ఆయుష్
azadi ka amrit mahotsav

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నంలో 3 లక్షల మంది పౌరులతో ప్రపంచంలోనే అతిపెద్ద యోగా సమ్మేళనానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


సరిహద్దులు, నేపథ్యాలు లేదా సామర్థ్యాలకు అతీతంగా యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధానమంత్రి

యోగా మానవాళికి అవసరమైన విశ్రాంతి సమయం: శ్వాస తీసుకునేందుకు, సమతుల్యతను పొందేందుకు, మళ్లీ సంపూర్ణంగా మారేందుకు అవసరం: ప్రధాని

నేను నుంచి మనం వరకు - యోగా కేవలం వ్యక్తిగత క్రమశిక్షణ కాదు, అదొక సామూహిక ప్రయాణం: ప్రధానమంత్రి

ప్రధానమంత్రి దార్శనికత యోగాను ప్రపంచ ప్రజారోగ్య ఉద్యమంగా మార్చింది: ఆయుష్ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్

డిజిటల్ యుగంలో యోగా ఒక శక్తిమంతమైన ఆరోగ్య సాధనం: శ్రీ చంద్రబాబు నాయుడు

Posted On: 21 JUN 2025 5:08PM by PIB Hyderabad

ఆహ్లాదకరమైన విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో లయబద్ధంగా ఎగసి పడుతున్న అలలపై ఉషోదయ స్వర్ణ కాంతులు ప్రసరిస్తున్న వేళ , దేశాన్ని, ప్రపంచవ్యాప్తంగా యోగా ఔత్సాహికులను ముందుండి నడిపిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద యోగా సమ్మేళనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి భారత్‌తో పాటు విదేశాల నుంచి వచ్చిన వేలాది మందితో కలసి సాగరతీరాన ఈ చారిత్రాత్మక యోగా సెషన్ లో  పాల్గొన్నారు.

ఈ జాతీయ స్థాయి యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు,  కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు, కేంద్ర ఆయుష్ శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్,  కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, రాష్ట్ర కేబినెట్ మంత్రి శ్రీ నారా లోకేష్  కూడా హాజరయ్యారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత  ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి, 11వ సారి జూన్ 21న యోగా దినోత్సవం కోసం ఈ సంవత్సరం ప్రపంచం ఏకతాటిపైకి వచ్చిందని అన్నారు. యోగా అసలైన సారం “ఏకత్వం” అని ఆయన వ్యాఖ్యానించారు. యోగా ప్రపంచాన్ని ఎలా ఏకం చేస్తున్నదో చూడడం ఆనందదాయకమని ఆయన అన్నారు.



గత దశాబ్దంలో యోగా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆలోచనను భారతదేశం ప్రతిపాదించిన అపూర్వ క్షణాన్ని స్మరించుకున్నారు. ఆ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇవ్వడం విశేషమైన అంతర్జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని ఆయన అన్నారు. ఆ ప్రతిపాదనకు వచ్చిన మద్దతు కేవలం ఒక ఆలోచనకే కాకుండా, మానవాళి మేలుకోసం ప్రపంచం కలసికట్టుగా చేసిన ఒక గొప్ప ప్రయత్నానికి సంకేతమని ప్రధానమంత్రి తెలియచేశారు. "పదకొండు సంవత్సరాలుగా, యోగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది  ప్రజల జీవనశైలిలో అంతర్భాగంగా మారింది" అని ఆయన అన్నారు.



దివ్యాంగులు బ్రెయిలీలో యోగ గ్రంథాలను చదువుతున్న తీరు, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా అభ్యాసం చేస్తున్న విధానాన్ని చూసి గర్వంగా ఉందని ప్రధానమంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువత యోగా ఒలింపియాడ్‌లలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని కూడా ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 



సిడ్నీ ఓపెరా హౌస్ మెట్లయినా, ఎవరెస్ట్ శిఖరమయినా, , లేదా విస్తృతమైన సముద్ర తీరమైనా ‘సరిహద్దులు, నేపథ్యాలు లేదా సామర్థ్యాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కోసం, అందరి కోసం యోగా‘ అనే సందేశం మాత్రం ఒక్కటేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు:

యోగా దినోత్సవం రోజున విశాఖపట్నంలో ఉండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, విశాఖను ప్రకృతి - ప్రగతి మేళవింపుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, శ్రీ పవన్ కల్యాణ్ సమర్థ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘యోగాంధ్ర అభియాన్’ ను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు.

యోగా దినోత్సవాన్ని విజయంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో విశేషంగా కృషి చేసిన శ్రీ నారా లోకేష్ ను కూడా ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. యోగా‌ను నిజమైన సమ్మిళిత సామాజిక ఉత్సవంగా మార్చడంలో ఆయన చూపిన నిబద్ధత
ప్రశంసనీయమని ప్రధాని పేర్కొన్నారు. గత అనేక వారాలుగా శ్రీ నారా లోకేష్  చేసిన కృషి సమాజంలోని ప్రతీ వర్గం యోగా దినోత్సవంలో పాల్గొనేలా ప్రోత్సాహిస్తూ, సమాజవ్యాప్త భాగస్వామ్యాన్ని సాధించగలిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

‘యోగాంధ్ర అభియాన్’లో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్టు వివరించిన ప్రధానమంత్రి, ఈ అపూర్వమైన ప్రజా స్పందన “జన భాగిదారి” స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. అదే స్ఫూర్తి వికసిత భారత్‌కు పునాది  అని ఆయన పేర్కొన్నారు. పౌరులు జాతీయ కార్యక్రమాల అమలును తమ  తమ స్వంత బాధ్యతగా తీసుకుంటే, ఎటువంటి లక్ష్యమైనా ఏ మాత్రం పెద్దదిగా అనిపించదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన యోగా ఉత్సవాలలో ప్రజల శక్తి, నిబద్ధత, సద్భావన స్పష్టంగా ప్రతిఫలించాయని ఆయన తెలిపారు.

కేంద్ర ఆయుష్ శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ తమ స్వాగతోపన్యాసంలో, “అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ఆమోదింప చేయడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అసాధారణమైన చొరవ తీసుకున్నారు” అని తెలిపారు. ఆ చొరవ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో జరుపుకొనే ఓ విశ్వవ్యాప్త ప్రజారోగ్య ఉద్యమంగా మారిందిని ఆయన అన్నారు.

ఈ ఉద్యమం దశాబ్దం పూర్తిచేసుకున్న సందర్భంగా “మేము ఈ సంవత్సరం 10 ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించాం” అని శ్రీ జాదవ్ తెలిపారు. వీటిలో హరిత యోగా, యోగా కనెక్ట్, యోగా పార్కులు, యోగా బంధన్, యోగా మహాకుంభ్, యోగా సంగమం వంటి కార్యక్రమాలు ఉన్నాయని,  దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా సంస్థలు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నాయని ఆయన వివరించారు.

కేంద్ర ఆయుష్ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ,  “ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మే 21న ఆంధ్రప్రదేశ్‌లో ‘యోగాంధ్ర అభియాన్’ ప్రారంభమయిందని, ఈ ప్రచారంలో భాగంగా 22,000కు పైగా గిరిజన విద్యార్థులు నిన్న 15 నిమిషాల్లో 12 రౌండ్ల సూర్య నమస్కారాలను నిర్వహించి, తమ పేర్లను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయించారని తెలిపారు.

ప్రధానమంత్రి ప్రేరణతో, ఆయుష్ శాఖ ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించేందుకు ఒక చిన్న కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా, ఈ రోజు ఢిల్లీలో 70 ప్రాంతాల్లో యోగాలో పాల్గొనే వారందరికీ ఆయుష్ ఆహారాన్ని  పంపిణీ చేస్తున్నామని ఆయుష్ మంత్రి చెప్పారు. “ఈ ఆయుష్ ఆహారం మోరింగా ఆధారిత ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంది. ఇది ప్రజల కోసం ఆరోగ్యకరమైనదీ, రుచికరమైనదీ అయిన ఒక మంచి ప్రత్యామ్నాయ ఆహారంగా రూపుదిద్దుకుంటుంది” అని ఆయుష్ మంత్రి తెలిపారు.

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఆతిధ్యమిచ్చే గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు  ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. “11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేనంత ఉత్సాహంతో జరుపుకొన్నాం. విశాఖపట్నంలో 3 లక్షల మందికి పైగా ప్రజలు సామూహిక యోగాభ్యాసాల్లో పాల్గొనడం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది” అన్నారు. “రాష్ట్రవ్యాప్తంగా 2.17 కోట్ల మందిని భాగస్వాములుగా చేసుకుని ఒక నెలపాటు కొనసాగిన యోగాంధ్ర ప్రచారం ఈ కార్యక్రమంతో విజయవంతంగా ముగిసింది. ఈ ప్రచారంలో అనేక రికార్డులు కూడా నమోదయ్యాయి”  అని ముఖ్యమంత్రి అన్నారు.

రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఉధంపూర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మన రుషులు తరతరాలుగా కొనసాగించిన ప్రాచీన యోగా సంప్రదాయాన్ని ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తోంది. భారత్‌లో యోగా కేవలం ఒక అభ్యాసం మాత్రమే కాదు, అది జీవనశైలి” అని పేర్కొన్నారు.

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అహ్మదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. “యోగా మనసు, శరీరం, మెదడు మధ్య ఐక్యతను తీసుకు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల నిత్య జీవనశైలిలో ఇది ఒక భాగంగా మారింది” అని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.



దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,  రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీ‌లోని కర్తవ్య పథ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. “యోగా మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కోణాల్లో సమతుల్యతను పోషిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన,  సార్థకమైన జీవనానికి దోహదపడుతుంది. యోగా‌కు ఈ స్థాయిలో ప్రపంచ గుర్తింపు లభించడమంటే అది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వ ఫలితమే” అని శ్రీనడ్డా సామాజిక మాధ్యమ వేదిక  ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.  గత 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యోగా ను తమ దినచర్యలో అంతర్భాగంగా స్వీకరించారు” అని శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగాను జీవనశైలిగా కొనసాగిస్తూ, మరింతగా ప్రోత్సహించాలని ప్రజలను కోరారు.

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ నగరంలో ఈ రోజు 100కు పైగా కార్యక్రమాలు జరగడం విశేషం.


 

***


(Release ID: 2138630)