జాతీయ మానవ హక్కుల కమిషన్
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన 14 ఆదేశాలను వెంటనే అమలు చేయాలని రాష్ట్రాలను కోరిన భారత జాతీయ మానవ హక్కుల సంఘం... ప్రమాదకర వ్యర్థ పదార్థాలను మనుషులు తమ చేతులతో శుభ్రపరచే పద్ధతికి స్వస్తి పలకాలంటూ
డాక్టర్ బలరాం సింగ్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా - 2023 కేసులో జారీ చేసిన ఆదేశాలివి
* వాస్తవిక సమయంలో నియమాల పాలన, నివారణలకు పూచీపడటం కోసం
బలమైన పర్యవేక్షణ విధానాలను తీసుకురావాలనేది ప్రధాన సూచన
* పురోగతిపై దృష్టి సారించడానికి, అమలులో అంతరాలను గుర్తించాలి...
అన్ని స్థాయిలలో జవాబుదారుతనాన్ని నిర్దేశించడానికి
ఎప్పటికప్పుడు పరిశీలన చేపడుతూ
సమీక్ష యంత్రాంగాలు ఏర్పాటు చేయాలని స్పష్టీకరణ
* చర్యల నివేదిక 8 వారాల్లో దాఖలు చేయాలని సంబంధిత అధికారులకు పిలుపు
Posted On:
15 MAY 2025 6:03PM by PIB Hyderabad
ప్రమాదకర వ్యర్థ పదార్థాలను మనుషులు తమ చేతులతో శుభ్రపరిచే పద్ధతి ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని భారత జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులకు ఒక లేఖ రాసింది. సర్వోన్నత న్యాయస్థానం 2023లో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు (డాక్టర్ బలరాం సింగ్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 2023 ఐఎన్ఎస్‌సీ 950)లో భాగంగా జారీ చేసిన 14 ఆదేశాలను వెనువెంటనే అమలులోకి తీసుకువచ్చే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఆ లేఖలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచించింది. మనుషులు తమ చేతులతో మైలతోపాటు ప్రమాదకరమైన మురుగునీటి కాలవలను శుభ్రపరచే అమానవీయ, కుల ఆధారిత పద్ధతికి స్వస్తి చెప్పడమే ఈ ఆదేశాల ప్రధానోద్దేశం. ఈ పద్ధతి మానవ హక్కుల, మరీముఖ్యంగా ఆత్మగౌరవంతో జీవించే హక్కుతోపాటు చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న హక్కును కూడా తీవ్ర స్థాయిలో ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ హెచ్చరించింది.
రాజ్యంగం పరంగా, చట్టపరంగా తగిన రక్షణ ఏర్పాట్లు కల్పించడంతో పాటు ఆరు ప్రధాన నగరాలు.. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్..లలో పూర్తి నిషేధాన్ని విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది జనవరి 29న ప్రకటించినా దేశంలో కొన్ని ప్రాంతాల్లో మనుషులు తమ చేతులతోనే పారిశుద్ధ్య నిర్వహణ విధుల్ని నిర్వర్తిస్తుండటం ఇంకా కొనసాగుతూనే ఉందన్న కథనాలు ప్రసారమవుతూ ఉన్నాయని ఎన్‌హెచ్‌ఆర్‌సీ గమనించింది.
అందువల్ల, ఈ కింద ప్రస్తావించిన చర్యలను వెనువెంటనే అమలుచేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సిఫారసు చేసింది..:
• మనుషులు తమ చేతులతో పారిశుద్ధ్య నిర్వహణ పనులు పూర్తి చేసే పద్ధతిని నిషేధించిన సంగతిని, దీనికి సంబంధించిన న్యాయ సంబంధిత ఆదేశాలను స్థానిక అధికారులు, గుత్తేదారులు, సాధారణ ప్రజలు, ఆసక్తిదారులు...ఈ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.
• మనుషులు తమ చేతులతో పారిశుద్ధ్య నిర్వహణ పనులు పూర్తి చేసే పద్ధతి విషయంలో చట్టపరమైన, సామాజికపరమైన, మానవ హక్కుల పరమైన అంశాలను ప్రభుత్వ అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు, సముదాయాలకు లోతైన అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపట్టాలి;
• వాస్తవిక సమయ ప్రాతిపదికన నియమాల పాలన, నివారణకు పూచీపడటం కోసం పక్కా పర్యవేక్షణ విధానాల్ని నిర్దేశించాలి;
• పురోగతిపైన దృష్టి సారించడానికి, ఆచరణలో అంతరాలను గుర్తించడానికి, అన్ని స్థాయిలలోనూ జవాబుదారుతనం నెలకొనేలా జాగ్రత్త తీసుకోవడం కోసం క్రమం తప్పక పరిశీలన కొనసాగిస్తుండటంతో పాటు సమీక్షకు తగిన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి.
సంబంధిత అధికారులు ఎనిమిది వారాల లోపల చర్యల నివేదికను దాఖలు చేయాలని కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.
***
(Release ID: 2129054)