యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
'వికసిత్ భారత్ కోసం నషా ముక్త యువత' అనే ఇతివృత్తంతో వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమైన 'యువజన ఆధ్యాత్మిక సదస్సు'
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 122 ఆధ్యాత్మిక, సామాజిక-సాంస్కృతిక సంస్థల నుంచి పాల్గొన్న 600 మందికి పైగా యువత
యువత మాదకద్రవ్యాలు, మొబైల్ ఫోన్లు, రీల్స్ వ్యసనాలకు దూరంగా ఉంటేనే భారత్ అభివృద్ధి చెందుతుంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర యువజన వ్యవహారాలు- క్రీడల శాఖ మంత్రి
మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో సామాజిక, మతపరమైన నాయకులు పాలు పంచుకోవాలి: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
యువత నాయకత్వంలో మాదకద్రవ్యాలు లేని అభివృద్ధి చెందిన దేశాన్ని మనం నిర్మించాలి: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
Posted On:
19 JUL 2025 2:25PM by PIB Hyderabad
'వికసిత్ భారత్ కోసం నషా ముక్త యువత' అనే ఇతివృత్తంతో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నిర్వహిస్తోన్న 'యువజన ఆధ్యాత్మిక సదస్సు' ఇవాళ ప్రారంభమైంది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 122 ఆధ్యాత్మిక, సామాజిక-సాంస్కృతిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న 600 మందికి పైగా యువజనులు పాల్గొన్నారు.
కేంద్ర యువజన వ్యవహారాలు- క్రీడలు, కార్మిక- ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. 2022 ఆగస్టు 15న ఎర్రకోట వేదిక నుంచి చేసిన 76వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో అమృత్ కాల్ 'పంచ ప్రాణ్' ద్వారా రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించిన దార్శనికతను ప్రధాని మోదీ పంచుకున్నారని అన్నారు. దేశ జనాభాలో 65 శాతం 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారేనని.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ దార్శనికత సాకారం చేసుకునేందుకు దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను డాక్టర్ మాండవీయ ప్రధానంగా ప్రస్తావించారు. యువ తరాన్ని లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు రూపకర్తలుగా కూడా చూడాలని అన్నారు. అయితే మాదకద్రవ్యాల దుర్వినియోగం నేడు యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని వివరించారు. వ్యసనం వల్ల వారి జీవితాల్లో కీలకమైన దశ నాశనమై దేశ పురోగతికి తీవ్రమైన సవాలు విసురుతోందని పేర్కొన్నారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందాలంటే యువతను మాదకద్రవ్యాలు, మొబైల్ ఫోన్లు, రీల్స్ నుంచి దూరంగా ఉంచాలని అన్నారు.
వ్యసనానికి దూరంగా ఉండటం గురించి యువతలో అవగాహన కల్పించేందుకు సామాజిక, మతపరమైన నాయకులు తమ సంస్థలను ఉపయోగించాలని మంత్రి కోరారు. ఒక కార్యక్రమం లేదా పరిమిత చర్యలు సరిపోవని తెలిపారు. ఈ విషయంలో ప్రతి పౌరుడు కనీసం ఐదుగురు ఇతరులకు మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాలు పంచుకునేందుకు ప్రేరిపిస్తానని ప్రతిజ్ఞ చేసే ఒక సామూహిక ఉద్యమం అవసరమని అన్నారు.
ఈ రెండు రోజుల సమావేశం విలువైన చర్చలు, అర్థవంతమైన తీర్మానాలకు దారి తీస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువ, ఆధ్యాత్మిక నాయకుల సమష్టి ముందు చూపు, నిబద్ధతను ప్రతిబింబించేలా జూలై 20న 'కాశీ డిక్లరేషన్' విడుదల కానుంది. దీనితోనే సదస్సు కూడా ముగుస్తుంది. ఈ డిక్లరేషన్ మాదకద్రవ్య రహిత భారత్‌ను నిర్మించే విషయంలో వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను అందించనుంది. మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడటం, పునరావాసానికి సంబంధించి పనిచేసే పనిచేసే విధాన రూపకర్తలు, పౌర సమాజ సంస్థలు, యువజన నెట్‌వర్క్‌లకు మార్గదర్శక పత్రంగా ఇది పనిచేయనుంది.
ఈ సదస్సులో వ్యససం, యువతపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవటం.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లు- వాటి వాణిజ్య ప్రయోజనాలను నాశనం చేయటం.. సమర్థవంతమైన అవగాహన కార్యక్రమాలు, ప్రచార వ్యూహాలు.. 2047 నాటికి మాదకద్రవ్య రహిత భారతదేశం అనే దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించటం అనే అంశాలపై నాలుగు సెషన్‌లు ఉండనున్నాయి. నిపుణుల చర్చలు, ప్యానెల్ చర్చలు, ఇంటరాక్టివ్ వైట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ సెషన్‌లను నిర్వహిస్తున్నారు. సమగ్ర జాతీయ వ్యూహాన్ని రూపొందించడంలో ప్రతి ప్రతినిధి చురుకుగా పాల్గొనే విధంగా ఈ సదస్సు చూసుకుంటోంది.
***
(Release ID: 2146210)