ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు

* ప్రస్తుత స్థితిని గురించి ప్రధానమంత్రికి వివరించిన అధ్యక్షుడు శ్రీ పెజెష్కియన్

* తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి... ఉద్రిక్తతలు తగ్గించాలని, సంభాషణ, దౌత్యం వైపు మొగ్గు చూపాలని పునరుద్ఘాటన... శాంతి, భద్రత, స్థిరత్వాలను పునరుద్ధరించాలంటూ పిలుపు

* భారతీయ సముదాయానికి చెందిన వారిని స్వదేశానికి తరలించడానికి మద్దతు తెలిపినందుకు అధ్యక్షుడు శ్రీ పెజెష్కియన్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు

* వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలపరచుకోవడానికి తీసుకోదగ్గ చర్యలపై నేతల చర్చలు

Posted On: 22 JUN 2025 5:27PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు శ్రీ మసూద్ పెజెష్కియన్ ఈ రోజు టెలిఫోన్‌లో మాట్లాడారు.

ఇరాన్‌లో ప్రస్తుత స్థితిపై... ప్రత్యేకించి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణపై తన దృష్టికోణాన్ని అధ్యక్షుడు శ్రీ పెజెష్కియన్ ప్రధానమంత్రికి సమగ్రంగా వివరించారు.

ఇటీవలి ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని ప్రధానమంత్రి అన్నారు. భారత్ శాంతి, మానవతల పక్షం వహిస్తోందని తెలిపారు. ఉద్రిక్తతలను తక్షణం తగ్గించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్పష్టం చేశారు.  ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం.. వీటిని సత్వరం పునరుద్ధరించే ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తూనే ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
భారతీయ సముదాయానికి చెందిన వారు సురక్షితంగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లడానికి సహకరిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ పెజెష్కియన్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక సహకారం సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలపరచుకొనే దిశగా కృషిని కొనసాగిద్దామంటూ ఇద్దరు నేతలూ తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు. పరస్పర సంప్రదింపులను రాబోయే కాలంలో కూడా కొనసాగిద్దామని నేతలు అంగీకరించారు.

 

***


(Release ID: 2138795) Visitor Counter : 5