మంత్రిమండలి
azadi ka amrit mahotsav

2025-26 లో సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం: ప్రస్తుత వడ్డీ రాయితీ 1.5% యథాతథం

प्रविष्टि तिथि: 28 MAY 2025 3:12PM by PIB Hyderabad

2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కింద వడ్డీ రాయితీ (ఐఎస్) కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకూ ఆమోదం తెలిపింది.

కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ద్వారా రైతులకు తక్కువ వడ్డీ రేట్లకే స్వల్పకాలిక రుణాన్ని అందించడానికి ఉద్దేశించిన కేంద్ర రంగ పథకం ఎంఐఎస్ఎస్.

ఈ పథకంలో భాగంగా:

·         రైతులు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) ద్వారా 7% సబ్సిడీ వడ్డీ రేటుతో రూ .3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను పొందారు. అర్హత కలిగిన రుణ సంస్థలకు 1.5% వడ్డీ రాయితీని అందించారు.

·         అంతేకాకుండా రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు 3% వరకు సకాలంలో చెల్లింపులపై ప్రోత్సాహకం (పీఆర్ఐ)గా లభిస్తుంది. దీంతో కేసీసీ రుణాలపై వడ్డీ రేటు 4 శాతానికి తగ్గుతుంది.

·         పశుసంవర్ధకం లేదా చేపల పెంపకం కోసం ప్రత్యేకంగా తీసుకున్న రుణాలకు రూ.2 లక్షల వరకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది.

ఈ పథకం రూపకల్పన లేదా ఇతర అంశాల్లో ఎలాంటి మార్పులనూ ప్రతిపాదించలేదు.

దేశంలో 7.75 కోట్లకు పైగా కేసీసీ ఖాతాలున్నాయి. వ్యవసాయానికి సంస్థాగత రుణ లభ్యత దిశగా భరోసా అందించడంలో ఈ పథకాన్ని కొనసాగించడం కీలకమైన అంశం. ఉత్పాదకతను పెంచడంలోనూ చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సమ్మిళితత్వాన్ని అందించడంలోనూ ఇది అత్యంత కీలకమైనది.

వ్యవసాయ పరపతి ముఖ్యాంశాలు:

·         కేసీసీ ద్వారా సంస్థాగత రుణ పంపిణీ 2014 లో రూ. 4.26 లక్షల కోట్ల నుంచి 2024 డిసెంబర్ నాటికి రూ.10.05 లక్షల కోట్లకు పెరిగింది.

·         2013-14లో రూ.7.3 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలు 2023-24లో రూ.25.49 లక్షల కోట్లకు పెరిగాయి.

·         2023 ఆగస్టులో కిసాన్ రిన్ పోర్టల్ (కెఆర్పీ) ప్రారంభం వంటి డిజిటల్ సంస్కరణలు క్లెయిమ్ ప్రక్రియలో పారదర్శకతను, సమర్థతను పెంచాయి.

ప్రస్తుత రుణ వ్యయ ధోరణులు, మధ్యస్థ ఎంసీఎల్ఆర్, రెపో రేటు గమనం దృష్ట్యా.. గ్రామీణ, సహకార బ్యాంకులకు చేయూతనిచ్చేందుకు, అలాగే రైతులకు తక్కువ ఖర్చుతో రుణాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచేందుకు వడ్డీ రాయితీ రేటును 1.5% వద్ద కొనసాగించడం అత్యావశ్యకం.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, గ్రామీణ రుణ లభ్యతను బలోపేతం చేయడం, సకాలంలో తక్కువ వడ్డీతో రుణాలను అందుబాటులోకి తేవడం ద్వారా వ్యవసాయాభివృద్ధిని పెంచడంపట్ల ప్రభుత్వ అచంచల నిబద్ధతను కేబినెట్ నిర్ణయం పునరుద్ఘాటిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2132066) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Malayalam , Kannada , English , Urdu , हिन्दी , Nepali , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia