రక్షణ మంత్రిత్వ శాఖ
పహల్గామ్‌లో ఉగ్రవాదులు వారి ధర్మం ఆధారంగా అమాయక పౌరులను చంపితే వారి కర్మను బట్టీ మన సాయుధ దళాలు వారిని హతమార్చాయి: రక్షణమంత్రి
ఉగ్రవాద నిర్మూలనకు అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు సాయుధ దళాలు పూర్తి స్వేచ్చా సామర్ధ్యాలతో ఉన్నాయి.
Posted On:
04 JUL 2025 5:44PM by PIB Hyderabad
పహల్గామ్‌లో ఉగ్రవాదులు అమాయక పౌరులను వారి ధర్మం ఆధారంగా చంపితే వారి కర్మ ఆధారంగా మన సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాయని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనూ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేటప్పుడు భారత సాయుధ దళాలు ఎంతో సంయమనం, నిగ్రహాన్ని ప్రదర్శించాయని, పౌర జనాభాకు ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సాయుధ దళాలు భవిష్యత్తులో ఉగ్రవాదంపై అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి స్వేచ్ఛగా, సమర్థవంతంగా ఉన్నాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు..
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సాయుధ దళాలు ప్రదర్శించిన సహనం, నిగ్రహం భారత స్వాతంత్య్ర సమరంలో అమూల్యమైన సేవలందించిన అల్లూరి సీతారామరాజు లక్షణాలను పోలి ఉన్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజును ‘సాధు యోధుడు‘ గా అభివర్ణించిన రక్షణ మంత్రి, అల్లూరి నైతిక పోరాట దృక్పథాన్ని, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన వారసత్వానికి, భారతదేశ ఆధునిక రక్షణ, అభివృద్ధి వ్యూహానికి మధ్య ప్రత్యక్ష సారూప్యం ఉందని అన్నారు. "అల్లూరి కేవలం ఒక విప్లవకారుడు మాత్రమే కాదు. ఆయన ఒక ఉద్యమం. పరిమిత వనరులతోనే ఆయన చూపిన గెరిల్లా పోరాట పటిమ సూత్రబద్ధమైన ధైర్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం కేవలం హక్కు మాత్రమే కాదు. అది జాతి ధర్మం అని ఆయన మనకు నేర్పారు" అని రక్షణ మంత్రి అన్నారు.
గిరిజనుల సాధికారతపై ప్రభుత్వ దృష్టిని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరిస్తూ, అత్యంత అణగారిన వర్గాలను ఉద్ధరించాలనే అల్లూరి జీవిత లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి గిరిజన అభివృద్ధి మిషన్, స్కిల్ ఇండియా, జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన ప్రచారం వంటి ఇటీవలి ప్రభుత్వ కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటిని ఏదో దానంగా కాకుండా, గిరిజన వర్గాలను గౌరవం, అవకాశాలతో కూడిన ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి చేపట్టిన సమగ్రమైన చర్యలని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. "వలస పాలనలో కనీస హక్కులను కూడా కోల్పోయిన పరిస్థితి నుంచి - నేడు సుస్థిర వృద్ధికి సంరక్షకులుగా మారే వరకు - మన గిరిజన సోదరులు, సోదరీమణులు చాలా దూరం ప్రయాణించారు. మేము వారికి తోడుగా నడవడానికి కట్టుబడి ఉన్నాం” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ప్రభుత్వ ప్రయత్నాలు కేవలం విధానాల ద్వారానే కాకుండా, అల్లూరి జీవించిన, ప్రాణత్యాగం చేసిన విలువల పట్ల భావోద్వేగం, లోతైన నిబద్ధతతో రూపు దిద్దుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. “సీతారామ రాజు జీవితం కేవలం ధైర్యానికి సంబంధించినది మాత్రమే కాదు, ఐక్యతకు సంబంధించినది" అని ఆయన అన్నారు. కుల అడ్డంకులను అల్లూరి ఎలా అధిగమించారో, భారతదేశం అంతటా 'గిరిజన యోధుడు'గా ఎలా కీర్తి గడించారో ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను భారతదేశం 11 సంవత్సరాల విప్లవాత్మక పాలనలో సాగించిన ప్రయాణానికి, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పానికి ప్రతిబింబంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.
****
(Release ID: 2142481)
Visitor Counter : 3