రక్షణ మంత్రిత్వ శాఖ
కేరళ తీరంలో మునిగిన లైబీరియా కంటెయినర్ నౌక: చమురు తెట్టు ఏర్పడటంతో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టిన ఐసీజీ
Posted On:
26 MAY 2025 6:10PM by PIB Hyderabad
లైబీరియాకు చెందిన కంటెయినర్ నౌక ఎంవీ ఎంఎస్సీ ఎల్సా -3 కేరళలోని అలప్పుజ సముద్రతీరానికి నైరుతి దిశలో దాదాపుగా 15 నాటికల్ మైళ్ల దూరంలో 2025, మే 25న మునిగిపోయింది. ఓడ మునిగిన కొన్ని గంటల్లోనే సముద్ర జలాల ఉపరితలంపై చమురు తెట్టు ఏర్పడినట్టు ఐసీజీ నిఘా విమానం గుర్తించింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలను భారతీయ తీర రక్షక దళం (ఐసీజీ) ప్రారంభించింది. కాలుష్య ప్రతిస్పందన చర్యలను చేపట్టేందుకు ఐసీజీకి చెందిన సాక్షం నౌకను తక్షణమే మోహరించారు. ప్రభావిత ప్రాంతంలో ఐసీజీ డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏరియల్ అంచనా చేపట్టి ఆయిల్ స్పిల్ డిస్పెర్సెంట్ (ఓఎస్డీ)ను వెదజల్లింది.
మే 25 ఉదయానికి, నౌక మునిగిన ప్రదేశం నుంచి తూర్పు - ఆగ్నేయం వైపుగా చమురు తెట్టు 1.5 నుంచి 2 నాట్ల వేగంతో వ్యాపిస్తోందని గుర్తించారు. కఠినమైన సముద్ర పరిస్థితులు, బలమైన గాలులు ప్రతిస్పందన చర్యలకు సవాలుగా మారాయి. 100 కి పైగా కార్గో కంటెయినర్లు నీటిలో తేలియాడుతున్నాయి. కొన్ని తెరుచుకుని వాటిలో ఉన్న పదార్థాలు బయటకు వచ్చాయి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో సైతం ఐసీజీ తన కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. భద్రతా చర్యలో భాగంగా ఈ మార్గంలో వెళ్లే నౌకలను దారి మళ్లించారు. తేలియాడుతున్న వ్యర్థాల వల్ల నావిగేషన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ముందుకు సాగాలని నావికులను హెచ్చరించారు.
ఏరియల్ పరికరాలు, ప్రత్యేకమైన నియంత్రణ వ్యవస్థల ద్వారా పర్యవేక్షణ, ఉద్ఘారాలను నియంత్రించే చర్యలను ఐసీజీ తీవ్రం చేసింది. నిరంతర పర్యవేక్షణ కోసం రెండు సముద్రతీర గస్తీ నౌక (ఓపీవీ)లు ప్రభావిత ప్రదేశంలో ఉన్నాయి. కాలుష్య ప్రతిస్పందన నౌక ‘సముద్ర ప్రహారీ’, ఇతర గస్తీ నౌకలు పెద్ద మొత్తంలో ఓఎస్డీని సమీకరించాయి.
నౌకా వాణిజ్య చట్టం, 1958 ప్రకారం ఎంఎస్సీ యజమానులకు కాలుష్య బాధ్యత హెచ్చరికను కొచ్చిలోని నౌకా వాణిజ్య విభాగం జారీ చేసింది. ఎంఎస్సీ సంస్థ కంటెయినర్ల రికవరీ, చమురు తొలగించడం, పర్యావరణాన్ని శుభ్రం చేయడం కోసం టీ అండ్ టీ సాల్వేజ్ను నియమించింది. సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి సిద్ధం కావాలని, తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన కార్గో వ్యర్థాలను తాకరాదని స్థానికులను హెచ్చరించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఐసీజీ సూచించింది.
***
(Release ID: 2131598)