ప్రధాన మంత్రి కార్యాలయం
జులై 26, 27 తేదీల్లో ప్రధాని తమిళనాడు పర్యటన
* తమిళనాడులోని ట్యుటికోరన్‌లో రూ.4800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి
* ట్యుటికోరిన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్న పీఎం
* ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేసే రూ.3600 కోట్ల విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
* విద్యుత్ సరఫరా కోసం కుడంకళం అణువిద్యుత్ కేంద్రం వద్ద ఇంటర్-స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
* వీవో చిదంబరనార్ నౌకాశ్రయం వద్ద సరకు రవాణా సౌకర్యాన్ని ప్రారంభించనున్న పీఎం
* ఆడి తిరువత్తిరై ఉత్సవం సందర్భంగా తిరుచిరాపల్లిని సందర్శించనున్న ప్రధాని
*ఆగ్నేయాసియాకు మొదటి రాజేంద్ర చోళుడు చేపట్టిన నౌకా వాణిజ్య యాత్రకు 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రఖ్యాత గంగైకొండ చోళపురం ఆలయ నిర్మాణ ప్రారంభానికి గుర్తుగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవంలో పాల్గొననున్న ప్రధాని
Posted On:
25 JUL 2025 10:09AM by PIB Hyderabad
యూకే, మాల్దీవుల పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళనాడు సందర్శిస్తారు. ట్యుటికోరన్‌లో జులై 26 రాత్రి 8 గంటలకు జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 4,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేస్తారు.
జులై 27న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న గంగైకొండ చోళపురం ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే చోళ చక్రవర్తి అయిన మొదటి రాజేంద్ర చోళుని జయంతి ఉత్సవం, ఆడి తిరువత్తిరై ఉత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటారు.
ట్యుటికోరిన్‌లో ప్రధానమంత్రి
మాల్దీవుల్లో అధికారిక పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి నేరుగా ట్యుటికోరిన్ చేరుకుంటారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రాంతీయ అనుసంధానాన్ని విస్తరించే, రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరిచే, స్వచ్ఛ విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసే, పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరిచే వివిధ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.
అంతర్జాతీయ స్థాయి విమానయాన సౌకర్యాలను అభివృద్ధి చేయడం, రవాణా సదుపాయాలను విస్తరించాలనే తమ నిబద్ధతకు అనుగుణంగా ట్యుటికోరిన్ విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. రూ.450 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ భవనాన్ని దక్షిణ ప్రాంతంలో పెరుగుతున్న విమానయాన అవసరాలను తీర్చేలా రూపొందించారు. అలాగే ఈ భవనాన్ని ప్రధానమంత్రి పరిశీలిస్తారు.
రద్దీ సమయాల్లో 1,350 మంది, ఏటా 20 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించేలా 17,340 చదరపు మీటర్ల మేర ఈ టెర్మినల్ విస్తరించింది. భవిష్యత్తులో రద్దీ సమయాల్లో 1,800 మంది, ఏడాదికి 25 లక్షల మందికి ప్రయాణీకుల రాకపోకలు సాగించేలా దీని సామర్థ్యాన్ని విస్తరిస్తారు. 100 శాతం ఎల్‌ఈడీ లైటింగ్, విద్యుత్ ఆదా చేసే ఈ అండ్ ఎం వ్యవస్థలు, మురుగు నీటి శుద్ధి కేంద్రం ద్వారా శుద్ధి చేసిన నీటి పునర్వినియోగంతో గృహ – 4 సుస్థిరత రేటింగ్ సాధించే విధంగా ఈ టెర్మినల్ భవనం నిర్మించారు. ప్రాంతీయ విమానయనంతో పాటుగా, దక్షిణ తమిళనాడులో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులను ఈ ఆధునిక వసతి పెంపొందిస్తుందని అంచనా వేస్తున్నారు.
రహదారి మౌలిక వసతుల రంగంలో వ్యూహాత్మక ప్రాధాన్యమున్న రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. మొదటి ప్రాజెక్టు, ఎన్‌హెచ్-36లో సేథియాతోపి-చోళపురం విభాగంలో 50 కి.మీ. మేర నిర్మించిన 4 లేన్ల రహదారి. దీన్ని విక్రవాండి-తంజావూర్ కారిడార్లో భాగంగా రూ. 2,350 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. దీనిలో మూడు బైపాస్‌లు, కొల్లిడం నదిపై ఒక కి.మీ పొడవైన నాలుగు లేన్ల బ్రిడ్జి, నాలుగు ప్రధాన బ్రిడ్జిలు, ఏడు పై వంతెనలు, కొన్ని అండర్‌పాస్‌లు ఉన్నాయి. వీటి ద్వారా సేథియాతోపి-చోళపురం మధ్య ప్రయాణ సమయం 45 నిమిషాల మేర తగ్గుతుంది. అలాగే డెల్టా ప్రాంతంలోని సాంస్కృతిక, వ్యవసాయ కేంద్రాలకు రవాణా సదుపాయాలను పెంచుతుంది. రెండో ప్రాజెక్టు, సుమారుగా రూ. 200 కోట్లతో నిర్మించిన 5.16 కి.మీ. పొడవైన 6 లేన్ల ఎన్‌హెచ్-138 ట్యుటికోరిన్ పోర్టు రోడ్డు. అండర్‌పాసులు, బ్రిడ్జిలు ఉన్న ఈ రహదారి.. సరకు రవాణాను సులభతరం చేస్తుంది. రవాణా ఖర్చులు తగ్గిస్తుంది. వీవో చిందంబరనార్ పోర్టు చుట్టూ నౌకాశ్రయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతుంది.
ఓడరేవు మౌలిక సదుపాయాలు, స్వచ్ఛ విద్యుత్తు వసతులను పెంపొందించేలా వీవో చిదంబరనార్ పోర్టులో రూ. 285 కోట్ల వ్యయంతో నిర్మించిన 6.96 ఎంఎంటీపీఏ సామర్థ్యం ఉన్న ఉత్తర కార్గో బెర్త్ - IIIను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది ఈ ప్రాంతంలో పెరుగుతున్న డ్రై బల్క్ కార్గో అవసరాలను తీరుస్తుంది. తద్వారా నౌకాశ్రయం, సరకు రవాణా వ్యవస్థల సామర్థ్యం పెరుగుతుంది.
దక్షిణ తమిళనాడులో సుస్థిరమైన, సమర్థమైన రవాణా వసతులను మెరుగుపరిచే మూడు కీలకమైన రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. మదురై-బోడినాయక్కనూర్ లైన్లో 90 కి.మీ. మేర చేపట్టిన విద్యుద్దీకరణ పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తుంది. అలాగే మదురై, తేనిలో పర్యాటకం, ప్రయాణానికి తోడ్పడుతుంది. తిరువనంతరపురం-కన్యాకుమారి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నాగర్‌కోయల్ టౌన్ - కన్యాకుమారి సెక్షన్లో రూ. 650 కోట్లతో చేపట్టిన 21 కి.మీ.ల డబ్లింగ్ పనులు తమిళనాడు, కేరళ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయి. అదనంగా అరళ్వాయ్‌మోలి-నాగర్‌కోయల్ జంక్షన్ (12.87 కి.మీ.), తిరునల్వేలి-మేలప్పాళ్యం (3.6 కి.మీ) డబ్లింగ్ పనులు చెన్నై-కన్యాకుమారి లాంటి ప్రధాన దక్షిణ మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. ప్రయాణీకులు, సరకు రవాణాను మెరుగుపరిచి ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణను మెరుగుపరుస్తాయి.
రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా నిర్మించనున్న ప్రధాన విద్యుత్ సరఫరా ప్రాజెక్టు అయిన ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (ఐఎస్‌టీఎస్)కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీన్ని కుడంకళం అణువిద్యుత్ ప్లాంట్ లోని 3, 4 యూనిట్ల (2x1000 మె.వా.) నుంచి విద్యుత్‌ను తరలించేందుకు ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్టును రూ. 550 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. దీనిలో కుడంకళం నుంచి ట్యూటికోరన్-II జీఐఎస్ సబ్ సబ్ స్టేషన్ వరకు 400 కేవీ (క్వాడ్) డబుల్-సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్, సంబంధిత టెర్మినల్ సామగ్రి ఉంటాయి. ఇది జాతీయ గ్రిడ్‌ను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. స్వచ్ఛ విద్యుత్ పంపిణీ సవ్యంగా సాగేలా చూస్తుంది. అలాగే తమిళనాడు సహా ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే రాష్ట్రాల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంలో దోహదపడుతుంది.
తిరుచిరాపల్లిలో ప్రధానమంత్రి
దేశంలో గొప్ప చక్రవర్తుల్లో ఒకరైన మొదటి రాజేంద్ర చోళుడి గౌరవార్థం స్మారక నాణేన్ని ప్రధానమంత్రి విడుదల చేస్తారు. అలాగే గంగై కొండ చోళపురం ఆలయంలో నిర్వహించే ఆడి తిరువత్తిరై ఉత్సవంలో పాల్గొంటారు.
ఆగ్నేయాసియాకు మొదటి రాజేంద్ర చోళుడు చేపట్టిన సముద్ర వాణిజ్య యాత్రకు 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, చోళ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచే ప్రఖ్యాత గంగైకొండ చోళపురం ఆలయ నిర్మాణ ప్రారంభానికి గుర్తుగా ఈ ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తున్నారు.
భారతీయ చరిత్రలో అత్యంత శక్తిమంతమైన, దార్శనికత కలిగిన పాలకుల్లో మొదటి రాజేంద్ర చోళుడు (1014–1044 సీఈ) ఒకరు. ఆయన నాయకత్వంలో చోళ రాజ్యం పరిధి దక్షిణ, ఆగ్నేయాసియా వరకు విస్తరించింది. యుద్ధాల్లో విజయం సాధించిన అనంతరం గంగైకొండ చోళపురాన్ని రాజధానిగా నెలకొల్పారు. అక్కడ నిర్మించిన ఆలయం 250 ఏళ్లకు పైగా శైవ భక్తికి, నిర్మాణ శైలికి, పాలనా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. శిల్పకళా చాతుర్యం, చోళుల కాంస్య శిల్పాలు, పురాతన శాసనాలకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా నిలిచింది.
చోళులు బాగా ప్రోత్సహించిన, తమిళ శైవత్వానికి చెందిన ఆధ్యాత్మిక కవులైన 63 మంది నాయనార్లతో శాశ్వతత్వం సాధించిన తమిళ శైవ భక్తి సంప్రదాయాన్ని ఆడి తిరువత్తిరై ఉత్సవం ప్రదర్శిస్తుంది. ఈ ఏడాది రాజేంద్ర చోళుని జన్మనక్షత్రమైన తిరువత్తిరై (ఆరుద్ర) నక్షత్రంలో, జులై 23న ప్రారంభమైన ఈ ఉత్సవాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
***
(Release ID: 2148319)
Read this release in:
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam