పార్లమెంటరీ వ్యవహారాలు
అన్ని భారతీయ భాషల్లో శాసనసభల సమాచారం...
అందుబాటులోకి అవసరమైన సాంకేతిక సౌలభ్యం
Posted On:
22 JUL 2025 6:02PM by PIB Hyderabad
వివిధ రాష్ట్రాల శాసనసభల సమాచారాన్ని ఆంగ్లంతో సహా అన్ని భారతీయ భాషల్లో అనువాదాలను అందించేందుకు జాతీయ ఈ-విధాన్ అప్లికేషన్- నేవాలో (ఎన్‌ఈవీఏ) ఈ కింది సాంకేతికత సదుపాయాలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. భాషాపరమైన సమ్మిళిత్వాన్ని అన్ని శాసనసభలకూ అందించాలన్నది దీని లక్ష్యంగా ఉంది.
* నేవా- అనుబంధ పోర్టళ్ల (హోంపేజీ, రాష్ట్రాల అసెంబ్లీ వెబ్ సైట్లు) ను అవసరమైన భాషలో అంటే ఆంగ్లంతోపాటు రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషల్లో చూసుకునేందుకు వీలుగా ప్రభుత్వ అనువాద వేదిక- భాషిణిలో యంత్రాధారిత అనువాద సాంకేతికతను (వచనం నుంచి వచనానికి) పొందుపరిచారు.
* డాటాకు (ఇన్పుట్, నిల్వ, యాక్సెస్) సంబంధించి యూనికోడ్ ఆధారిత శైలీ నిర్మాణాన్ని తీసుకొచ్చారు. ఇది కంటెంట్ నిర్వహణ వ్యవస్థలో (సీఎంఎస్) సమాచార మార్పిడి, సమాచార వినియోగ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా కంటెంట్‌ను అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తుంది.
అ. మొత్తం రూ. 673.94 కోట్ల అంచనా వ్యయంతో ఎన్‌ఈవీఏ ప్రాజెక్ట్‌కు పీఐబీ ఆమోదం తెలిపింది. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్‌ఎస్). కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నైష్పత్తికంగా నిధులు సమకూర్చుకుంటాయి.
* ఈశాన్య, కొండ ప్రాంతాలకు 90:10 నిష్పత్తిలో నిధులు అందుతాయి.
* శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు 100% కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది.
* మిగతా అన్ని రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో నిధులు అందుతాయి.
ఆ. ‘నేవా’ను అమలు చేసేందుకు మొత్తం 28 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలు అవగాహన ఒప్పందంపై (ఎంఓయూ) సంతకం చేశాయి.
ఇ. జూన్ 2025 నాటికి 19 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలు ‘నేవా’ వేదిక ద్వారా పూర్తిగా డిజిటల్ శాసనసభలుగా మారాయి.
ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ నిన్న రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో అందించారు.
***
(Release ID: 2147224)