వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జాతీయ అంకుర సంస్థలకు అవార్డులు.. అయిదో సంచిక అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
• దేశంలో నవకల్పనకు ఊతాన్నిచ్చే, సమాజంపై ప్రభావాన్ని చూపే,
అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల వారికీ అందించే అంకుర సంస్థలకు సత్కారం
నాడు పోస్టు చేయడమైనది:
14 JUL 2025 6:22PM by PIB Hyderabad
‘నేషనల్ స్టార్టప్ అవార్డుల’లో (ఎన్ఎస్ఏ) అయిదో విడత అవార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ( డీపీఐఐటీ) కోరుతున్నది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తున్న డీపీఐఐటీ ఈ అవార్డులను ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రదానం చేస్తోంది.
అంకుర సంస్థలకు గుర్తింపునివ్వడం, పన్ను మినహాయింపులను కల్పించడం, నియంత్రణకు సంబంధించి వెసులుబాటు, ఆర్థిక సహాయాన్ని అందించడం.. వీటితో పాటు సామర్థ్యాలను పెంచడం వంటి రూపాల్లో స్టార్టప్‌లకు అండదండగా ‘స్టార్టప్ ఇండియా’ నిలుస్తోంది. స్వయంసమృద్ధ భారత్‌ను ఆవిష్కరించాలన్న, దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిందిగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ దృష్టికోణానికి అనుగుణంగా చేపట్టిన ప్రధాన కార్యక్రమమే ఈ ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం.

ఎక్కువ ప్రభావాన్ని కలగజేసే పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా ఉండేలాగానూ, వాటిని వెలుగులోకి తీసుకురావడానికీ డీపీఐఐటీ జాతీయ అంకుర సంస్థల పురస్కారాలను (ఎన్ఎస్ఏ) ఇవ్వడాన్ని 2019 లో ప్రారంభించింది. ఈ పురస్కారాలు వాణిజ్య విజయాలే కాకుండా సామాజిక ప్రభావం, స్థిరత్వం, విస్తరణ యోగ్యత.. వీటికి కూడా గుర్తింపును అందిస్తున్నాయి. నాలుగో విడత జాతీయ అంకుర సంస్థల పురస్కారాల కోసం 2,300కు పైగా దరఖాస్తులు అందాయి. ఇది ఈ కార్యక్రమానికి పేరుప్రతిష్ఠలతో పాటు విస్తృతి కూడా అంతకంతకూ పెరుగుతోందని సూచిస్తోంది.
జాతీయ అంకుర సంస్థల అవార్డులకు దరఖాస్తు చేసుకునే స్టార్టప్‌లను ఒక కఠినమైన, బహుళదశల ప్రక్రియతో మూల్యాంకనం చేస్తారు. ఈ ప్రక్రియలో యోగ్యతను పరిశీలించడం, రంగాల వారీ తాత్కాలిక ఎంపికకు స్వీకరించడం, పరిశ్రమ ప్రముఖులు, పెట్టుబడిదారులు, విద్యరంగ ప్రముఖులతో పాటు ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉండే నిపుణుల మండలి బేరీజు వేస్తుంది. డీపీఐఐటీ సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల చురుకైన భాగస్వామ్యంతో పాటు కార్యాచరణకు కూడా నాయకత్వం వహిస్తుంది. పురస్కార విజేతలు జాతీయ ప్రాధాన్యాలతో పాటు రంగంవారీ భిన్నత్వాన్ని ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు.

జాతీయ అంకుర సంస్థల అవార్డులు వ్యవసాయం, స్వచ్ఛ ఇంధనం, ఫిన్‌టెక్, ఏరోస్పేస్, ఆరోగ్యం, విద్య, సైబర్ సెక్యూరిటీ, యాక్సెసిబులిటీ వంటివి సహా అనేక రంగాల్లోని సంస్థలకు వర్తిస్తాయి. ఈ రంగాల్లోని అంకుర సంస్థలు ఈ అవార్డులకు పోటీపడొచ్చు. ఎప్పటికప్పుడు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను, అందివస్తున్న అవకాశాలను లెక్కలోకి తీసుకొనేందుకు ప్రతి సారీ అవార్డుల కార్యక్రమంలో పోటీపడడానికి సరికొత్త విభాగాలను ప్రవేశపెడుతున్నారు.
నగదు బహుమతిగా కంటే కూడా ఎన్ఎస్ఏ గుర్తింపుతో లభించే జాతీయ స్థాయి విశ్వసనీయత పాత్రే మిన్న. ఎన్ఎస్ఏ గుర్తింపును దక్కించుకొనే సంస్థలు భాగస్వామ్యాలను ఏర్పరుచుకోగలుగుతాయి. పెట్టుబడిదారు సంస్థల ప్రాపకాన్ని పొందగలుగుతాయి. విధానపరమైన మద్దతును, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును, మార్గదర్శకత్వం లభించే అవకాశాలను అందుకోగలుగుతాయి. గతంలో అవార్డులను గెలుచుకున్న సంస్థలు విధానాల రూపకల్పనపై ప్రభావాన్ని చూపించగలిగాయి. ప్రధాన నిధులను పొందడంతో పాటు తమ ఉనికిని విదేశాలకు విస్తరించుకొన్నాయి.
ఉదాహరణలు:
ఇనామేషన్ మెడికల్ డివైసెస్: ఇది వాయిస్ ప్రోస్థెసిస్‌లో నవకల్పనకు గుర్తింపు తెచ్చుకొంది. తరువాత దీనిని టాటా సోషల్ ఎంటర్‌ప్రైజ్ చాలెంజ్‌తో పాటు అంతర్జాతీయ వేదికలలో కూడా ప్రదర్శించారు.
మైకాబ్: దీనిని ‘ప్రెసిడెంట్ విత్ స్టార్టప్స్’ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా ఆహ్వానించారు. ఇది ఐడీఈఎక్స్ (iDEX) మార్గదర్శకత్వంలో రక్షణ రంగ ఆర్డర్లను సంపాదించింది.
బ్లాక్‌ఫ్రాగ్ టెక్నాలజీస్: ఈ సంస్థ ఉత్పత్తి చేసిన ఎంవోలియో (Emvolio) ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ముందస్తు యోగ్యతను పొందిన వ్యాక్సీన్ క్యారియర్. దీనిని ప్రస్తుతం మన దేశంలో 16 రాష్ట్రాలతో పాటు కెన్యా, నైజీరియా, ఫిజీ వంటి దేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారు.
భారతదేశ నవకల్పన ప్రస్థానంలో నేషనల్ స్టార్టప్ అవార్డులు-25 ఒక ముఖ్య పాత్రను పోషించగలుగుతాయి. ఈ పురస్కారాలు మార్పును తీసుకువచ్చే సంస్థలకు గుర్తింపును ఇస్తాయి. దీంతో పాటు, సాహసిక, సమ్మిళిత, స్వయంసమృద్ధ ‘వికసిత్ భారత్’ను తీర్చిదిద్దడంలో తోడ్పడనున్నాయి.
దరఖాస్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి: https://rb.gy/3bg0yf

‘స్టార్ట్‌అప్ ఇండియా’ను 2016లో ప్రారంభించారు. ఇది మన దేశంలో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఉన్న ప్రక్రియలో పెనుమార్పులను తీసుకువచ్చింది. నవకల్పనను పెంచి పోషిస్తోంది. యువతీయువకులను, మహిళలను, విద్యార్థులను, మొట్టమొదటిసారి అంకుర సంస్థలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన వారిని ముఖ్యంగా రెండో అంచె, మూడో అంచెలకు చెందిన పట్టణాలకు చెందిన వారిని స్టార్టప్ ఇండియా ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు, డీపీఐఐటీ 1.75 లక్షల కన్నా ఎక్కువ అంకుర సంస్థలకు గుర్తింపునిచ్చింది. ఈ అంకుర సంస్థలు వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఇంధనం, డీప్ టెక్ సహా వివిధ రంగాలకు చెందినవి. ఈ సంస్థలను దేశంలో దాదాపు ప్రతి జిల్లాలోనూ విస్తరించాయి.

***
(రిలీజ్ ఐడి: 2145112)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21