ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీబీఐసీ ఆధ్వర్యంలో ‘సైకిలుపై ఆదివారాలు (సండేస్ ఆన్ సైకిల్)’ – జీఎస్టీ అమలుకు ఎనిమిదేళ్ల సందర్భంగా దేహదారుఢ్యం, జీఎస్టీపై అవగాహన కార్యక్రమం

Posted On: 18 MAY 2025 2:31PM by PIB Hyderabad

జీఎస్టీ అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఫిట్ ఇండియా మూమెంట్ ఆధ్వర్యంలో కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) ‘సండేస్ ఆన్ సైకిల్’ పేరుతో దేశవ్యాప్తంగా సైక్లోథాన్ నిర్వహించింది. ఫిట్ ఇండియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్యమ స్థాయిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రధాన కార్యక్రమాన్ని నేడు తెల్లవారుజామున న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా వందకు మించి సీజీఎస్టీ కమిషనరేట్లు కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

న్యూఢిల్లీలో సైక్లోథాన్‌ను ప్రారంభించి సందర్భంగా సీబీఐసీ సభ్యుడు (జీఎస్టీ) శ్రీ శశాంక్ ప్రియ మాట్లాడుతూ, భారత పన్నుల వ్యవస్థపై జీఎస్టీ విప్లవాత్మకమైన ప్రభావం చూపిందన్నారు. దాదాపు 30 రకాల పరోక్ష పన్నులను ఒకే, పారదర్శక పన్నుగా ఏకీకృతం చేసిన జీఎస్టీ ద్వారా పన్ను నిర్వహణ సులభతరమవడంతోపాటు వ్యాపార సంస్థలకు, పౌరులకు కూడా పన్నును ఆమోదయోగ్యంగా చేసిందన్నారు.

జీఎస్టీ కంపోజిషన్ పథకం, త్రైమాసిక రిటర్నులూ నెలవారీ చెల్లింపుల (క్యూఆర్ఎంపీ) పథకం ద్వారా చిన్న పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన ప్రయోజనాలు లభిస్తాయని శ్రీ శశాంక్ ప్రియ వివరించారు. ఇది పన్ను వ్యవహారాలను సరళతరం చేయడంతోపాటు సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు.

సీజీఎస్టీ ముంబయి, పూణే జోన్లు నిర్వహించిన కార్యక్రమాల్లో శ్రీ సునీల్ శెట్టి, శ్రీ మిలింద్ సోనమ్, శ్రీ జాన్ అబ్రహం వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ఈ సైక్లోథాన్‌లో దేశవ్యాప్తంగా 50,000కు పైగా సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీబీఐసీ సీనియర్ అధికారులు — సీజీఎస్టీ ఢిల్లీ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్రీ రాజేశ్ సోధి, సీబీఐసీ జీఎస్టీ (డీజీజీఎస్టీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ సి.పి. గోయల్, పన్ను చెల్లింపుదారు సేవల డైరెక్టర్ జనరల్ (డీజీటీఎస్) శ్రీ మహేశ్ కుమార్ రుస్తాగి, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రతినిధులు, ప్రజలు సైక్లోథాన్‌లో పాల్గొన్నారు.

జీఎస్టీకి సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి గల సందేహాలకు సమాధానమివ్వడం కోసం వేదిక వద్ద ‘నో ఎబౌట్ జీఎస్టీ’ పేరుతో ప్రత్యేక జీఎస్టీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. భాగస్వామ్యం పెరిగి, సమాచారం అందరికీ చేరడం కోసం జీఎస్టీకి సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా బ్రోచర్‌లను పంపిణీ చేశారు. వీటితోపాటు వ్యూహాత్మకంగా వేదిక అంతటా క్యూఆర్ కోడ్‌లతో కూడిన డిజిటల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా జీఎస్టీ సమాచారాన్ని అందిచే మెటీరియల్‌ను ప్రజలు నేరుగా తమ మొబైళ్లలో స్కాన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా కీలకమైన జీఎస్టీ సంస్కరణలు, పన్ను చెల్లింపుదారులే కేంద్రంగా రూపొందించిన కార్యక్రమలను వివరించే భారీ హోర్డింగ్‌లు, బ్యానర్‌లను ప్రధానంగా ప్రదర్శించారు. వీటిలో ఎంఎస్ఎంఈలకు అందిస్తున్న చేయూత, జీఎస్టీ నమోదు ప్రక్రియ మొదలైన అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రజల భాగస్వామ్యం, అవగాహన ద్వారా జీఎస్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న సీబీఐసీ లక్ష్యానికి అనుగుణంగా.. ఈ కార్యక్రమం సమగ్రమైన,  ఆకర్షణీయమైన వాతావరణాన్ని ఏర్పరిచింది.

ప్రజారోగ్యంపై అవగాహననూ పన్ను చెల్లింపుదారుల భాగస్వామ్యాన్నీ మేళవించే విస్తృతమైన కార్యక్రమంలో ఈ సైక్లోథాన్ భాగం. ప్రజలందరిలోకీ చొచ్చుకెళ్లే వినూత్నమైన కార్యక్రమాల ద్వారా పన్ను చెల్లింపుదారులతోపాట సాధారణ ప్రజలను కూడా భాగస్వాములను చేయడంలో సీబీఐసీ అంకితభావానికి ఇది మరో ఉదాహరణ. ఈ కీలకమైన పన్ను అమలులో ఎనిమిదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జాతీయ ఆరోగ్య లక్ష్యాలు, జీఎస్టీ సంస్కరణల ప్రస్థానాన్ని ప్రజలకు చాటేలా దీనిని రూపొందించారు.  

 

****


(Release ID: 2129542)