రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అనధికార ఆటోమేటెడ్ టికెట్ బుకింగ్స్‌పై భారతీయ రైల్వే కఠిన చర్యలు: అసలైన ప్రయాణికుల కోసం మరింత మెరుగ్గా వెబ్‌సైట్ లభ్యత

ఏఐ ఆధారిత బాట్ (బీఓటీ) నివారణ వ్యవస్థతో సక్రమ టికెట్ బుకింగ్‌ను ప్రోత్సహిస్తున్న రైల్వే శాఖ: 2.5 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీల డియాక్టివేట్.

మే 22, 2025న ఒకే నిమిషంలో 31,814 టికెట్ల బుకింగ్ తో రైల్వే టికెటింగ్ చరిత్రలో కొత్త రికార్డు

వినియోగదారులకు మెరుగైన అనుభవంతో గణనీయంగా పెరిగిన లాగిన్‌ల సంఖ్య: 2024–25 ఆర్థిక సంవత్సరంలో 82.57 లక్షలకు చేరుకున్న రోజువారీ సగటు లాగిన్‌లు

Posted On: 04 JUN 2025 3:54PM by PIB Hyderabad

పారదర్శకత, భద్రత, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కీలకమైన అడుగుగా, భారతీయ రైల్వే తన టికెటింగ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ మౌలికసదుపాయాలతో అభివృద్ధి చేసింది.  అత్యాధునిక యాంటీ-బీఓటీ  వ్యవస్థల అమలు,  ప్రముఖ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ (సీడీఎన్) తో సర్వీస్ ఇంటిగ్రేషన్ ద్వారా రైల్వే శాఖ అనధికార ఆటోమేటెడ్ బుకింగ్స్‌ను నిర్వహిస్తున్న దురుద్దేశపూరిత ఏజెంట్లను గణనీయంగా నియంత్రించి, నిజమైన వినియోగదారులకు వెబ్‌సైట్ యాక్సెస్‌ను మెరుగుపరచింది.

తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన మొదటి ఐదు నిమిషాల్లో గరిష్ఠ స్థాయిలో ఉండే బాట్ ట్రాఫిక్‌ను కొత్త వ్యవస్థ సమర్థవంతంగా అదుపులోకి తెచ్చింది. ఈ సమయంలో మొత్తం లాగిన్ ప్రయత్నాల్లో సుమారు 50% వరకు బాట్ ట్రాఫిక్‌ ఉంటుందని అంచనా. ఈ అభివృద్ధి నిజమైన ప్రయాణికులకు మెరుగైన యాక్సెస్‌ను నిర్ధారిస్తోంది. ఫలితంగా, టికెట్లను బుక్ చేయడానికి ఉపయోగించిన 2.5 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డియాక్టివేట్ చేశారు. అప్‌గ్రేడ్ చేసిన ప్లాట్‌ఫారమ్  మరో మైలురాయిగా, మే 22, 2025న భారత రైల్వే చరిత్రలో తొలిసారి ఒకే నిమిషంలో అత్యధికంగా 31,814 టికెట్ల బుకింగ్ నమోదుతో, దృఢత్వం, విస్తరణ సామర్థ్యాన్ని స్పష్టంగా చూపించింది.

నిష్పాక్షికతను, సామర్థ్యాన్ని మరింత పెంచడానికి వినియోగదారులకు కొత్త నిబంధనలు (ప్రోటోకాల్స్) ప్రవేశపెట్టారు. ఆధార్ ద్వారా ధ్రువీకరించని వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేసిన మూడు రోజుల తర్వాత మాత్రమే ఏఆర్పీ, తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు, ఆధార్ ధృవీకరించిన వినియోగదారులు ఆలస్యం లేకుండా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఈ ప్రయత్నాలు మెరుగైన మార్పులను అందించాయి. సగటు రోజువారీ వినియోగదారుల లాగిన్లు 2023–24 ఆర్థిక సంవత్సరంలో 69.08 లక్షల నుంచి  2024–25 ఆర్థిక సంవత్సరంలో 82.57 లక్షలకు పెరిగాయి, ఇది 19.53% పెరుగుదలను నమోదు చేసింది, అదే సమయంలో సగటు రోజువారీ టికెట్ బుకింగ్ లు 11.85% పెరిగాయి. ఇప్పుడు ఈ-టికెటింగ్ రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ లలో  ఇప్పుడు 86.38% వాటాను కలిగి ఉంది.

వ్యవస్థలో చేపట్టిన నవీకరణలు:

*వేగవంతమైన లోడ్ సమయాలు,  తక్కువ సర్వర్ లోడ్ కోసం 87% స్టాటిక్ కంటెంట్ ను సీడీఎన్ ద్వారా అందిస్తారు.  

*అధునాతన ఏఐ అల్గారిథమ్ లను ఉపయోగించి బీఓటీ ట్రాఫిక్‌ను సక్రియంగా గుర్తించడం, నియంత్రించడం కూడా ఈ వ్యవస్థలో భాగంగా చేపట్టారు.

*అనుమానాస్పద యూజర్ ఐడీలను ముందస్తుగా డియాక్టివేట్ చేయడం, సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసే సదుపాయాన్ని కల్పించడం కూడా వ్యవస్థలో భాగంగా అమలులో ఉంది.l.
 
భారతీయ రైల్వే తన అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ ద్వారా ప్రయాణికులకు నిరంతరాయంగా, , సురక్షితమైన,  అనుకూలమైన టికెటింగ్ అనుభవాన్ని అందించేందుకు కట్టుబడి ఉంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణీకుల ప్రయోజనాలను పరిరక్షించడానికి,  సమాన అవకాశాలను అందించడానికి నిరంతర ఆవిష్కరణ,  ఆధునికీకరణ పై ప్రధాన దృష్టి కలిగివుంది.


 

***


(Release ID: 2133990)