రక్షణ మంత్రిత్వ శాఖ
మౌంట్ ఎవరెస్టు అధిరోహణలో ఎన్‌సీసీ సాహసయాత్ర బృందం సఫలం..
• ఈ యువ పర్వతారోహకుల సగటు వయస్సు 19 ఏళ్లే!
Posted On:
18 MAY 2025 6:48PM by PIB Hyderabad
జాతీయ యువ సేనా దళం (నేషనల్ కేడెట్ కోర్..‘ఎన్‌సీసీ’) ఒక ముఖ్య విజయాన్ని చేజిక్కించుకొంది... మౌంట్ ఎవరెస్టును అధిరోహించడంలో ఎన్‌సీసీకి చెందిన సాహస బృందం ఆదివారం (మే 18న) సఫలమైంది. ఎవరెస్టు శిఖరం ఎత్తు 8,848 మీటర్లు. ఈ బృందంలో ఎన్‌సీసీ సైనిక విద్యార్థులు పది మంది.. వారిలో బాలురు, బాలికలు చెరో అయిదు మంది చొప్పున సభ్యులుగా ఉన్నారు. వారితోపాటు నలుగురు అధికారులు, ఇద్దరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, బాలికా కేడెట్ శిక్షకురాలు, మరో పది మంది నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు కూడా ఈ యాత్ర బృందం వెంట ఉన్నారు.
దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన, అనుభవం ఎంతమాత్రం లేని బాలురు, బాలికలు ఎంపిక చేసిన కేడెట్లలో ఉన్నారు. వారంతా ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, శిక్షణను పొందారు. వారు సన్నాహక చర్యలలో భాగంగా, మౌంట్ అబీ గామిన్ వద్ద ఏర్పాటు చేసిన ఒక పూర్వ అభ్యాస కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. దీని తరువాత 15 మందితో కూడిన అంతిమ బృందాన్ని ఎంపిక చేశారు. వారికి సియాచిన్ బేస్ క్యాంపులో గల సైనిక పర్వతారోహణ సంస్థలో శీతకాల ప్రధాన సాంకేతిక శిక్షణనిచ్చారు. నెలల తరబడి శిక్షణను ఇచ్చిన అనంతరం, పది మంది కేడెట్లను మౌంట్ ఎవరెస్ట్ సాహస యాత్రకు ఎంపిక చేశారు.
యువ పర్వతారోహకులతో కూడిన ఈ బృందంలో సభ్యుల సగటు వయస్సు 19 ఏళ్లే. ఇది ఈ బృందాన్ని ఆకర్షణ కేంద్రంగా మార్చేసింది. అంతేకాదు, పర్వతాన్ని ఎక్కేటందుకు అవసరమైన శిక్షణను పొందే క్రమంలో, ఈ యువజనులు తమ దేహదారుఢ్య సంరక్షణ, క్రమశిక్షణల విషయంలో మంచిపేరు తెచ్చుకున్నారు. ఎన్‌సీసీ బృందం శారీరక సన్నద్ధతనూ, మనోబలాన్నీ నేపాల్‌కు చెందిన షెర్పాలు బహుదా ప్రశంసించారు.
సవాళ్లను రువ్వే వాతావరణ ప్రభావాన్నీ, భౌగోళిక పరిస్థితులనూ ఈ సైనిక విద్యార్థులు తమ ధైర్యంతోనూ, ఉత్సాహంతోనూ ఎదురొడ్డి నిలిచి మరీ ప్రపంచంలోకెల్లా అతి ఎత్తయిన పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నారు. అక్కడ మువ్వన్నెల జెండానూ, ఎన్‌సీసీ పతాకాన్నీ వారు దిగ్విజయవంతంగా ఎగరేశారు. త్రివర్ణ పతాకం మన దేశ గౌరవానికి ప్రతీక. ఇక ఎన్‌సీసీ జండా దేశ యువ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తోంది.
కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ సాహసయాత్రను కిందటి నెల 3న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఎవరెస్టు పర్వతాగ్రానికి చేరుకోవడానికి ఎన్‌సీసీ చేపట్టిన సాహస యాత్రల్లో ఇది మూడోది. దీనికన్నా ముందు, 2013లోనూ 2016లోనూ మౌంట్ ఎవరెస్టు అధిరోహణ కార్యాన్ని జయప్రదంగా నెరవేర్చారు.
***
(Release ID: 2129580)