విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దక్షిణాది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో ప్రాంతీయ విద్యుత్ సమావేశం


* తెలివైన, సుస్థిరమైన, ఆర్థికంగా లాభదాయకమైన విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్

* స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలని, హరిత విద్యుత్ కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్రాలకు సూచన

Posted On: 23 MAY 2025 5:19PM by PIB Hyderabad

దక్షిణాది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ప్రాంతీయ విద్యుత్ సమావేశం ఈ రోజు (మే 23) బెంగళూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్, శ్రీ కేజే జార్జ్ (విద్యుత్ శాఖ మంత్రి, కేరళ), శ్రీ భట్టి విక్రమార్క (తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి), శ్రీ ఎస్ఎస్ శివ శంకర్ (విద్యుత్ శాఖ మంత్రి, తమిళనాడు), శ్రీ ఎ.నమశ్శివాయం (విద్యుత్ శాఖ మంత్రి, పుదుచ్చేరి), శ్రీ గొట్టిపాటి రవి కుమార్ (విద్యుత్ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్) హాజరయ్యారు. కేంద్ర విద్యుత్ కార్యదర్శి, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు (విద్యుత్/ఇంధనం), కేంద్ర, రాష్ట్ర విద్యుత్ సంస్థల సీఎండీలు, విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చడానికి 2035 ఆర్థిక సంవత్సరం వరకు సరిపోయే వనరుల ప్రణాళిక ప్రకారం, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్య ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడం అత్యంత కీలకమని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. అలాగే టారిఫ్ బేస్డ్ కాంపిటీటివ్ బిడ్డింగ్ (టీబీసీబీ), రెగ్యులేటెడ్ టారిఫ్ మెకానిజం (ఆర్‌టీఎం), బడ్జెట్ మద్దతు లేదా ఇప్పటికే ఉన్న ఆస్తుల నుంచి ఆదాయం ఆర్జించడం సహా వివిధ ఆర్థిక నమూనాల ద్వారా  అంతర రాష్ట్ర, రాష్ట్ర సరిహద్దుల లోపల పంపిణీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఏర్పాట్లు చేయడం అవసరమని అన్నారు. ట్రాన్సిమిషన్ గ్రిడ్, పంపిణీ వ్యవస్థలతో సహా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలను సైబర్ ముప్పుల నుంచి రక్షించడానికి, సైబర్ భద్రతా ప్రమాణాలను అమలు చేయడానికి అన్ని విధాలా ప్రయత్నించాలన్నారు. వీటితో పాటుగా పంపిణీ సంస్థలు ఆర్థికంగా స్థిరత్వం పొందే దిశగా కృషి చేయాలని సూచించారు.

కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి ఈ కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలుకుతూ.. ఆ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో నాణ్యతను, విశ్వసనీయతను పెంపొందించడానికి చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి వివరించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించడానికి బెంగళూరు వచ్చిన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దేశ విద్యుత్ రంగం సమగ్రాభివృద్ధికి తమ రాష్ట్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పంపిణీ, ప్రసార మౌలిక వసతులతో సహా విద్యుత్ రంగంలో ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొనేందుకు కేంద్రం సహకారం అందించాలని కోరారు.  

కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఇంధన రంగంలో సాధించిన పురోగతి.. మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన పునాదిని వేసిందన్నారు. అయినప్పటికీ ఆర్థిక స్థిరత్వం, వనరుల తగినన్ని అందుబాటులో ఉండటం, ప్రసార వ్యవస్థను అభివృద్ధి చేయడం తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. పీఎం-కుసుమ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని, వచ్చే 7 నెలల్లోగా దానికి సంబంధించిన పీపీఏలపై సంతకాలు చేయాలని కోరారు. అలాగే ఈ విషయంలో రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకొని, చురుగ్గా పని చేస్తుందని హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో భవిష్యత్తు అవసరాలకు తగినట్లు ఉన్న, ఆధునికమైన, ఆర్థికంగా లాభదాయకమైన విద్యుత్ రంగానికున్న ప్రాధాన్యాన్ని వివరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిరంతర సహకారం, సమన్వయం అవసరాన్ని వివరించారు.

నిర్ధిష్టమైన సవాళ్లను, ఆచరణాత్మకమైన పరిష్కారాలను గుర్తించడంలో ఈ తరహా ప్రాంతీయ సమావేశాలు సహాయపడతాయని అన్నారు. ఈ రంగంలో  సుస్థిరత సాధించడానికి విద్యుత్ ఆదా చేయాలనే ఆలోచనను ప్రోత్సహించడం, తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే గృహోపకరణాలను ఉపయోగించాల్సిన ప్రాధాన్యాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. విద్యుత్ వ్యవస్థలో సైబర్ భద్రతా అంశాలను పరిష్కరించడానికి ప్రాంతీయ స్థాయుల్లో వర్క్ షాపులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖను ఆదేశించారు.

అవసరమైన వనరుల లభ్యతను నిర్ధారించడం, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ఒప్పందాల గురించి మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. వనరుల ప్రణాళికను నెరవేర్చడంతో పాటు తగినంత విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అణు విద్యుత్‌ను జోడించడంపై కూడా దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించారు.

ఆర్వోడబ్ల్యూ సమస్యలతో సహా అంతర రాష్ట్ర పంపిణీ సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్రాలు కృషి చేయాలన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి 2025-26 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పథకాన్ని ఉపయోగించుకోవాలన్నారు. దీనిలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి 50 ఏళ్ల కాల వ్యవధికి 1.5 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాన్ని రాష్ట్రాలకు అందించే పథకం కూడా ఉంది.

మూడో దశ గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ - III)కి సంబంధించిన ప్రతిపాదనలను వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. విశ్వసనీయమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, యూన్ఎఫ్‌సీసీ ద్వారా భారత్ అంగీకరించిన అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాలను నెరవేర్చడానికి.. నిల్వ పరిష్కారాలతో సహా పునరుత్పాదక విద్యుత్‌ను రాష్ట్రాలు ప్రోత్సహించాలని అన్నారు.

విద్యుత్ సరఫరాలో పంపిణీ వ్యవస్థ అత్యంత కీలకమని కేంద్ర మంత్రి అన్నారు. పేలవమైన టారిఫ్ విధానాలు, అసమర్థమైన బిల్లింగ్, వసూలు విధానాలు, ప్రభుత్వ విభాగాల బకాయిలు, సబ్సిడీల్లో జాప్యం వంటి సవాళ్లను ఈ రంగం ఎదుర్కొంటోందని తెలిపారు. ఏటీ అండ్ సీ నష్టాలను, సరఫరా సగటు వ్యయం, సగటు ఆదాయం మధ్య అంతరాన్ని తగ్గించడం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఖర్చులను ప్రతిబింబించే టారిఫ్‌లతో పాటుగా సకాలంలో టారిఫ్‌లు, ట్రూ-అప్ ఆదేశాలను జారీ చేసేలా విద్యుత్ నియంత్రణ కమిషన్లు (ఈఆర్‌సీ)తో కలసి పనిచేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రస్తుతం జరిగే విద్యుత్ సరఫరా నష్టాల వల్ల భవిష్యత్తులో వినియోగదారులకు సేవలను అందించడంపై ప్రభావం పడుతుందని అన్నారు.

ఆర్‌డీఎస్ఎస్ ద్వారా మౌలిక సదుపాయాలు, స్మార్ట్ మీటర్ పనులను వేగవంతం చేయడం ద్వారా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తమ పనితీరును మెరుగు పరుచుకొనేందుకు ప్రయత్నించాలని చెప్పారు. అలాగే ప్రభుత్వ బకాయిలు, రాయితీలను సకాలంలో చెల్లించకపోవడం తీవ్రమైన సమస్యగానే ఉందని అన్నారు. 2024 ఆర్థిక సంవత్సరం బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, కొందరు 2025 ఆర్థిక సంవత్సరానికి ఆ బకాయిలను బదిలీ చేశారని అన్నారు. ఇది సంస్థల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాల బకాయిలను సకాలంలో చెల్లించడానికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ప్రభావవంతమైన మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలనీలు సహా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఏడాది ఆగస్టు నాటికి స్మార్ట్ మీటర్ల ఏర్పాటును పూర్తి చేయాలని తెలిపారు. అలాగే వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఈ ఏడాది నవంబర్ నాటికి స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలన్నారు.

ఏఐ/ఎంఎల్ సాధనాలు అందించిన డేటా విశ్లేషణ ఆధారంగా వినియోగదారులు సంస్థలతో సంప్రదింపులు జరిపే విధానాన్ని మార్చే సామర్థ్యం స్మార్ట్ మీటర్లకు ఉందని తెలిపారు. ఆ ప్రయోజనాలను పొందేలా స్మార్ట్ మీటర్ అప్లికేషన్ లో పొందుపరిచిన ఫీచర్లు వినియోగదారులకు సాయం చేస్తాయి.

విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిరంతరం సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

 

***


(Release ID: 2130899)