వారికి తగిన ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడానికి ‘జన్ సమర్థ్ పోర్టల్’ పేరుతో ఒక ఏకీకృత డిజిటల్ వేదికను ప్రారంభించారు. దీంతో పారదర్శకత పెరిగి, దరఖాస్తుల పరిష్కారానికి పట్టే కాలం తగ్గడమే కాక మరింత ఎక్కువ మందికి చేరుకొనేందుకు వీలవుతోంది.

దీనికి అదనంగా, ప్రాధాన్య రంగాలకు రుణాల మంజూరు (పీఎస్ఎల్) లక్ష్యాలను చేరుకొని తీరాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆదేశిస్తోంది. వ్యవసాయ, సూక్ష్మ- చిన్న పరిశ్రమల రంగాలతో పాటు బలహీన వర్గాలు, ఆర్థిక వ్యవస్థలో భాగం కాలేకపోయిన ప్రాంతాల వంటి వాటికి రుణాలు అందేటట్లు చూడటానికే ఆర్‌బీఐ ఈ మేరకు ఆదేశించింది. ఇలా వివిధ చర్యల ద్వారా, ఆర్థిక వ్యవస్థలో భాగం పంచుకోవడం అంటే అది ఒక్క బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటానికే పరిమితం  కాకుండా, అంతకు మించిన స్థాయిలో రుణాలు తక్కువ వడ్డీకి సకాలంలో సమాజంలోని అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండేటట్లు చేస్తూ, అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యం.

ఈ సమాచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ  పంకజ్ చౌధరి లోక్‌సభలో ఈ రోజు ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.‌

 

***


(Release ID: 2152832)