హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


· ఎయిరిండియా విమానం ఏఐ-171 ప్రమాదం అత్యంత దురదృష్టకరమైన సంఘటన, యావద్దేశమూ దిగ్భ్రాంతికి గురైంది.. ఈ విషాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుంది

· కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, ప్రధానమంత్రి తరఫున ప్రగాఢ సంతాపం తెలిపిన హోం మంత్రి

· సంయుక్తంగా సహాయక చర్యల్లో నిమగ్నమైన కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం

· ప్రమాదంలో గాయపడిన బాధితులకు ఆస్పత్రిలో పరామర్శ

· డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన తర్వాతే అధికారికంగా మృతుల సంఖ్య ప్రకటన

· ఘటనా స్థలానికి వచ్చిన బంధువుల డీఎన్ఏ నమూనా ప్రక్రియ కూడా 2-3 గంటల్లో పూర్తి

· వెంటనే దర్యాప్తు ప్రారంభించిన విమానయాన శాఖ

Posted On: 12 JUN 2025 11:58PM by PIB Hyderabad

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన స్థలాన్ని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా పరిశీలించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్‌మోహన్ నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, సీనియర్ అధికారులతో హోం మంత్రి సమావేశమై సహాయక చర్యలను సమీక్షించారు.

సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎయిరిండియా విమానం ఏఐ-171 ప్రమాదం అత్యంత దురదృష్టకరమైన సంఘటన అన్నారు. దీంతో యావద్దేశమూ దిగ్భ్రాంతికి గురైందని, ఈ విషాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు దేశ పౌరులంతా సంఘీభావంగా నిలుస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, ప్రధానమంత్రి తరపున హోంమంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ, అగ్నిమాపక దళం, పోలీసు శాఖ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) సహా అన్ని విపత్తు నిర్వహణ విభాగాలను గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తం చేసిందనీ, వారంతా సంయుక్తంగా సహాయక చర్యలు ప్రారంభించారనీ హోంమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం సంయుక్తంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

ఈ విమానంలో భారత, విదేశీ ప్రయాణికులతో కలిపి మొత్తం 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారని శ్రీ అమిత్ షా తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో హోంమంత్రి పరామర్శించారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన తర్వాతే మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వచ్చిన బంధువుల డీఎన్ఏ నమూనా ప్రక్రియ 2-3 గంటల్లో పూర్తవుతుందన్నారు. విదేశాల్లో ఉన్న మృతిచెందిన ప్రయాణికుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించామని, వారు భారత్‌కు వచ్చిన తర్వాత వారి డీఎన్ఏ నమూనాలను సేకరిస్తామని శ్రీ అమిత్ షా తెలిపారు.

గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్), నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్‌యూ) సంయుక్తంగా వీలైనంత త్వరగా డీఎన్ఏ పరీక్షను పూర్తి చేస్తాయని కేంద్ర హోం మంత్రి చెప్పారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తారు. విమానయాన శాఖ వెంటనే దర్యాప్తు ప్రారంభించిందని ఆయన చెప్పారు. సహాయక చర్యల్లో పాలుపంచుకున్న అన్ని సంస్థలకు హోంమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.  

 

***


(Release ID: 2136230)