వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఆఫ్-క్యాంపస్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదాన్ని అందుకున్న ఇండియన్ ఫారిన్ ట్రేడ్ ఇనిస్టిట్యూట్
• ఈ చొరవ జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా ఉంది..
• అందుబాటులోకి ప్రతిష్ఠాత్మక ఎంబీఏ (అంతర్జాతీయ వాణిజ్యం) కోర్సు... వాణిజ్య విద్యా పరిశోధనకూ ప్రోత్సాహం
• భారత్ వాణిజ్య విద్య అనుబంధ విస్తారిత వ్యవస్థను బలపరచడంతోపాటు
ఎగుమతి ఆధారిత అభివృద్ధికి సహాయకారి కానున్న ఐఐఎఫ్‌టీ గిఫ్ట్ సిటీ
Posted On:
06 MAY 2025 10:37AM by PIB Hyderabad
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల గిఫ్ట్ సిటీలో ఇండియన్ ఫారిన్ ట్రేడ్ ఇనిస్టిట్యూట్ (ఐఐఎఫ్‌టీ) తన ఆఫ్-క్యాంపస్ సెంటరును ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ ఆమోదాన్ని తెలిపింది. ఈ సెంటరును యూజీసీ (ఇనిస్టిట్యూషన్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీస్) నిబంధనలు-2023కు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన ఉద్దేశ పత్రంలో పేర్కొన్న షరతులను ఐఐఎఫ్‌టీ విజయవంతంగా పాటించిన తరువాతనే యూజీసీ చట్టం-1956లోని సెక్షన్ 3లో భాగంగా ఈ ఆమోదాన్ని ఇచ్చారు. ఈ షరతుల్లో... 1,000 మందికి పైగా విద్యార్థులతో ఒక బహు-విషయక (మల్టి-డిసిప్లినరీ) సంస్థను ఏర్పాటు చేయడానికి అభివృద్ధి సంబంధిత మార్గసూచీని దాఖలు చేయడం, అర్హత గల బోధకుల అందుబాటు, విస్తృత విద్యావిషయక కార్యక్రమాలు, ఒక శాశ్వత ప్రాంగణానికి సంబంధించిన ప్రణాళికలతోపాటు అత్యాధునిక గ్రంథాలయ నిర్మాణం... వంటివి భాగంగా ఉన్నాయి.
ఐఐఎఫ్‌టీకి ఆమోదాన్ని అందుకొన్నందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అభినందనలను తెలియజేశారు. ‘‘భారత్‌కు ప్రపంచ ఆర్థిక కూడలిగా ఉన్న గిఫ్ట్ సిటీ (@GIFTCity_)లో కొత్త ఆఫ్-క్యాంపస్ కేంద్రాన్ని తెరవడానికి ఐఐఎఫ్‌టీ అధికారులు (@IIFT_Official) ఆమోదాన్ని అందుకొన్నందుకు ఇవే నా హృదయపూర్వక అభినందనలు. దీంతో ఈ సంస్థ ప్రధాన కార్యక్రమం ఎంబీఏ (అంతర్జాతీయ వాణిజ్య విభాగం)లో ప్రతిభావంతులకు శిక్షణనివ్వడంతోపాటే అంతర్జాతీయ వాణిజ్య రంగంలో స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలకు, పరిశోధనకు అవకాశం లభిస్తుంది’’ అని మంత్రి వెల్లడించారు.
త్వరలో రూపుదాల్చబోయే గిఫ్ట్ సిటీ క్యాంపసును గిఫ్ట్ సిటీ టవర్ 2లోని పదహారో, పదిహేడో అంతస్తుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇది ఐఐఎఫ్‌టీలో ప్రధాన ఎంబీఏ ప్రోగ్రాముతోపాటే అంతర్జాతీయ వ్యాపారం, సంబంధిత రంగాలలో విశేష స్వల్పకాలిక శిక్షణ కోర్సులను అందిస్తుంది... పరిశోధనకు కూడా వీలు కల్పిస్తుంది.
ఈ కార్యక్రమం జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020 లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. బహు-విషయక (మల్టి-డిసిప్లినరీ) విద్యను ప్రోత్సహించడమూ, అధిక నాణ్యత కలిగిన విద్య వరకు చేరుకొనే మార్గాన్ని విస్తరించడమూ ఎన్ఈపీ లక్ష్యాలుగా ఉన్నాయి.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో భాగంగా 1963లో ఏర్పాటైన ఐఐఎఫ్‌టీ అంతర్జాతీయ వాణిజ్యంలో సామర్ధ్యాలను పెంచడానికి అంకితమైన ఒక ప్రధాన సంస్థ. దీనిని 2002లో డీమ్డ్ టు బీ యూనివర్సిటీగా ప్రకటించారు. దీనికి ఎన్ఏఏసీ నుంచి ఎ+ గ్రేడ్ లభించింది. ఏఏసీఎస్‌బీ గుర్తింపు కూడా ఉంది. దీనికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కొన్ని బిజినెస్ విద్యాసంస్థల సరసన నిలిచే అవకాశాన్ని అందించాయి.
భారత వాణిజ్య విద్య అనుబంధ విస్తారిత వ్యవస్థకు గిఫ్ట్ సిటీ ప్రాంగణం గొప్ప తోడ్పాటును అందించడంతోపాటు, ప్రపంచంలో ఎగుమతుల పరంగా ఒక మహాశక్తిగా మారాలన్న మన దేశం ఆకాంక్షను నెరవేర్చడంలో కూడా సాయపడుతుందని భావిస్తున్నారు.
***
(Release ID: 2127226)