రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రచ్ఛన్న యుద్ధానికి దిగిన పాకిస్థాన్ ను శిక్షించడమే ఆపరేషన్ సిందూర్ ఏకైక రాజకీయ, సైనిక లక్ష్యం: పక్కా ప్రణాళికతోనూ, భారత్ పట్ల ముందునుంచీ ఉన్న అసహనంతోనూ పాక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది: లోక్ సభలో రక్షణ మంత్రి
సైనిక సామర్థ్యాన్ని, జాతీయ సంకల్పాన్ని, నైతికతను, రాజకీయ చతురతను ప్రదర్శించిన భారత్
భారత్ వంటి బాధ్యతాయుతమైన దేశం ఆశించే పరిణతి, వ్యూహాత్మక వివేకాన్ని మన సైనిక నాయకత్వం ప్రదర్శించింది: రక్షణ మంత్రి
“పాకిస్థాన్ మళ్లీ ఏదైనా దుర్మార్గపు చర్యకు ప్రయత్నిస్తే మరింత తీవ్రమైన, నిర్ణయాత్మక చర్యకు మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం”
“భారతదేశాన్ని వెయ్యి ముక్కలుగా చేయాలని కలలు కంటున్నవారు ప్రధాని మోదీ నేతృత్వంలోని కొత్త భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎంత దూరమైనా వెళ్ళగలదనే వాస్తవాన్ని మరచిపోకుండా ఉండడం మంచిది”
దేశ సమైక్యత, సమగ్రత, భద్రత కోసం అవసరమైన ప్రతి చర్యను తీసుకోవడానికి ప్రభుత్వం, సాయుధ దళాలు, ప్రజాస్వామ్య సంస్థలు కట్టుబడి ఉన్నాయని జాతికి హామీ ఇచ్చిన శ్రీ రాజ్ నాథ్ సింగ్
Posted On:
28 JUL 2025 5:30PM by PIB Hyderabad
“ఆపరేషన్ సిందూర్ లక్ష్యం సరిహద్దు దాటి వెళ్లడం, భూభాగాన్ని ఆక్రమించడం కాదు. పాకిస్థాన్ సంవత్సరాలుగా పెంచి పోషించిన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం, సీమాంతర దాడుల్లో తమ ప్రియమైనవారిని కోల్పోయిన అమాయక కుటుంబాలకు న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశం” అని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు లోక్‌సభలో స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం యాదృచ్ఛిక ఉన్మాదం కాదని, దాని వెనుక " ప్రణాళికాబద్ధమైన వ్యూహం, మూర్ఖత్వ అసహనం" ఉన్నాయని ఆయన అభివర్ణించారు, ఉగ్రవాదం రూపంలో ప్రచ్ఛన్న యుద్ధం చేసిన పాకిస్థాన్ ను శిక్షించడమే ఆపరేషన్ సిందూర్ మొత్తం రాజకీయ, సైనిక లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ లో భారత్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, తన జాతీయ సంకల్పం, నైతికత, రాజకీయ చతురతను కూడా ప్రదర్శించిందని, ఏ ఉగ్రవాద దాడికైనా న్యూఢిల్లీ నిర్ణయాత్మకమైన, స్పష్టమైన సమాధానం ఇస్తుందని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. ఉగ్రవాదానికి ఆశ్రయం, మద్దతు ఇచ్చే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఎలాంటి అణ్వస్త్ర బెదిరింపులకు, ఇతర ఒత్తిళ్లకు భారత్ తలొగ్గబోదని స్పష్టం చేశారు.
2025 ఏప్రిల్ 22న ఒక నేపాలీ పౌరుడితో సహా 25 మంది అమాయకులను వారి మతం ప్రాతిపదికన హతమార్చిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని అమానవీయతకు అత్యంత దుర్మార్గమైన ఉదాహరణగా రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. దాడి జరిగిన వెంటనే ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారని, విచక్షణ, వ్యూహాత్మక అవగాహన, ప్రాంతీయ భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాత్మక చర్యలు తీసుకునే స్వేచ్ఛను సాయుధ దళాలకు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
"2025 మే 6,7 తేదీలలో భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించాయి. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. భారతదేశ సార్వభౌమత్వం, దాని గుర్తింపు, దేశ ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యతనూ, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన విధానాన్నీ సమర్థవంతంగా, నిర్ణయాత్మకంగా ప్రదర్శించిన చర్య. మన సైనిక నాయకత్వం తన పరిణతిని మాత్రమే కాకుండా, భారత్ వంటి బాధ్యతాయుతమైన దేశం ఆశించే వ్యూహాత్మక విచక్షణను కూడా ప్రదర్శించింది" అని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
ప్రతి కోణాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ ను చేపట్టాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. “ పలు అవకాశాలను పరిశీలించిన మీదట ఉగ్రవాదులను, వారి స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసే లక్ష్యాన్ని నిర్డేశించుకున్నారు. పాకిస్థాన్ లోని సాధారణ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండే మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక అంచనా ప్రకారం, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక స్థావరాలపై మన దళాలు అత్యంత సమన్వయంతో జరిపిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, నిర్వాహకులు, సహచరులు మరణించారు. ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందినవారు. వీటికి పాక్ సైన్యం, ఐఎస్ఐల బహిరంగ మద్దతు ఉంది. మా చర్య పూర్తిగా ఆత్మరక్షణ కోసమే. ఇది రెచ్చగొట్టేది కాదు, విస్తరణవాదం కూడా కాదు” అని అని రక్షణ మంత్రి వివరించారు.
మే 10, 2025 న, పాకిస్థాన్ భారతదేశంపై క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు, ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలను ప్రయోగించిందని, ఎలక్ట్రానిక్ యుద్ధానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, భారత వైమానిక దళ స్థావరాలు, భారత సైన్యానికి చెందిన మందుగుండు డిపోలు, విమానాశ్రయాలు సైనిక కంటోన్మెంట్లను లక్ష్యంగా చేసుకుందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ, కౌంటర్ డ్రోన్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ పరికరాలు పాక్ దాడిని పూర్తిగా భగ్నం చేశాయని ఇందులో S-400, ఆకాశ్ మిసైల్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ గన్ ల సామర్థ్యం స్పష్టంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు.
“మన భద్రతా వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. ప్రతి దాడిని తిప్పికొట్టాం. భారత లో ఏ ఒక్క లక్ష్యాన్నీ పాక్ దెబ్బ కొట్టలేకపోయింది. ముఖ్యమైన ఆస్తులకు నష్టం జరగలేదు” అని చెబుతూ, సైనికుల ధైర్యసాహసాలు, దృఢ సంకల్పాన్ని రక్షణ మంత్రి కొనియాడారు.
పాక్ దాడిపై భారత్ స్పందించిన తీరు సాహసోపేతంగా, దృఢంగా, సమర్థవంతంగా ఉందని రక్షణ మంత్రి అభివర్ణించారు. “భారత వైమానిక దళం పశ్చిమ ఫ్రంట్ లోని పాక్ వైమానిక స్థావరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, సైనిక మౌలిక సదుపాయాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను లక్ష్యంగా చేసుకుంది. మన ప్రతీకార దాడి వేగంగా, నిష్పాక్షికంగా, కచ్చితత్వంతో జరిగింది” అని అన్నారు.
ఉగ్రవాదులకు మద్దతిస్తూ భారత్ పై నిరంతరం దాడికి ప్రయత్నించే వారిని మాత్రమే భారత సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. యుద్ధం చేయడం కాకుండా బలప్రయోగం ద్వారా ప్రత్యర్థిని తప్పనిసరిగా తలవంచేలా చేయడమే తమ లక్ష్యమని, ఈ ఆపరేషన్ లో భారత సైన్యానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.
మే 10వ తేదీ ఉదయం భారత వైమానిక దళం పాక్ లోని అనేక వైమానిక స్థావరాలపై తీవ్ర దాడులు జరిపిన తరువాత పాకిస్థాన్ ఓటమిని అంగీకరించి, దాడుల విరమణకు ముందుకొచ్చిందని రక్షణ మంత్రి సభకు తెలియజేశారు. దీనితో ఆపరేషన్ ను తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశామని, కానీ భవిష్యత్తులో పాక్ వైపు నుంచి ఏదైనా దుస్సాహసం జరిగితే, అది ఆపరేషన్ పునఃప్రారంభానికి దారితీస్తుందనే హెచ్చరికతో భారత్ ప్రతిపాదనను అంగీకరించిందని ఆయన చెప్పారు. భారత వైమానిక దళం దాడులు, నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం నుంచి బలమైన ప్రతిఘటన, నౌకాదళ దాడుల భయం పాకిస్థాన్ ను లొంగిపోయేలా చేశాయని, ఈ ఓటమి పాకిస్థాన్ కు కేవలం వైఫల్యం మాత్రమే కాదని, సైనిక బలం, నైతిక స్థైర్యాన్ని కూడా ఆ దేశం కోల్పోయిందని ఆయన అన్నారు.
మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) భారత డీజీఎంఓ ను సంప్రదించి సైనిక చర్యలను ఆపాలని అభ్యర్థించారని, అనంతరం మే 12న ఇరు దేశాల డీజీఎంఓల మధ్య జరిగిన అధికారిక చర్చల ఫలితంగా రెండు దేశాలు ఆపరేషన్లను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయని ఆయన చెప్పారు. ఆపరేషన్ అనంతరం తాను సరిహద్దు ప్రాంతాలను సందర్శించి సైనికులను కలిశానని, వారిలో అచంచల సంకల్పాన్ని చూశానని తెలిపారు. “మన జవాన్లు కేవలం సరిహద్దులను కాపాడడమే కాదు, దేశ ఆత్మ గౌరవాన్ని కూడా రక్షిస్తున్నారు” అని అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాల సమన్వయానికి అత్యుత్తమ ఉదాహరణగా రక్షణమంత్రి పేర్కొన్నారు. భారత వైమానిక దళం ఆకాశం నుంచి దాడి చేయగా, భారత సైన్యం నియంత్రణ రేఖ వద్ద దృఢంగా నిలబడి ప్రతి చర్యకూ దీటుగా బదులిచ్చిందని, మరోవైపు భారత నావికాదళం ఉత్తర అరేబియా సముద్రంలో తన మోహరింపును బలోపేతం చేసిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. సముద్రం నుంచి భూమి వరకు వారి ప్రతి ముఖ్యమైన స్థావరంపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు భారత నౌకాదళం పాకిస్థాన్ కు స్పష్టమైన సందేశం ఇచ్చిందని ఆయన అన్నారు.
ఒత్తిడితోనే ఆపరేషన్ ను నిలిపివేశారన్న వాదనలను తోసిపుచ్చిన రాజ్ నాథ్ సింగ్ అవి నిరాధారమైనవని, అవాస్తవమని పేర్కొన్నారు. రాజకీయ, సైనిక లక్ష్యాలన్నీ పూర్తిగా సాధించడంతో భారత్ ఈ చర్యను నిలిపివేసిందని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ను నిలిపి వేశాం తప్ప ముగియలేదని, పాకిస్థాన్ మళ్లీ ఏదైనా దుర్మార్గపు చర్యకు పాల్పడితే మరింత తీవ్రమైన, నిర్ణయాత్మక చర్యకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని భారత్ ఎంతమాత్రం ఉపేక్షించదని, తక్షణం ప్రతిస్పందిస్తుందని, ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
పాకిస్థాన్ తో సహా పొరుగు దేశాలతో సుహృద్భావ, సహకార సంబంధాల కోసం భారతదేశం ఎప్పుడూ కృషి చేస్తోందని, కానీ దాని శాంతి ప్రయత్నాలను అమాయకత్వమనుకున్నారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ వైమానిక దాడులు, 2025లో ఆపరేషన్ సిందూర్ ద్వారా శాంతి కోసం భారత ప్రభుత్వం మరో మార్గాన్ని అనుసరించిందని, ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవన్నది భారత్ స్పష్టమైన వైఖరని ఆయన అన్నారు. “నాగరిక, ప్రజాస్వామ్య దేశాల మధ్య చర్చలు జరుగుతాయి. కానీ, కనీస ప్రజాస్వామ్యం కూడా లేని, కేవలం మతోన్మాదం, ఉగ్రవాదం, భారత్ పై ద్వేషం మాత్రమే ఉన్న దేశంతో చర్చలు జరగవు” అని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ప్రపంచ ఉగ్రవాదానికి నర్సరీ అని, ఆ ముప్పును తమ ప్రభుత్వ విధానానికి ప్రాతిపదికగా మార్చుకుందని రక్షణ మంత్రి సభకు తెలియజేశారు. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలను పాకిస్థాన్ నిర్వహించిందని, దీనికి సైనికాధికారులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులతో పోరాడే ధైర్యాన్ని పాక్ కూడగట్టుకోలేకపోతోందని, అందుకే అమాయక పౌరులు, పిల్లలు, యాత్రికులను ఉగ్రవాదానికి గురి చేస్తోందన్నారు. పాక్ సైన్యం, ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని ప్రచ్ఛన్న యుద్ధ సాధనాలుగా వాడుకుంటున్నాయని, భారత్ ను అస్థిరపరచాలని కలలు కంటున్నాయని ఆరోపించారు. భారత్ ను వేయి ముక్కలు చేయాలని కలలు కనే వారు ఇది ప్రధాని మోదీ నేతృత్వంలోని నవభారతమని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎంతవరకైనా వెళ్లగలమన్న విషయాన్ని మరచిపోకూడదని అన్నారు.
భారతదేశం ఏ ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమించబోదని, పరిమాణం, బలం, అధికారం, అభివృద్ధిలో ఎక్కడా సాటి రాని పాకిస్థాన్ వంటి దేశంతో పోటీ పడే ఉద్దేశం భారత్ కు ఎంతమాత్రం లేదని రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడమే భారత్ విధానమని, అంతర్జాతీయ ముప్పునకు మద్దతు ఇవ్వడం వల్లే పాక్ పై వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన అన్నారు.
పాకిస్థాన్ తో భారత్ ఘర్షణ సరిహద్దు వివాదం కాదని, నాగరికత - అనాగరికత మధ్య అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. తమ సైనికులు యుద్ధభూమిలో భారత్ ను ఓడించలేరన్న వాస్తవం పాక్ నేతలకు తెలుసునని, అందుకే ప్రపంచం ముందు తమను తాము అమాయకులుగా చిత్రీకరించుకుంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలు పాటించదలచిన నాగరిక ప్రవర్తనా నియమాలకు పూర్తి విరుద్ధంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా ఉపయోగించిందని అన్నారు.
ఉగ్రవాదంపై భారత్ పోరాటం సరిహద్దుల్లోనే కాకుండా సైద్ధాంతిక ప్రాతిపదికన జరుగుతోందని రాజ్ నాథ్ సింగ్ సభకు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం ఉపేక్షించని భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని, ఆపరేషన్ సిందూర్ ను ప్రపంచ వేదికలపై ప్రదర్శించిన ప్రతినిధులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలు, విభేదాలను పక్కన పెట్టి దేశానికి, సైనికులకు, ప్రభుత్వానికి సంఘీభావం తెలపడాన్ని గుర్తించామని ఆయన తెలిపారు.
దేశ సమైక్యత, సమగ్రత, భద్రత కోసం అవసరమైన ప్రతి చర్యా తీసుకోవడానికి ప్రభుత్వం, సాయుధ దళాలు, ప్రజాస్వామ్య సంస్థలు కట్టుబడి ఉన్నాయని రక్షణ మంత్రి సభకు, దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
****
(Release ID: 2149553)