రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రళయ్ క్షిపణి వరుస పరీక్షలు విజయవంతం రెండుసార్లు నిర్వహించిన డీఆర్డీవో
Posted On:
29 JUL 2025 12:53PM by PIB Hyderabad
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ప్రళయ్ క్షిపణిని వరుసగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం ద్వీపం నుంచి జూలై 28, 29 తేదీల్లో నిర్వహించిన ఈ రెండు పరీక్షలు విజయవంతమయ్యాయి. అధికారికంగా సైనిక దళ సేవల్లోకి తీసుకునే సమీక్ష ప్రక్రియలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించి.. ఈ క్షిపణి గరిష్ట, కనిష్ట పరిధి సామర్థ్యాన్ని ధ్రువీకరించారు. క్షిపణులు కచ్చితంగా నిర్దేశిత మార్గంలో ప్రయాణించి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించాయి. పరీక్షలు ప్రమాణాలన్నింటినీ అందుకున్నాయి. ఉపకరణాలన్నీ ఆశించిన మేరకు పనిచేశాయి. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా మోహరించిన ట్రాకింగ్ సెన్సార్లు, నిర్దేశిత లక్ష్య ప్రదేశానికి సమీపంలో నిలిపిన ఓడలో ఏర్పాటు చేసిన పరికరాల నుంచి సేకరించిన టెస్ట్ డేటా ఆధారంగా వీటిని ధ్రువీకరించారు.

ప్రళయ్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఘన ఇంధనంతో నడిచే పాక్షిక బాలిస్టిక్ క్షిపణి. అత్యాధునిక నిర్దేశక, చోదక వ్యవస్థలను ఉపయోగించి అత్యంత కచ్చితత్వాన్ని సాధించారు. ఈ క్షిపణి వివిధ లక్ష్యాల దిశగా పలు రకాల ఆయుధాలను మోసుకెళ్లగలదు. డీఆర్డీవో ప్రయోగశాలలైన రక్షణ పరిశోధన - అభివృద్ధి ప్రయోగశాల, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ, ఆయుధ పరిశోధన - అభివృద్ధి సంస్థ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ, రక్షణ ధాతు పరిశోధన ప్రయోగశాల, టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లేబొరేటరీ, పరిశోధన - అభివృద్ధి సంస్థ (ఇంజినీర్స్), ఐటీఆర్ మొదలైన ఇతర డీఆర్డీవో ప్రయోగశాలల సహకారంతో... ఇమారత్ పరిశోధన కేంద్రం ఈ వ్యవస్థను రూపొందించింది. పారిశ్రామిక భాగస్వాములు - భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అనేక ఇతర పరిశ్రమలు, ఎమ్ఎస్ఎంఈలు.
ఈ ప్రయోగాన్ని డీఆర్డీవో సీనియర్ శాస్త్రవేత్తలు, భారత వైమానిక దళం, భారత సైన్యం ప్రతినిధులు, పరిశ్రమ ప్రతినిధులు వీక్షించారు.
క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో, సాయుధ దళాలు, సంబంధిత పరిశ్రమలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఆధునిక సాంకేతికతలతో రూపొందించిన ఈ క్షిపణి.. భద్రతా దళాల సామర్థ్యాన్ని మరింతగా పెంచడంతోపాటు ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతుందని ఆయన అన్నారు.
రక్షణ శాఖ పరిశోధన – అభివృద్ధి కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ ఈ పరీక్షలో భాగస్వాములైన అన్ని బృందాలను అభినందించారు. విజయవంతంగా పూర్తిచేసిన ఈ మొదటి దశ పరీక్షలతో అతి త్వరలోనే ఈ వ్యవస్థ సాయుధ దళాల్లో అంతర్భాగమయ్యేలా మార్గం సుగమం చేశాయన్నారు.
***
(Release ID: 2149806)