వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గత రెండు నెలల్లో రూ.7.14 కోట్లను వినియోగదారులకు వాపసు ఇచ్చిన జాతీయ వినియోగదారు హెల్ప్‌లైను


• అధిక సంఖ్యలో ఫిర్యాదులు (8,919) ఇ-కామర్స్ రంగానికి సంబంధించినవే.. దీంతో వాపసు ఇవ్వాల్సివచ్చిన డబ్బు రూ.3.69 కోట్లు

• ఉత్తరప్రదేశ్ ‌నుంచి అత్యంత అధిక సంఖ్యలో అందిన ఫిర్యాదులు.. మొత్తం 1242‌

प्रविष्टि तिथि: 04 JUL 2025 1:40PM by PIB Hyderabad

గత రెండు నెలల్లో వినియోగదారులకు రూ.7.14 కోట్ల డబ్బును తిరిగి ఇవ్వడానికి మార్గాన్ని జాతీయ వినియోగదారు హెల్ప్‌లైను (ఎన్‌సీహెచ్) సుగమం చేసింది. మొత్తం 30 రంగాల్లో రిఫండ్ క్లెయిములకు సంబంధించిన 15,426 వినియోగదారు ఫిర్యాదులను ప్రభావవంతంగా పరిష్కరించగలిగారు.

కేంద్ర ప్రభుత్వ వినియోగదారు వ్యవహారాల విభాగం చేపట్టిన ఒక కీలక కార్యక్రమమే ఎన్‌సీహెచ్. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడంలో ఇది దావాకు ముందస్తు దశలో కీలక పాత్రను పోషిస్తోంది. దీంతో వినియోగదారు పరిరక్షణ చట్టం-2019 పరిధిలో వినియోగదారు సంఘాలపైన పడుతున్న భారాన్ని ఎన్‌సీహెచ్ తగ్గిస్తోంది.

ముఖ్యంగా, అత్యధిక ఫిర్యాదులు వచ్చింది ఇ-కామర్స్ రంగంలోనే. వాటి సంఖ్య 8,919గా ఉంది. వాటి విషయంలో రూ.3.69 కోట్లు తిరిగి ఇచ్చారు.  వాపసు ఇచ్చిన సొమ్ముల్లో ఇదే అత్యధికం. దీని తరువాత ప్రయాణ, పర్యాటక రంగం నిలిచింది. ఈ రంగంలో అందిన ఫిర్యాదులకు రూ.81 లక్షల డబ్బును తిరిగి ఇచ్చారు.  

ఇ-కామర్స్  రిఫండులకు సంబంధించిన ఫిర్యాదులు దేశమంతటి నుంచి అందాయి. వాటిలో అధికంగా 1242 ఫిర్యాదులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాయి. సిక్కిం, దాద్రా నాగర్ హవేలీ వంటి చిన్న ప్రాంతాల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. ఎన్‌సీహెచ్ నిజంగా జాతీయ స్థాయి వినియోగదారు ఫిర్యాదుల పరిష్కార ప్రధాన వేదికగా ఎంత ప్రభావవంతంగా పనిచేస్తోందో ఇది తెలియజేస్తోంది.

రంగాలవారీ అందిన ఫిర్యాదుల సంఖ్యతో పాటు తదనుగుణంగా వాపసిచ్చిన మొత్తాలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి:

 

వరుస సంఖ్య

రంగం

మొత్తం

ఫిర్యాదులు

తిరిగి ఇచ్చిన మొత్తం సొమ్ము

(రూపాయల్లో)

1

E- Commerce

(ఇ-కామర్స్)

8919

36,958,548

2

Travel & Tourism

(ప్రయాణపర్యటక రంగం)

1057

8,141,119

3

General Insurance

సాధారణ బీమా

101

4,143,045

4

Agency Services

(ఏజెన్సీ సేవలు)

261

3,841,754

5

Airlines

(విమానసంస్థలు)

186

3,086,848

6

Others

ఇతరాలు

4902

1,53,18,942

 

Total

మొత్తం

10,373

7,14,90,256

 

ఈ ఏడాదిలో ఏప్రిల్ 25 నుంచి జూన్ 30 మధ్య కాలంలో రూ.7.14 కోట్ల రిఫండుకు మార్గం సుగమం కావడం హెల్ప్‌లైను ఎంత ప్రభావవంతంగా ఉందీ, ఎంత జవాబుదారుతనాన్ని కలిగి ఉందీ చాటిచెబుతోంది. ఇది కన్వర్జెన్స్ భాగస్వాముల సంఖ్య పెరుగుతూ ఉండటం, బలమైన ఆసక్తిదారులు అనుబంధాన్ని ఏర్పరుచుకొంటూ ఉండటం దీనికి అదనపు బలాన్ని అందిస్తోంది. ఇది ఫిర్యాదులను కాలబద్ధ పద్ధతిలో, ఎలాంటి అవస్థలకు తావు ఇవ్వని రీతిన పరిష్కరించడంలో ఎన్‌సీహెచ్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అంతేకాదు, వినియోగదారుల సంక్షేమాన్నీ, మార్కెట్‌లో పారదర్శకత్వాన్నీ ప్రోత్సహించే ఓ విశ్వసనీయమైన, దావా దాఖలు దశకు చేరుకొనే కంటే ముందే ఆశ్రయించదగ్గ ప్లాట్‌ఫామ్ గా దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని కూడా ఇది బలపరుస్తోంది.

ఎన్‌సీహెచ్‌లో నమోదైన ఫిర్యాదులు, డాకెట్ల సంఖ్యలో చోటుచేసుకున్న ఈ వృద్ధి ఈ ప్లాట్‌ఫామ్ వ్యాప్తి.. ప్రత్యేకించి కాల్స్, వెబ్ పోర్టల్, వాట్సాప్, ఎన్‌సీహెచ్ యాప్, ఉమాంగ్,   సీపీగ్రామ్స్, ఎస్ఎంఎస్, ఇమెయిల్, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్‌బాట్ వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా.. అంతకంతకూ పెరుగుతోందని సూచిస్తోంది. 2023 జూన్ 1 మొదలు 2024 మే 31 వరకు, ఇంకా 2024 జూన్ 1 మొదలు ఈ సంవత్సరంలో మే 31వ తేదీ మధ్య నమోదైన తులనాత్మక సమాచారం దీనిని ప్రతిబింబిస్తోంది.

దావా వేయడాని కంటే ముందస్తు దశలోనే దేశవ్యాప్తంగా వినియోగదారులు వారి ఫిర్యాదులను పరిష్కరించుకొనేందుకు ఈ హెల్ప్‌లైను ఒకే ఆశ్రయమార్గంగా తెరమీదకు వచ్చింది. వినియోగదారులు టోల్-ఫ్రీ నంబరు 1915 ను ఉపయోగించి వారి వారి ఫిర్యాదులను నమోదు చేయవచ్చును. ఫిర్యాదులను ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్ (ఐఎన్‌జీఆర్ఎమ్) ద్వారా కూడా అందజేయవచ్చును. ఇది ఐటీ ఆధారిత కేంద్రీయ పోర్టల్. ఇదే ప్రయోజనాన్ని కలగజేయడం కోసం అనేక మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో వాట్సాప్ (8800001915), ఎస్ఎంఎస్ (8800001915), ఇమెయిల్ (nch-ca[at]gov[dot]in), ఎన్‌సీహెచ్ యాప్, వెబ్ పోర్టల్ (consumerhelpline.gov.in) తో పాటు ఉమాంగ్ యాప్ భాగంగా ఉన్నాయి. ఇవి వినియోగదారులకు సరళమైన సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

వినియోగదారు పరిరక్షణ యంత్రాంగాన్ని బలపరచడం కోసం కట్టుబడి ఉన్నట్లు ఈ విభాగం పునరుద్ఘాటించింది. అందరూ వారి వారి హక్కులను కాపాడుకోవడానికీ, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించుకోవడానికీ హెల్ప్‌లైనును సద్వినియోగ పరుచుకోవాల్సిందంటూ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.

విజయ గాథలు

1.              పశ్చిమ బెంగాల్

           ఎ.              పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతాకు చెందిన ఒక వినియోగదారుకు అతడు ఫ్లయిట్ టికెట్టును రద్దు చేసుకొన్నప్పపటికీ, టిక్కెట్టు డబ్బులను తిరిగి ఇవ్వని సమస్య ఎదురైంది. ఈ సమస్యను ఎలాగైనా తీర్చుకోవాలని భావించి, ఆయన ఎన్‌సీహెచ్‌ను సాయం చేయాల్సిందిగా కోరారు. ఎన్‌సీహెచ్ తగిన విధంగా జోక్యం చేసుకోవడంతో, కంపెనీ అతడికి రూ. 8,24,877 వాపసు ఇచ్చింది. ఎన్‌సీహెచ్ సకాలంలో, సమర్థంగా తనకు సాయం చేసిందంటూ ఆయన మనసారా కృతజ్ఞత‌ తెలిపారు.

    బి.              పశ్చిమ బెంగాల్‌లోనే బుర్ద్వాన్ జిల్లాలో ఓ వినియోగదారు కిరాణా సరకుల కోసం ముందుగానే పూర్తి డబ్బు చెల్లించి ఒక ఇ-కామర్స్ కంపెనీకి ఆర్డరిచ్చారు. అయినా సరుకులు మాత్రం ఎంతకీ సరఫరా కావడంలేదు. ఆర్డరు పెట్టినట్టు సైట్‌లో కనపడుతూనే ఉంది. ఆర్డరును రద్దు చేసిన సమాచారాన్ని అందించడంలో పొరపాటు జరగడం, డబ్బు తిరిగి ఇవ్వడంలో జాప్యం.. ఈ సమస్యలకు ఎన్‌సీహెచ్ చురుకైన ప్రమేయంతో  సమాధానం దొరికింది. ఫలితంగా రూ.1,854.11 రిఫండు లభించింది. త్వరగానూ, సంతృప్తికరంగానూ వ్యవహరించిన ఎన్‌సీహెచ్‌కు ‘‘చాలా వేగంగా నా సమస్యకు పరిష్కరించారు. థ్యాంక్స్’’ అంటూ ఆ వినియోగదారు ప్రశంసలు కురిపించారు.

     2.              రాజస్థాన్

మరో కేసులో, రాజస్థాన్‌లో నాగ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వినియోగదారు ఒక డీఎంఆర్ వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేశారు. అయితే దానిని వెనక్కి తీసుకొని, తాను చెల్లించిన డబ్బును తనకు వాపస్ ఇవ్వాలని కోరగా కంపెనీ పదేపదే వాగ్దానం చేసి కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు, వాషింగ్ మెషిన్‌ను వెనక్కి తీసుకుపోనూలేదు. అనేక ఇబ్బందులు ఎదురైనా సరే, వినియోగదారు పట్టు వీడలేదు. ఎన్‌సీహెచ్‌ను సాయమడిగారు. ఎన్‌సీహెచ్ వెంటనే రంగంలోకి దిగింది. మూడు రోజుల లోపల రూ.5,799 తిరిగిఇచ్చేటట్లు చూసింది. ‘‘నా ఫిర్యాదును పరిష్కరించిన తీరు, సకాలంలో స్పందించిన వైఖరి నాకు చాలా సంతృప్తినిచ్చాయి’’ అంటూ ఆ వినియోగదారు తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

3.              ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాకు చెందిన ఒక వినియోగదారు ఒక ఆటవస్తువు విషయంలో ఓ ఇ-కామర్స్ కంపెనీ మీద ఫిర్యాదు చేస్తూ, హెల్ప్‌లైనును సంప్రదించారు. గత మే 8న రూ.1,214 ముందుగానే చెల్లించి ఆటబొమ్మ కావాలని కోరినా, కంపెనీ వద్ద నుంచి ఆ వస్తువు  అందలేదు. తాను అడిగిన వస్తువును ఇంకా ఎందుకు అందజేయడం లేదేం, మీ దగ్గర ఆ ఆటవస్తువు లేకపోతే నా డబ్బు నాకు తిరిగి ఇవ్వండి అంటూ సదరు కంపెనీని కోరినా లాభం లేకపోయింది. ఈ విషయంలో ఎన్‌సీహెచ్ కలగజేసుకోవడంతో, కంపెనీ గత మే నెల 25న రూ.1,214ను అదే వినియోగదారుకు వాపసిచ్చింది. వినియోగదారు హక్కును కాపాడటానికి ఎన్‌సీహెచ్ సమర్థంగా ప్రతిస్పందించిన తీరుతో వినియోగదారు ఖుషీగా ‘‘ఈ కంపెనీ సేవ నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. వాళ్లు నా సమస్యను చాలా త్వరగా తీర్చివేశారు’’ అని ఉత్సాహాన్ని వెలిబుచ్చారు.

    4.              మహారాష్ట్ర

మరో కేసు మహారాష్ట్రలోని ముంబయికి చెందింది. ఓ వినియోగదారు కిరాణా సరకులు కావాలంటూ ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అడిగారు. తక్కువ సరకులు మాత్రమే వచ్చాయి. వెంటనే ఆ కస్టమరు తనకు డబ్బు వాపసు ఇప్పించాల్సిందిగా ఎన్‌సీహెచ్‌ను ఆశ్రయించారు. ఎన్‌సీహెచ్ తక్షణ మద్దతుతో, ఫిర్యాదును దాఖలు చేసిన మూడే మూడు గంటల్లోనే పరిష్కారం లభించింది. సరఫరా చేయని వస్తువులకు రిఫండ్ చెల్లించారు. ఈ శీఘ్ర పరిష్కారానికి గాను వినియోగదారు కృతజ్ఞత‌లు తెలియజేయడంతో పాటు ‘‘చాలా మంచి సేవ. మూడు గంటల్లో నా సమస్యను తీర్చేశారు. నేను నా డబ్బును తిరిగి తీసుకోగలిగాను. ఎన్‌సీహెచ్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు’’ అంటూ మనస్ఫూర్తిగా ప్రశంసించారు.  

    5.               తెలంగాణ

 తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన ఓ వినియోగదారు ఫైవ్-స్టార్ మోడల్ రిఫ్రిజిరేటర్ కావాలని ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా అడగగా దానికి బదులు త్రీ-స్టార్ ఫ్రిజ్ రావడంతో ఫిర్యాదు దాఖలు చేశారు. తనకిచ్చిన ఫ్రిజ్‌ను తిరిగి ఇస్తాను, తీసుకువెళ్లండంటూ కోరితే అనేక సార్లు జాప్యం చేయడంతో, హెల్ప్‌లైనును ఆశ్రయించారు. హెల్ప్‌లైన్ జోక్యం చేసుకొన్న ఫలితంగా ఆ వినియోగదారు కట్టిన రూ. 17,490 మొత్తమంతా కూడా వాపసిచ్చారు. ఎన్‌సీహెచ్ సత్వర పరిష్కారాన్ని అందించినందుకు వినియోగదారు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఎన్‌సీహెచ్ అందించిన సేవతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా సమస్యను చిటికెలో తీర్చింది’’ అని ఆ వినియోగదారు చెప్పారు. 
 
***

(रिलीज़ आईडी: 2142482) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil