ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-67లోని బద్వేల్-గోపవరం గ్రామం నుంచి ఎన్‌హెచ్-16లోని గురువిందపూడి వరకు 4 లేన్ల బద్వేల్-నెల్లూరు రహదారిని డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో చేపట్టేందుకు ఆమోదం తెలిపిన కేబినెట్


మొత్తం 108.134 కి.మీ మేర నిర్మించనున్న రహాదారి అంచనా వ్యయం రూ. 3653.10 కోట్లు

Posted On: 28 MAY 2025 3:17PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 3653.10 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్ 67లో 108.134 కి.మీ పొడవున 4 లేన్ల బద్వేల్-నెల్లూరు కారిడార్ నిర్మించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనిని డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పారిశ్రామిక నడవలు, వాటిలోకి ముఖ్య ప్రాంతాలు.. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవ (వీసీఐసీ)లోని కొప్పర్తి, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక నడవ (హెచ్‌బీఐసీ)లోని ఓర్వకల్, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవ (సీబీఐసీ)లోని కృష్ణపట్నంలను ఇది అనుసంధానించనుంది. ఇది దేశంలోని సరుకురవాణా పనితీరు సూచిక (ఎల్‌పీఐ)పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

బద్వేల్- నెల్లూరు కారిడార్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రస్తుత జాతీయ రహదారి ఎన్‌హెచ్-67లోని గోపవరం గ్రామం వద్ద ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని ఎన్‌హెచ్-16 (చెన్నై-కోల్‌కతా)లోని కృష్ణపట్నం ఓడరేవు జంక్షన్ వద్ద ముగుస్తుంది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవ (సీబీఐసీ) కింద ప్రాధాన్యతా నోడ్‌గా గుర్తించిన కృష్ణపట్నం ఓడరేవుకు వ్యూహాత్మక అనుసంధానతను కూడా అందిస్తుంది.

ప్రతిపాదిత కారిడార్ కృష్ణపట్నం ఓడరేవుకు ప్రయాణ దూరాన్ని ప్రస్తుత బద్వేల్-నెల్లూరు రహదారితో పోలిస్తే 142 కి.మీ నుంచి 108.13 కి.మీలకు అంటే 33.9 కి.మీలు తగ్గిస్తుంది. ఇది ప్రయాణ సమయాన్ని ఒక గంట తగ్గించనుంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా కర్బన ఉద్గరాలు, వాహన నిర్వహణ ఖర్చు (వీఓసీ) తగ్గి మొత్తంగా గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూసిస్తుంది. ప్రాజెక్ట్ వివరాలు(వెళ్లే ప్రాంతాలు, ఇండెక్స్ మ్యాప్) అనుసంధం-1లో ఉన్నాయి.

108.134 కి.మీ.ల ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 20 లక్షల పని దినాలు, పరోక్షంగా 23 లక్షల పని దినాల ఉపాధి లభించనుంది.  ప్రతిపాదిత కారిడార్ పరిసరాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల ఈ ప్రాజెక్టు ద్వారా అదనపు ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి.

 

అనుబంధం -I

ప్రాజెక్ట్ స్వరూప వివరాలు.. సూచిత మ్యాప్:

చిత్రం -1 ప్రతిపాదిత కారిడార్  సూచిత మ్యాప్

చిత్రం-2: పూర్తి ప్రాజెక్ట్ స్వరూపం

***


(Release ID: 2132086) Visitor Counter : 2