ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసిన ప్రముఖులను అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 13 JUL 2025 10:47AM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు ప్రముఖులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టులలో.. ప్రతి నామినీ కృషిని ప్రధానంగా ప్రస్తావించారు.

న్యాయవాద వృత్తి పట్ల అంకితభావం.. రాజ్యాంగ విలువల పట్ల అచంచలమైన నిబద్ధతకు శ్రీ ఉజ్వల్ నికమ్‌ నిదర్శనమని ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యమైన కేసుల్లో న్యాయాన్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన శ్రీ నికమ్ విజయవంతమైన న్యాయవాదిగా గుర్తింపు పొందారన్నారు. సాధారణ పౌరుల గౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన నిరంతరం కృషి చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాజ్యసభకు నికమ్ నామినేషన్‌ను స్వాగతించిన శ్రీ నరేంద్ర మోదీ.. పార్లమెంటరీ పాత్రలోనూ ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"న్యాయ రంగం పట్ల, మన రాజ్యాంగం పట్ల శ్రీ ఉజ్వల్ నికమ్ అంకితభావం ఆదర్శప్రాయం. ఆయన విజయవంతమైన న్యాయవాది మాత్రమే కాదు.. ముఖ్యమైన కేసుల్లో న్యాయం సాధించడంలోనూ ముందంజలో ఉన్నారు. తన న్యాయవాద వృత్తి జీవితంలో భాగంగా రాజ్యాంగ విలువల బలోపేతం కోసం, సాధారణ పౌరుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆయన నిరంతర కృషి చేశారు. భారత రాష్ట్రపతి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన పార్లమెంటరీ ఇన్నింగ్స్‌కు నా శుభాకాంక్షలు."

శ్రీ సి. సదానందన్ మాస్టర్ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, ప్రతిఘటన శక్తికి ప్రతీకగా ఆయన జీవితాన్ని అభివర్ణించారు. హింస, బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ.. శ్రీ సదానందన్ మాస్టర్ దేశాభివృద్ధికే కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయుడిగా, సామాజిక కార్యకర్తగా ఆయన చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు యువత సాధికారత పట్ల ఆయనకు గల మక్కువను ప్రశంసించారు. గౌరవనీయ రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయిన ఆయనకు అభినందనలు తెలిపారు. రాజ్యసభ ఎంపీగా కొత్త బాధ్యతలు చేపట్టనున్న సదానందన్ మాస్టర్‌కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"అన్యాయానికి తలొగ్గని ధైర్యం.. ప్రతిఘటన శక్తికి శ్రీ సి. సదానందన్ మాస్టర్ జీవితం ప్రతిరూపం. హింస, బెదిరింపులూ దేశాభివృద్ధి పట్ల ఆయన స్ఫూర్తిని నిరోధించలేకపోయాయి. ఉపాధ్యాయుడిగా, సామాజిక కార్యకర్తగా ఆయన కృషి ప్రశంసనీయం. యువత సాధికారత పట్ల ఆయనకు అత్యంత మక్కువ ఉంది. గౌరవనీయ రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు. ఎంపీగా నూతన బాధ్యతలు చేపట్టనున్న సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు."

శ్రీ హర్ష్ వర్ధన్ శ్రింగ్లా నామినేషన్ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఒక దౌత్యవేత్తగా, మేధావిగా, వ్యూహాత్మక ఆలోచనాపరులుగా ఆయన ఎంతో ప్రత్యేకమైనవారని పేర్కొన్నారు. భారత విదేశాంగ విధానం.. భారత జీ20 సారథ్యం విషయంలో శ్రీ శ్రింగ్లా కృషి ప్రశంసనీయమన్నారు. రాజ్యసభకు ఆయన నామినేట్ కావడం చాలా సంతోషం కలిగించిందన్న ప్రధానమంత్రి.. ఆయన అనుభవాలు పార్లమెంటరీ చర్చలను సుసంపన్నం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"శ్రీ హర్ష్ వర్ధన్ శ్రింగ్లా దౌత్యవేత్తగా, మేధావిగా, వ్యూహాత్మక ఆలోచనాపరులుగా రాణించారు. సంవత్సరాలుగా ఆయన భారతదేశ విదేశాంగ విధానానికి కీలక సహకారం అందించారు. జీ20కి భారత్ సారథ్యం విషయంలోనూ ఆయన అందించిన సహకారం ప్రశంసనీయం. భారత రాష్ట్రపతి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన ప్రత్యేక దృక్పథాలు పార్లమెంటరీ కార్యకలాపాలను మరింత మెరుగుపరుస్తాయి. @harshvshringla”

డాక్టర్ మీనాక్షి జైన్ నామినేషన్ గురించి ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ.. ఇది చాలా సంతోషకరమైన విషయమన్నారు. పండితురాలు, పరిశోధకురాలు, చరిత్రకారిణిగా ఆమె విశిష్ట కృషిని ఆయన ప్రశంసించారు. విద్య, సాహిత్యం, చరిత్ర, రాజకీయ శాస్త్రాలలో ఆమె కృషి అభినందనీయమన్నారు. రాజ్యసభలో ఆమె పదవీకాలం కోసం ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"డాక్టర్ మీనాక్షి జైన్ గారు గౌరవనీయ రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఆమె ఒక పండితురాలు, పరిశోధకురాలు, చరిత్రకారిణిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. విద్య, సాహిత్యం, చరిత్ర, రాజకీయ శాస్త్ర రంగాల్లో ఆమె కృషి అభినందనీయం. ఆమె పార్లమెంటరీ పదవీకాలానికి శుభాకాంక్షలు. @IndicMeenakshi”


 

****


(Release ID: 2144360)