ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శాంతి, భద్రతలపై బ్రిక్స్ కార్యక్రమం.. ప్రధానమంత్రి ప్రకటన పాఠం

Posted On: 06 JUL 2025 11:07PM by PIB Hyderabad

మిత్రులారా,

ప్రపంచంలో శాంతి, భద్రతలు కేవలం ఆదర్శాలు కావు, అంతకంటే అవి మన ఉమ్మడి ప్రయోజనాలతో పాటు మన అందరి భవిష్యత్తుకు బలమైన పునాదులు. మానవ జాతి పురోగతి శాంతియుత, సురక్షభరిత వాతావరణంలో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో బ్రిక్స్‌ది చాలా ముఖ్య పాత్ర. మనమంతా కలిసికట్టుగా, మన సవాళ్లను సమష్టిగా పరిష్కరించుకోవాల్సిన తరుణమిది. మనం తప్పక ఐకమత్యంతో ముందడుగు వేయాలి.

మిత్రులారా,

ఉగ్రవాదం నేటి కాలంలో మానవజాతి ఎదుర్కొంటున్న అత్యంత గంభీర సవాలు. భారత్ ఇటీవల ఉగ్రవాదుల దుర్మార్గ దాడిని చవిచూసింది.. అది పిరికిపందలు చేసిన దాడి. గత ఏప్రిల్ 22నాటి పహల్గాం ఉగ్ర దాడి భారత్ ఆత్మ, గుర్తింపు, గౌరవం.. వీటినే నేరు లక్ష్యాలుగా చేసుకొన్న దాడి. ఈ దాడి ఒక్క భారత్‌ ను  దెబ్బకొట్టడమే కాదు, యావత్తు మానవ జాతిపైనే జరిగిన దాడి ఇది. ఈ దు:ఖభరిత, విచారకర ఘడియల్లో మా వెన్నంటి నిలవడంతో పాటు మాకు సంతాపాన్ని, మద్దతును తెలియజేసిన మిత్రదేశాలకు  నా హృదయపూర్వక కృతజ్ఞత‌లు తెలియజేస్తున్నాను.

ఉగ్రవాదాన్ని ఖండించడాన్ని అది మనకు లాభమా, కాదా అనే ప్రాతిపదికన కాకుండా, సిద్ధాంతపరమైన విషయంగా చూడాలి. దాడి ఎవరి మీద జరిగింది, ఎక్కడ జరిగింది అనే అంశాలపైన ఆధారపడి మన ప్రతిస్పందన ఉందీ అంటే, అది ఏకంగా మానవ జాతి అంతటికీ ద్రోహం చేసినట్లవుతుంది.

మిత్రులారా,

ఉగ్రవాదులపై ఆంక్షలను విధించాలా, విధించవద్దా అనే సంకోచానికి తావివ్వనేకూడదు. ఉగ్రవాదం వల్ల బాధలు పడుతున్న వారిని, ఉగ్రవాదానికి కొమ్ము కాస్తున్న వారిని ఒకే విధంగా చూడలేం. స్వప్రయోజనాల కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో ఉగ్రవాదానికి మౌనంగా అంగీకారం తెలియజేయడం గాని, లేదా ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి అండగా నిలబడడం గాని.. ఈ వైఖరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాకూడదు. ఉగ్రవాదం విషయంలో మనం మాట్లాడే దానికి, మనం తీసుకొనే చర్యలకు మధ్య ఎలాంటి తేడా ఉండ తగదు. మనం ఈ విధానాన్ని అనుసరించలేకపోతే, అప్పుడు ఉగ్రవాదంతో పోరాడే విషయంలో మనం గంభీరంగా ఉన్నామా, లేదా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.  

మిత్రులారా,

ప్రస్తుతం, పశ్చిమ ఆసియా మొదలు యూరప్ వరకు.. ఈ ప్రపంచం అంతటా వివాదాలు, ఉద్రిక్తతలే తాండవిస్తున్నాయి. గాజాలో మానవ జాతికి ఎదురవుతున్న స్థితి చాలా ఆందోళనను కలిగిస్తోంది. పరిస్థితులు ఎంతగా విషమించినా సరే, శాంతి పథం ఒక్కటే మానవ జాతి మనుగడకు శరణ్యం అని భారత్ బలంగా విశ్వసిస్తోంది.

భగవాన్ బుద్ధుడు, మహాత్మ గాంధీలు పుట్టిన దేశం భారతదేశం. మేం యుద్ధాన్ని, హింసను సమర్ధించనే సమర్ధించం. విభజనకు, సంఘర్షణకు ఆమడ దూరంగా ఈ ప్రపంచాన్ని తీసుకుపోయే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతు ఇచ్చితీరుతుంది. ఈ మార్గం మనను చర్చ, సహకారం, సమన్వయం వైపు పయనించేటట్లు చూస్తుంది. అంతేకాదు, సంఘీభావం, నమ్మకం వర్ధిల్లేటట్లు చేస్తుంది. ఈ దిశగా, అన్ని మిత్రదేశాలకు సహకరించడానికి, భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం. మీకు నా ధన్యవాదాలు.

మిత్రులారా,

చివరగా, వచ్చే ఏడాదిలో భారత్ అధ్యక్షతన నిర్వహించనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా మిమ్మల్నందరినీ స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి భావానువాదం. ఆయన హిందీలో ప్రసంగించారు.

 

***


(Release ID: 2142854)