వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత ఆగస్టు 2న విడుదల
· వారణాసి నుంచి విడుదల చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
· కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం.. సన్నాహకాలపై సమీక్ష
· దేశవ్యాప్త కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రైతుల ఖాతాల్లోకి...
Posted On:
30 JUL 2025 2:00PM by PIB Hyderabad
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం తదుపరి విడత ఆగస్టు 2న విడుదల కానుంది. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈ రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు. వారణాసిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం కలగనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 731 కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), వ్యవసాయ విశ్వవిద్యాలయాల డైరెక్టర్లు, వైస్ చాన్సలర్లు, అధిపతులు వర్చువల్‌గా ఈ సమావేశానికి హాజరయ్యారు.
జాతీయ, రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిల్లో రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీన్ని దేశవ్యాప్త కార్యక్రమంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కేవీకేలకు దిశానిర్దేశం చేస్తూ.. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో రైతులకు మూడు విడతల్లో రూ.6,000 బదిలీ చేస్తున్నామని, నాలుగు నెలలకోసారి ఒక్కో విడతను మంజూరు చేస్తున్నట్లు చౌహాన్ తెలిపారు. ఈ ప్రక్రియలో కేవీకేలు కీలక పాత్ర పోషిస్తాయి. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలనీ.. రైతుల ఖాతాల్లోకే నేరుగా ధనాన్ని బదిలీ చేసి, ప్రజల్లో అవగాహన కలిగించే ఈ కార్యక్రమాన్ని ఓ పండుగగా, మిషన్‌గా నిర్వహించాలని సూచించారు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందడంతోపాటు వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలపట్ల అవగాహనను పెంపొందించుకోవడానికి ఇదో మంచి అవకాశమన్న కేంద్ర మంత్రి.. ఆగస్టు 2న జరిగే కార్యక్రమంలో క్రియాశీలంగా భాగస్వాములు కావాలని రైతులను కోరారు.
ఈ కార్యక్రమం గురించి సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి కృషి సఖీలు, డ్రోన్ దీదీలు, బ్యాంక్ సఖీలు, పశు సఖీలు, బీమా సఖీలు, గ్రామ పంచాయతీ సర్పంచుల వంటి క్షేత్రస్థాయి కార్యకర్తలను ఉపయోగించుకోవాలని అధికారులను శ్రీ చౌహాన్ ఆదేశించారు. ఈ సమయంలోని ఖరీఫ్ పంటల గురించి రైతులతో చర్చించడం ద్వారా.. వారి భాగస్వామ్యాన్ని మరింతగా పెంచవచ్చని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి మోదీ మార్గనిర్దేశంలో పూర్తిస్థాయి భాగస్వామ్యం, అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం కలిగేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని శ్రీ చౌహాన్ పునరుద్ఘాటించారు.
2019లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి 19 విడతల్లో రూ. 3.69 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. 20వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లు బదిలీ చేయనున్నారు.
వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ దేవేశ్ చతుర్వేది, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్, వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2150495)
Read this release in:
English
,
Assamese
,
Urdu
,
Hindi
,
Marathi
,
Nepali
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada