ప్రధాన మంత్రి కార్యాలయం
ఘనా పార్లమెంటునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
03 JUL 2025 5:23PM by PIB Hyderabad
గౌరవ స్పీకర్ గారు..
సభాధ్యక్షులు..
గౌరవ పార్లమెంటు సభ్యులు..
అధికార (రాష్ట్ర) మండలి సభ్యులు..
దౌత్యవేత్తలు..
వివిధ పార్టీల ప్రతినిధులు..
గ మాన్ టాస్సే..
స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు..
పౌర సమాజ సంస్థలు..
ఘనాలోని ప్రవాస భారతీయులు..
మాచ్చే!
శుభోదయం!
నేడు ఈ గొప్ప సభనుద్దేశించి ప్రసంగించడం నాకు దక్కిన అపురూపమైన గౌరవంగా భావిస్తున్నాను.
ప్రజాస్వామ్య స్ఫూర్తి, గౌరవం, దృఢత్వంతో తొణికిసలాడే ఘనా దేశాన్ని సందర్శించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధిగా, నా వెంట 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలను తీసుకువచ్చాను.
ఇక్కడి మట్టిపొరల్లో బంగారం నిక్షిప్తమైనందువల్లనే కాక, ఈ మనుషుల మనసుల్లోని ఆదరణ, నిబ్బరం వల్ల ఘనాకి స్వర్ణభూమి అనే పేరు స్థిరపడి ఉండాలి! ఘనా అన్న పేరు వినగానే ప్రతి సవాలుని, సమస్యని స్థైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొని చరిత్రను లిఖించుకున్న గొప్ప దేశం స్ఫురణకు వస్తుంది. ప్రజాస్వామ్య ఆదర్శాలు, సమ్మిళిత వృద్ధి పట్ల మీకు గల నిబద్ధత, మీ దేశాన్ని మొత్తం ఆఫ్రికా ఖండానికి స్ఫూర్తినిచ్చే మార్గదర్శిగా నిలబెడుతోంది.
మిత్రులారా,
నిన్న సాయంత్రం నా పట్ల మీరు చూపిన ఆదరణ నన్ను కదిలించివేసింది. నా మిత్రుడు, ప్రెసిడెంట్ మహామా చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకోవడం విశేషమైన గౌరవంగా భావిస్తున్నాను.. ఆ క్షణాలని నేను ఎన్నటికీ మరువను.
నాకు ఈ గౌరవాన్ని అందించినందుకు 140 కోట్ల భారతీయుల తరఫున ఘనా దేశవాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
భారత్ – ఘనాను కలిపి ఉంచే స్నేహ బంధానికి, విలువలకీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను.
గౌరవ సభ్యులారా,
ఈరోజు ఘనా ప్రియ పుత్రుడు, దార్శనిక నాయకుడు డాక్టర్ క్వామే ఎన్క్రుమా కు నివాళులు అర్పించే అవకాశం నాకు కలిగింది.
"మనని పట్టి ఉంచే బంధాలు సహజమైన మహత్తు కలిగినవి, మనపై రుద్దబడి, విడదీసే అంశాలకంటే అవి ఎంతో బలమైనవి” అని శ్రీ ఎన్క్రుమా అన్నారు.
కలిసికట్టుగా మనం చేస్తున్న ఈ ప్రయాణానికి వారి మాటలే దారిదీపాలు. బలమైన పునాదుల మీద నిర్మించిన ప్రజాస్వామ్యం ఆయన స్వప్నం. సిసలైన ప్రజాస్వామ్యం చర్చలను, భిన్నాభిప్రాయాలను ప్రోత్సహిస్తుంది.. ప్రజలను ఏకం చేస్తుంది. వ్యక్తి గౌరవానికి ప్రాధాన్యమిస్తూ మానవ హక్కులకు దన్నుగా నిలుస్తుంది. నిజానికి ప్రజాస్వామ్య విలువలు అభివృద్ధి చెందేందుకు సమయం పట్టవచ్చు, అయినప్పటికీ, వాటిని పరిరక్షించి, పోషించవలసిన గురుతర బాధ్యత మన మీద ఉంది.
మిత్రులారా,
భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ వ్యవస్థ మాత్రమే అని మేము భావించం, అది ఒక సంస్కారమన్నది మా నమ్మకం. వేలాది సంవత్సరాలుగా భారతీయ సమాజాన్ని చైతన్యవంతంగా ముందుకు నడుపుతున్నది ప్రజాస్వామ్యమే. ఈ విలువలు మా నరనరానా జీర్ణించుకుపోయాయి. వేలాది ఏళ్ళ నాటి వైశాలిని ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రపంచపు అతి ప్రాచీన శృతి అయిన రుగ్వేదం ప్రవచించే సూత్రం:
అనో భద్రాః క్రతవోయన్తు విశ్వతః
అంటే, మంచి ఆలోచనలు అన్ని దిక్కుల నుంచి చేరు గాక అని..
అన్ని రకాల అభిప్రాయాలను స్వాగతించడం, సమాదరించడం ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. భారత్ లో దాదాపు రెండు వేల అయిదు వందల రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి...మరొక్కమారు చెబుతున్నాను – రెండు వేల అయిదు వందల పార్టీలు! వివిధ రాష్ట్రాలను పాలించే ఇరవై విభిన్న పార్టీలు, ఇరవై రెండు అధికారిక భాషలు, వేలాది ఇతర మాండలీకాలు!
మా దేశానికి వచ్చిన అనేకమందిని హృదయపూర్వకంగా స్వాగతించడానికి ఇదీ ఒక కారణమే ! నిజానికి ఇటువంటి మనస్తత్వం గలవారు కాబట్టే భారతీయులు ఏ దేశానికి వెళ్ళినా స్థానికులతో ఇట్టే కలిసిపోతారు! ఘనా సమాజంతో భారతీయులు మమేకమయ్యారు – తేనీరులో కరిగిపోయే చక్కెర లాగా!
గౌరవ సభ్యులారా..
భారత్, ఘనా లు వలసవాద గాయాలను కలిగి ఉన్నాయి. అయితే, మన ఆత్మలు ఏనాడూ సంకెళ్ళకు లొంగలేదు – అవి ఎప్పుడూ సర్వ స్వతంత్రంగా, భయమన్నది ఎరుగక ఉన్నవే! మన ఘన వారసత్వం మనకు స్ఫూర్తిని, బలాన్నీ అందిస్తుంది. సాంఘిక, సాంస్కృతిక, భాషాపరమైన వైవిధ్యం మనకు గర్వకారణం.
స్వేచ్ఛ, ఐక్యత, గౌరవం అనే పునాదులపై మనం దేశాన్ని నిర్మించుకున్నాం. మన బంధానికి పరిమితులు లేవు. మీ అనుమతితో ఒక మాట అనవచ్చా? సుప్రసిద్ధమైన మీ ‘షుగర్ లోఫ్’ పైనాపిల్ కన్నా ఇరుదేశాల స్నేహ బంధం తీయనిది అంటాను.. ఇరుదేశాల సంబంధాలను సమగ్ర భాగస్వామ్యంగా పరివర్తన చేయాలని అధ్యక్షుడు మహామా, నేనూ కలిసి నిర్ణయించాం.
మిత్రులారా..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ప్రపంచ క్రమం వేగంగా మారుతోంది. సాంకేతిక విప్లవం, గ్లోబల్ సౌత్ ఆవిర్భావం, పరివర్తన చెందుతున్న జనాభా సరళి ఈ వేగానికి, విస్తృతికి దోహదపడుతున్నాయి. మునుపటి శతాబ్దాలలో మానవాళి ఎదుర్కొన్న వలస పాలన వంటి సవాళ్ళు ఇప్పటికీ వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి.
విపరీత వాతావరణ మార్పులు, మహమ్మారులు, ఉగ్రవాదం, సైబర్ భద్రత వంటి కొత్తకొత్త సవాళ్ళు, సంక్లిష్ట సంక్షోభాలను నేటి ప్రపంచం ఎదుర్కొంటోంది. ఈ సమస్యలకు దీటైన పరిష్కారాలు కనుగొనడంలో గత శతాబ్దపు సంస్థలు తలకిందులవుతున్నాయి. మారుతున్న పరిస్థితులు ప్రపంచ పాలనలో విశ్వసనీయ, ప్రభావవంతమైన సంస్కరణలను ఆశిస్తున్నాయి.
గ్లోబల్ సౌత్‌కు తన వాణి వినిపించే అవకాశం ఇవ్వకుంటే ప్రపంచ పురోగతి అనేది సాధ్యపడదు. మనకు నినాదాలు మాత్రమే సరిపోవు, దీటైన చర్యలు అవసరం. అందుకే, భారతదేశం జీ-20 అధ్యక్షత వహించిన సమయంలో, ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే దార్శనికతతో మేం పనిచేశాం.
ప్రపంచపు వ్యవహారాల్లో ఆఫ్రికాకు సరైన స్థానాన్ని ఇవ్వాలని, పెద్దపీట వేయాలని మేం గట్టిగా కోరుతున్నాం. మా అధ్యక్షతలో ఆఫ్రికన్ యూనియన్ జీ-20లో శాశ్వత సభ్యత్వం పొందినందుకు మేం ఎంతో గర్విస్తున్నాం.
మిత్రులారా,
భారతదేశంలో మేము నమ్మే సిద్ధాంతం ఒకటే – మానవతకే తొలి ప్రాధాన్యం.
మా ఆదర్శాలను మీతో పంచుకుంటాను:
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః।
సర్వే భద్రాణి పశ్యంతు
మా కిశ్చత్ దుఃఖభాగ్భవేత్॥
అర్ధం వివరిస్తాను..
"అందరూ సంతోషంగా ఉండాలి,
అందరూ అనారోగ్యాల నుండి విముక్తి పొందాలి,
అందరూ శుభప్రదమైన అంశాలను చూడగలగాలి,
ఎవరూ ఏ విధమైన బాధలు పడరాదు."
ప్రపంచం పట్ల భారతదేశ దృక్పథాన్ని ఈ తత్వం ప్రతిబింబిస్తుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో మా చర్యలకు మార్గనిర్దేశం చేసిన సూత్రమిదే. ఘనాలోని మా మిత్రులు సహా 150కి పైగా దేశాలతో మేం టీకాలను, మందులను పంచుకున్నాం.
విపరీత వాతావరణ మార్పుల పరిష్కారం, పర్యావరణ అనుకూల జీవనాన్ని ప్రోత్సహించేందుకు మేం ‘మిషన్ లైఫ్ - లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ సమ్మిళిత స్ఫూర్తి మా ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు శక్తినిస్తుంది:
ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్..
ఆరోగ్యవంతమైన పుడమి కోసం ఒకే ఆరోగ్య లక్ష్యాలు..
సౌర శక్తి వినియోగం, పర్యావరణ హిత ఇంధనం లక్ష్యంగా - అంతర్జాతీయ సౌర కూటమి
పులులు, ఇతర వన చరాల సంరక్షణ ధ్యేయంగా - అంతర్జాతీయ పులుల సంరక్షణ కూటమి..
కర్బన ఉద్గారాల తగ్గింపు, పరిశుభ్రమైన ఇంధనాలకు ప్రోత్సాహం లక్ష్యంగా - ప్రపంచ జీవ ఇంధన కూటమి
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అంతర్జాతీయ సౌర కూటమి ఆఫ్రికన్ ప్రాంతీయ సమావేశానికి వ్యవస్థాపక సభ్య దేశంగా ఘనా ఆతిథ్యం ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే మన ఉమ్మడి నమ్మకాన్ని ఇది ప్రదర్శిస్తుంది.
గౌరవ సభ్యులారా,
గత దశాబ్దంలో, భారతదేశం గణనీయమైన మార్పును చూసింది. భారత ప్రజలు శాంతి, భద్రత, అభివృద్ధిపై తమ విశ్వాసాన్ని కనబరిచారు. గత సంవత్సరం, వారు వరుసగా మూడోసారి అదే ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకున్నారు. ఇలా జరగడం ఆరు దశాబ్దాల పైమాటే.
నేడు, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాజకీయ సుస్థిరత, సుపరిపాలన పునాదులపై భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతోంది.
ప్రపంచ వృద్ధిలో 16% వాటా మాదే. మా జనాభాకు తగ్గట్టుగా తగిన ప్రతిఫలాన్ని ప్రపంచానికి అందిస్తున్నాం. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థను కలిగి ఉంది. ప్రపంచంలోని కంపెనీలు కోరుకునే స్థాయిలో ఆవిష్కరణలు - సాంకేతిక కేంద్రంగా భారత్ ఎదిగింది.
ఔషధ రంగంలో ప్రపంచ గుర్తింపు సంపాదించాం. భారతీయ మహిళలు నేడు సైన్స్, అంతరిక్షం, విమానయానం, క్రీడలలో రాణిస్తున్నారు. చంద్రునిపై కూడా భారత్ అడుగుపెట్టింది. మానవ సహిత అంతరిక్షయానాన్ని చేపట్టాలన్న మా ఆశలకు ఈ రోజు ఒక భారతీయుడు కక్ష్యలో పరిభ్రమిస్తూ రెక్కలు తొడుగుతున్నాడు.
ఎన్నో గర్వించదగ్గ భారత అంతరిక్ష విజయ ఘట్టాలలో ఆఫ్రికా భాగస్వామి కావడం శుభసూచకం. భారత్ ప్రయోగించిన చంద్రయాన్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగినప్పుడు, నేను ఆఫ్రికాలోనే ఉన్నాను. ఇప్పుడు ఒక భారతీయ వ్యోమగామి అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాలు చేస్తున్న సమయంలో కూడా నేను మరోసారి ఆఫ్రికాలో ఉండడం చాలా సంతోషంగా ఉంది.
ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇది మన లోతైన బంధాన్ని, ఉమ్మడి ఆకాంక్షలను, ఉమ్మడి భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది. మా అభివృద్ధి సమ్మిళితమైనది. మన వృద్ధి ప్రతి భారతీయుడి జీవితాన్ని స్పృశిస్తుంది.
భారత ప్రజలు స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సంకల్పించారు. పురోగతి, సౌభాగ్య దిశగా ప్రయాణం కొనసాగిస్తున్న మీతో భారత్ కూడా భుజం భుజం కలిపి ఆ మార్గంలో నడుస్తుంది.
మిత్రులారా,
ప్రపంచంలో ఈరోజు నెలకొన్న అస్థిరత ప్రతీ ఒక్కరికి ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి సమయంలో, భారత ప్రజాస్వామ్యం ఆశాకిరణంగా నిలుస్తోంది. అలాగే, భారత్ అభివృద్ధి యాత్ర ప్రపంచ వృద్ధికి ప్రేరక శక్తిగా మారుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, భారత్ ప్రపంచానికి ఒక బలమైన ఆధారం. బలమైన భారత్, మరింత స్థిరమైన, సమృద్ధిగా ఉన్న ప్రపంచానికి దోహదపడుతుంది. అన్నింటికీ మించి, మా మంత్రం:
"అందరితో కలిసి అందరి నమ్మకంతో, కృషితో, అందరి వృద్ధి కోసం.”
ఆఫ్రికా అభివృద్ధి ప్రయాణంలో నిబద్ధత కలిగిన భాగస్వామిగా భారత్ కొనసాగుతుంది. ఆఫ్రికా ప్రజల కోసం ఉజ్వల, సుస్థిర భవిష్యత్తు కోసం ఆఫ్రికా అభివృద్ధి ప్రణాళిక ఎజెండా 2063కి మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం.
ఆఫ్రికా లక్ష్యాలు మా ప్రాధాన్యతలు. సమానంగా కలిసి వృద్ధి చెందడమే మా విధానం. ఆఫ్రికాతో మా అభివృద్ధి భాగస్వామ్యం అవసరాల ఆధారితమైనది. ఇది స్థానిక సామర్థ్యాలను పెంపొందించడం, స్థానికంగా అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించింది. పెట్టుబడి పెట్టడం మాత్రమే కాకుండా, సాధికారత కల్పించడం, స్వయం సమృద్ధి చెందగల వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సహాయం చేయడం మా లక్ష్యం.
ఈ భాగస్వామ్యానికి మరింత వేగం అందించడం మేం గర్వంగా భావిస్తున్నాం. 2015లో మేము ఇండియా-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సును నిర్వహించాం. గౌరవ అధ్యక్షులు మహామ మా విశిష్ట అతిథులలో ఒకరుగా పాల్గొన్నారు. 2017లో, భారతదేశం ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వార్షిక సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈరోజున మేము ఆఫ్రికాలోని 46 దేశాలకు మా దౌత్య సంబంధాలను విస్తరించాం.
ఆఫ్రికా ఖండం అంతటా 200కు పైగా ప్రాజెక్టులు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక సామర్ధ్యాన్ని పెంచుతున్నాయి. ప్రతీ సంవత్సరం, భారత్-ఆఫ్రికా వ్యాపార సదస్సు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది.
ఘనాలో గత సంవత్సరం తేమా – ఎంపకదన్ రైలు మార్గాన్ని మేం ప్రారంభించాం. ఇది ఆఫ్రికా ప్రాంతంలోని ఈ భాగంలో అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా కింద ఆర్థిక ఏకీకరణను వేగవంతం చేయడానికి ఘనా చేస్తున్న ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం.
ఈ ప్రాంతంలో ఐటీ, ఆవిష్కరణల కేంద్రంగా మారడానికి కూడా ఘనా గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. భరోసా, పురోగతితో నిండిన భవిష్యత్తును మనం కలసి తీర్చిదిద్దుదాం.
గౌరవ సభ్యులారా,
స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలు ఏ ప్రజాస్వామ్యానికైనా ప్రాణం. మన ఎన్నికల కమిషన్లు కలిసికట్టుగా పనిచేయడం ప్రోత్సాహకరం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను పూర్తి విశ్వాసం, పారదర్శకతతో నిర్వహించిన భారత ఎన్నికల కమిషన్ తన అనుభవాలను పంచుకోవడానికి గౌరవంగా భావిస్తుందని నేను నమ్ముతున్నాను.
మన రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలలో పార్లమెంట్ ల పరస్పర సందర్శనలు కూడా ఒక కీలక అంశం. 2023లో అక్రాలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశం నాకు గుర్తు ఉంది. ఆ సమావేశంలో భారత దేశం లోని రాష్ట్రాల శాసనసభల సభ్యులతో కలిసి ఘనాకు వెళ్ళిన భారతీయ పార్లమెంటరీ ప్రతినిధి బృందం అతి పెద్దదిగా నిలిచింది. ఇలాంటి చైతన్యవంతమైన సంభాషణలను మేము ఎంతో విలువైనవిగా భావిస్తాం.
మీ పార్లమెంట్‌లో ఘనా-ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ సొసైటీ ఏర్పాటును నేను స్వాగతిస్తున్నాను. మన పార్లమెంటరీ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. భారతదేశంలోని కొత్త పార్లమెంట్‌ను సందర్శించాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. భారత పార్లమెంట్ లోనూ, రాష్ట్ర అసెంబ్లీలలోనూ మహిళలకు మూడింట ఒక వంతు సీట్లను రిజర్వ్ చేయడానికి మేం తీసుకున్న సాహసోపేతమైన చర్యలను మీరు చూడగలరు.
భారత ప్రజాస్వామ్యానికి ప్రధానమైన చర్చలు, వాదనల తీరును మీరు అక్కడ చూడవచ్చు. మీ ప్రియమైన బ్లాక్ స్టార్స్ ఆట ఎంత ఉత్సాహంగా, ఉద్వేగభరితంగా ఉంటుందో, అవి కూడా అంతే ఉత్సాహంగా, ఉద్వేగభరితంగా ఉంటాయని నేను మీకు హామీ ఇస్తున్నా!
మిత్రులారా,
భారత్, ఘనా ఒకే కలని పంచుకుంటున్నాయి. ప్రతి బిడ్డకు అవకాశాలు లభించే కల. ప్రతి స్వరం వినిపించే కల. దేశాలు విడిపోకుండా, కలిసి ఎదిగే కల.
ఈసందర్భంలో డాక్టర్ ఎన్‌క్రుమా మాటలు గుర్తు చేస్తున్నాను. “నేను ఆఫ్రికాలో పుట్టినందుకే ఆఫ్రికన్ ను కాను. కానీ ఆఫ్రికా నాలో పుట్టింది కాబట్టి నేను ఆఫ్రికన్ .”
అదే విధంగా, భారత్ తన హృదయంలో ఆఫ్రికాను మోస్తోంది. మనం ఈ భాగస్వామ్యాన్ని కేవలం ఈ రోజు కోసం మాత్రమే కాకుండా, రాబోయే తరాల కోసం కూడా పెంపొందిద్దాం.
ధన్యవాదాలు.
***
(Release ID: 2142063)
Visitor Counter : 12
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam