వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సవరించిన సెక్షన్ 80-ఐఏసీ ప్రకారం 187 అంకుర సంస్థలకు పన్ను మినహాయింపును ఆమోదించిన డీపీఐఐటీ
అర్హత వ్యవధి పొడిగింపు.. 2030 ఏప్రిల్ వరకు స్థాపించిన అంకుర సంస్థలకు అవకాశం
Posted On:
15 MAY 2025 4:40PM by PIB Hyderabad
పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఆదాయపు పన్ను చట్టంలోని సవరించిన సెక్షన్ 80-ఐఏసీ ప్రకారం, 187 అంకుర సంస్థలకు ఆదాయపు పన్ను మినహాయింపునకు ఆమోదం తెలిపింది. దేశంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చే దిశగా ఇదో ముఖ్యమైన ముందడుగు. ఏప్రిల్ 30న జరిగిన అంతర మంత్రిత్వ బోర్డు (ఐఎంబీ) 80వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
డీపీఐఐటీ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం- అర్హత కలిగిన అంకుర సంస్థలకు అవి ప్రారంభించిన తేదీ నుంచి పదేళ్ల వ్యవధిలోపు వరుసగా ఏవైనా మూడేళ్ల లాభాలపై 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపునకు ఇది అనుమతిస్తుంది. ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పన, సంపద సృష్టిని ప్రోత్సహించేలా వర్ధమాన వ్యాపారాలకు అవి పుంజుకొంటున్న దశలో చేయూతనివ్వడానికి ఈ పథకాన్ని రూపొందించారు.
79వ ఐఎంబీ సమావేశంలో 75 అంకుర సంస్థలు, 80వ సమావేశంలో 112 అంకుర సంస్థలు ఆమోదం పొందాయి. దీంతో, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 3,700 కు పైగా అంకుర సంస్థలకు మినహాయింపులు మంజూరయ్యాయి.
సెక్షన్ 80-ఐఏసీ కింద ప్రయోజనాలను పొందేందుకు అంకుర సంస్థల అర్హత వ్యవధిని పొడిగిస్తూ 2025–26 కేంద్ర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు 2030 ఏప్రిల్ 1 కన్నా ముందు స్థాపించిన అంకుర సంస్థలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంది. తద్వారా, ఈ పన్ను మినహాయింపు ద్వారా ప్రయోజనం పొందడానికి కొత్త సంస్థలకు మరింత సమయం, అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం డీపీఐఐటీ ప్రవేశపెట్టిన సవరించిన మదింపు విధానం ద్వారా దరఖాస్తు ప్రక్రియ మరింత నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా మారింది. పూర్తి చేసిన దరఖాస్తులను ఇప్పుడు 120 రోజుల్లోపు సమీక్షిస్తారు. ఇది వేగంగా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రోత్సహించడంతోపాటు విధానపరమైన జాప్యాలను తగ్గిస్తుంది.
తాజా దశలో ఆమోదం పొందని అంకుర సంస్థల దరఖాస్తులను తిరిగి మూల్యాంకనం చేసి, మెరుగుపరచుకునేలా ప్రోత్సహిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మార్కెట్ సామర్థ్యం, పరిమాణంతోపాటు ఉపాధి- ఆర్థిక వృద్ధికి తాము అందించిన సహకారాన్ని వివరించడంపై దరఖాస్తుదారులు ప్రధానంగా దృష్టి సారించాలని డీపీఐఐటీ సూచించింది.
స్వయంసమృద్ధ, ఆవిష్కరణ ఆధారిత నవభారత లక్ష్యానికి అనుగుణంగా బలమైన, భవిష్యత్ సన్నద్ధమైన అంకుర సంస్థలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ అంకిత భావం ఈ నిరంతర ప్రోత్సాహక చర్యల ద్వారా స్పష్టమవుతోంది.
పన్ను మినహాయింపు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు వివరాలపై మరింత సమాచారం స్టార్టప్ ఇండియా అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉందని ప్రతినిధి తెలిపారు.
****
(Release ID: 2128945)