ప్రధాన మంత్రి కార్యాలయం
26, 27 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన
దాహోద్‌లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం... శంకుస్థాపన చేయనున్న ప్రధాని అలాగే భుజ్ ప్రాంతంలో రూ.53,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం... శంకుస్థాపన రెండు దశాబ్దాల గుజరాత్ పట్టణ ప్రగతి పథం వేడుకలకు హాజరు కానున్న ప్రధాని
Posted On:
25 MAY 2025 9:14AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 26, 27 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా తొలి రోజున ఉదయం ఆయన దాహోద్‌లో 11:15 గంటలకు రైలు ఇంజన్ల తయారీ కర్మాగారాన్ని దేశానికి అంకితం చేస్తారు. అటుపైన విద్యుత్ రైలింజన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరంలో దాదాపు రూ.24,000 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.
ప్రధానమంత్రి అక్కడి నుంచి భుజ్‌కు వెళ్లి సాయంత్రం 4 గంటలకు రూ.53,400 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇక్కడ కూడా ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమాల అనంతరం ప్రధానమంత్రి గాంధీనగర్ వెళ్తారు. అక్కడ 27వ తేదీన ఉదయం 11 గంటలకు రెండు దశాబ్దాల గుజరాత్ పట్టణ ప్రగతి పథం వేడుకలలో పాల్గొని, ‘పట్టణాభివృద్ధి సంవత్సరం-2025’ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలో ఆయన ప్రసంగిస్తారు.
దేశవ్యాప్తంగా అనుసంధానం పెంపు, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై తన నిబద్ధత మేరకు దాహోద్‌లో భారత రైల్వే ఇంజిన్ల తయారీ కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ దేశీయ అవసరాల కోసమే కాకుండా ఎగుమతి నిమిత్తం కూడా 9,000 అశ్వికశక్తి సామర్థ్యంతో ఇంజిన్లను తయారు చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తయారైన తొలి విద్యుత్ రైలింజన్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారత రైల్వేల సరుకు రవాణా సామర్థ్యం పెంపులో ఈ రైలింజన్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటికి పునరుత్పాదక బ్రేకింగ్ వ్యవస్థను అమరుస్తారు. పర్యావరణ సుస్థిరతకు దోహదం చేసే విధంగా ఈ వ్యవస్థలు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి.
ఈ కార్యక్రమానంతరం దాహోద్‌లో రూ.24,000 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. వీటిలో రైల్వేలకు సంబంధించినవి సహా గుజరాత్ ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా వెరావల్-అహ్మదాబాద్ మార్గంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ సహా వల్సాద్-దాహోద్ మధ్య ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. వీటితోపాటు గేజ్ మార్పిడి చేసిన కటోసాన్-కలోల్ సెక్షన్ మార్గాన్ని, దానిమీదుగా సరకు రవాణా రైలును కూడా ప్రారంభిస్తారు.
ప్రధానమంత్రి భుజ్‌లో రూ.53,400 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. విద్యుత్ రంగం సంబంధిత ప్రాజెక్టులలో ఖావ్డా పునరుత్పాదక ఇంధన పార్కులో ఉత్పత్తి చేయబడిన పునరుత్పాదక విద్యుత్తు ప్రసారం కోసం ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులు, నెట్వర్క్ విస్తరణ సహా తాపి వద్ద అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ తదితరాలున్నాయి. అలాగే కాండ్లా ఓడరేవు ప్రాజెక్టులు, గుజరాత్ ప్రభుత్వ బహుళ రహదారి, జల-సౌర విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘పట్టణాభివృద్ధి సంవత్సరం-2005’ పేరిట విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ప్రణాళికబద్ధ మౌలిక సదుపాయాలు, మెరుగైన పాలన, పట్టణవాసుల జీవన నాణ్యత మెరుగుపరచడం ద్వారా గుజరాత్ రాష్ట్ర పట్టణ స్వరూపాన్ని ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం. దీనికి రెండు దశాబ్దాలు నిండిన నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గాంధీనగర్‌లో ఏర్పాటు చేస్తున్న గుజరాత్ పట్టణాభివృద్ధి ప్రణాళిక-రాష్ట్ర క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అయిన ‘పట్టణాభివృద్ధి సంవత్సరం-2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, నీటి సరఫరా సంబంధిత పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 22,000కుపైగా ఇళ్లను కూడా ఆయన దేశానికి అంకితం చేస్తారు. దీంతోపాటు ‘స్వర్ణిమ్ జయంతి ముఖ్యమంత్రి షహేరి వికాస్ యోజన’ కింద గుజరాత్‌లోని పట్టణ స్థానిక సంస్థలకు రూ.3,300 కోట్ల నిధులను కూడా ఆయన విడుదల చేస్తారు.
***
(Release ID: 2131126)
|