మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కొచ్చి నుంచి తొలి హజ్-2025 విమానం: కేంద్ర సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ వీడ్కోలు
హజ్ యాత్రికుల సౌకర్యం-శ్రేయస్సుపై ప్రభుత్వం నిబద్ధతతో ఉంది: మంత్రి
प्रविष्टि तिथि:
16 MAY 2025 7:57PM by PIB Hyderabad
కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, మత్స్య-పశుసంవర్ధక-పాడిపరిశ్రమ శాఖల సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ ఈ రోజు కొచ్చి నుంచి తొలి హజ్-2025 యాత్రికుల విమానానికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రయాణికులు విమానం ఎక్కే ప్రదేశం వద్ద యాత్రికులనుద్దేశించి మాట్లాడుతూ వారందరికీ తొలుత శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర యాత్ర ఆధ్యాత్మిక సుసంపన్నంగా, సజావుగా, సురక్షితంగా సాగాలని హృదయపూర్వకంగా అభిలషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
యాత్రికుల సౌకర్యం, శ్రేయస్సుకు భరోసా ఇవ్వడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని శ్రీ కురియన్ చెప్పారు. ఇందులో భాగంగా “సౌదీ అధికారులతో సమన్వయంతో జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయం హజ్ యాత్రికులకు వైద్య సహాయం, ప్రయాణ-రవాణా సదుపాయాలు సహా ఇతరత్రా అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. దీంతో ఈ పవిత్రయాత్ర ఎలాంటి ఇబ్బందులకూ తావులేని రీతిలో దివ్యానుభూతినిస్తుంది” అని ఆయన వివరించారు.
అనంతరం యాత్రికులతో ముచ్చటిస్తూ- హజ్ యాత్రను మరింత సమగ్రం, సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ డిజిటలీకరణ, ఎంపికలో పారదర్శకత పెంపు, విమానం ఎక్కే ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు తదితరాల విషయంలో ఈ ఏడాది కీలక సంస్కరణలు అమలులోకి తెచ్చామని వివరించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ హజ్ యాత్ర సంసిద్ధ ప్రక్రియ మరింత అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికోసం ప్రభుత్వం సంస్కరణలు చేపట్టడంపై ఈ సందర్భంగా యాత్రికులందరూ కృతజ్ఞతలు తెలిపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆవిష్కరణలు, ఇతర సంస్కరణల వల్ల యాత్రికులందరికీ ఈ హజ్-2025 పవిత్ర యాత్ర మరో కీలక మలుపుగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
***
(रिलीज़ आईडी: 2129299)
आगंतुक पटल : 6