వ్యవసాయ మంత్రిత్వ శాఖ
‘ధన-ధాన్య కృషి యోజన’కు కేంద్ర మంత్రి మండలి కీలక ఆమోదంపై
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన
Posted On:
16 JUL 2025 8:03PM by PIB Hyderabad
‘ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన’ కు కేంద్ర మంత్రివర్గం కీలక ఆమోదం లభించడంపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు. ఆహారధాన్యాల దిగుబడులు 40 శాతం మేర పెరిగాయని పాలు, పళ్ళు, కూరగాయల ఉత్పత్తిలో చరిత్రాత్మక వృద్ధి నమోదైందని మంత్రి చెప్పారు. అయితే, ఉత్పాదనకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, ఒకే రాష్ట్రంలోని జిల్లాల మధ్య గణనీయమైన తారతమ్యాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తక్కువ వ్యవసాయ దిగుబడులు లేదా అగ్రి క్రెడిట్ కార్డు (ఏసీసీ)లను పరిమిత స్థాయిలో వినియోగించే రైతులున్నజిల్లాలను గుర్తిస్తామని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి 11 విభాగాల పథకాలను సమన్వయపరచి సమగ్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాలు సహా ఆసక్తి గల ఇతర భాగస్వాములు కూడా ఇందులో భాగమవుతారన్నారు. పథకం అమలుకు సుమారు 100 వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేస్తామని, ఒక్కో రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లా ఈ ఎంపికలో ఉండగలదని శ్రీ చౌహాన్ వివరించారు. ఈ దిశగా సన్నాహక చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమిస్తామని చెబుతూ జిల్లాలు, సంబంధిత నోడల్ అధికారుల ఎంపిక జులై ఆఖరికి ఖరారు కాగలదని చెప్పారు. ఇక ఆగస్ట్ లో శిక్షణ కార్యక్రమాలతో పాటు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా మొదలవుతాయని మంత్రి వెల్లడించారు.
ప్రత్యేక సూచికల ఆధారంగా జిల్లాల వారీ పురోగతిని పర్యవేక్షించే బాధ్యతను నీతి ఆయోగ్ కు అప్పగిస్తామని చౌహాన్ చెప్పారు. ఈ సంస్థ ఒక ప్రత్యేకమైన డాష్ బోర్డును తయారు చేసి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఈ అక్టోబర్ రబీ సీజన్ లో ప్రచారాన్నిప్రారంభిస్తామని తెలిపారు. గ్రామ పంచాయితీ లేదా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో విభాగాల అధికారులు, అభ్యుదయ రైతులు, ఇతరులతో కూడిన జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటవుతాయని, ఈ కమిటీలు సమష్టి నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే తరహా కమిటీలు ఏర్పాటు అవుతాయని, జిల్లాల్లో పథకాల సమన్వయం బాధ్యతను ఈ కమిటీలు స్వీకరిస్తాయని చెప్పారు. కేంద్ర స్థాయిలో ఏర్పాటయ్యే రెండు బృందాల్లో ఒకటి కేంద్ర మంత్రుల పర్యవేక్షణలో ఉండగా, వివిధ విభాగాల అధికారులతో కూడిన బృందాన్ని కార్యదర్శులు పర్యవేక్షిస్తారని మంత్రి విశదీకరించారు. ఈ పథకం అనేక రంగాల్లో అమలవుతుంది.
తక్కువ దిగుబడులు గల జిల్లాల్లో ఉత్పత్తిని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యమని, ఆయా జిల్లాలు జాతీయ సగటుని చేరుకోవడమే కాక, అత్యుత్తమ దిగుబడులు సాధించడం ముఖ్యమని చెప్పారు. ఆహార ధాన్యాలతో పాటు పళ్ళ సాగు, మత్స్య రంగం, తేనెటీగల పెంపకం, పశుసంరక్షణ, వ్యవసాయ భూముల్లో చెట్ల పెంపకానికి ప్రాధాన్యమిస్తామని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు.
*****
(Release ID: 2145415)