సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పాన్-ఇండియన్ అన్నది నిజమే: భారతీయ సినిమా ఐక్యంగా ఉందని స్పష్టం చేసిన సినీరంగ ప్రముఖులు
కోవిడ్ అనంతరం మారుతున్న సినిమా వినియోగ ధోరణులను ప్రధానంగా ప్రస్తావించిన అనుపమ్ ఖేర్
మన ఉమ్మడి వారసత్వాన్ని, మన పాటలను, మన కథలను, మన నేలను మీరు గౌరవించినప్పుడు..
మీ సినిమా భారతీయ సినిమా అవుతుంది: ఖుష్బూ సుందర్
Posted On:
02 MAY 2025 5:57PM
|
Location:
PIB Hyderabad
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్, వేవ్స్ 2025 వేదికగా "పాన్-ఇండియన్ సినిమా: మిత్ ఆర్ మూమెంటమ్" అనే అంశంపై స్ఫూర్తిదాయకమైన ప్యానెల్ చర్చను నిర్వహించారు. శ్రీ నమన్ రామచంద్రన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ చర్చా సమావేశంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు శ్రీ నాగార్జున, శ్రీ అనుపమ్ ఖేర్, శ్రీ కార్తీ, శ్రీమతి ఖుష్బూ సుందర్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
సినిమా శక్తి అది పలికించే భావోద్వేగాల్లోనే ఉందని శ్రీమతి ఖుష్బూ సుందర్ ప్రేక్షకులకు గుర్తు చేశారు. బాలీవుడ్, ప్రాంతీయ చిత్ర పరిశ్రమల మధ్య ఎటువంటి విభజన ఉండకూడదనీ, భారతీయ సినిమాలన్నీ భారతీయులందరి భావాలను దృష్టిలో ఉంచుకునే రూపొందుతాయని ఆమె స్పష్టం చేశారు. "మన ఉమ్మడి వారసత్వాన్ని, మన పాటలను, మన కథలను, మన నేలను గౌరవించినప్పుడు, మీ సినిమా ప్రాంతీయ సినిమాగానో.. జాతీయస్థాయి సినిమాగానో కాకుండా, భారతీయ సినిమా అవుతుందనీ దానివల్ల అన్నీ చక్కబడుతాయి" అని ఆమె వ్యాఖ్యానించారు.
శ్రీ నాగార్జున మాట్లాడుతూ... భారత చలనచిత్ర నిర్మాణ సంప్రదాయాలన్నీ కలిపి అల్లిన గొప్ప సాంస్కృతిక వేడుకగా దీనిని అభివర్ణించారు. కథలు చెప్పే వారికి సదా స్ఫూర్తినిచ్చే అసంఖ్యాక భాషలు, ఆచారాలు, ప్రకృతి దృశ్యాల గురించి ఆయన ప్రస్తావించారు. ఒకరి మూలాల పట్ల గర్వం సృజనాత్మకతను అడ్డుకోదని, అది దానిని విముక్తి చేస్తుందని పేర్కొన్న నాగార్జున అదే భారతీయ సినిమా నిజమైన సారాంశం అని ప్రేక్షకులకు గుర్తు చేశారు.
శ్రీ అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.... కోవిడ్ మహమ్మారి కారణంగా సినిమా వినియోగ ధోరణిలో వచ్చిన మార్పులను ప్రస్తావించారు. ప్రేక్షకులు వివిధ వనరుల ద్వారా సినిమాలను చూడడం ప్రారంభించారని అయితే ఇది వివిధ ప్రాంతాలకు చెందిన సినిమా గురించి కాదు... భారతీయ సినిమా గురించి మాత్రమేనన్నారు. ప్రతిఒక్కరూ తమ కళా నైపుణ్యం విషయంలో సత్యం, నిజాయితీలను ఆచరించాలని ఆయన సూచించారు, “మీరు పెద్ద తెరపై ఒక పౌరాణిక గాథను ప్రదర్శిస్తున్నా, జీవిత భాగాన్ని నాటకంగా ప్రదర్శిస్తున్నా, ఆ కథను చెప్పడంలో మీ నిజాయితీ మీకు గొప్ప మిత్రునిగా తోడుంటుంది. ప్రేక్షకులు ఆకర్షణీయమైన దృశ్యాలను కోరుకుంటారు. కానీ వారు ఎల్లప్పుడూ నిజాయితీనే ప్రశంసిస్తారు.. అదే సినిమా విషయంలో పనిచేస్తుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
శ్రీ కార్తీ మాట్లాడుతూ, జీవితాతీతమైన అనుభవాల పట్ల శాశ్వతమైన ఆసక్తిని గురించి ప్రస్తావించారు. నేటి ప్రేక్షకులకు వైవిధ్యమైన కంటెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ, పాటలు-నృత్యాల గొప్ప ఉత్సాహం కోసం, వీరోచిత ఇతిహాసాల మాయాజాలం కోసం వారు ఇప్పటికీ థియేటర్లకు తరలివస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
చర్చల అంతటా, ప్యానెలిస్టులు "ప్రాంతీయ" చిత్రాల భావనకు మించి వృద్ధి చెందడం గురించి, భారతీయ చిత్రాల భావనను స్వీకరించాల్సిన ప్రాముఖ్యతను గురించి ప్రస్తావించారు. భావోద్వేగాలు, నిజాయితీల ప్రాముఖ్యాన్ని వివరించారు. భారతీయ సినిమా నిజమైన బలం విభజనల్లో కాదు. మన నేలతో ముడిపడి ఉన్న ఐక్యతలోనే ఉందనీ.. అదే ఊపు భారతీయ సినిమాను ముందుకు తీసుకెళ్లగలదని వారు స్పష్టం చేశారు.
ఎప్పటికప్పుడు అధికారిక అప్‌డేట్స్ కోసం, దయచేసి మమ్మల్ని అనుసరించండి:
ఎక్స్ పై :
https://x.com/WAVESummitIndia
https://x.com/MIB_India
https://x.com/PIB_India
https://x.com/PIBmumbai
***
Release ID:
(Release ID: 2126650)
| Visitor Counter:
7