సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ వేదికగా భారత సృజనాత్మక రంగ భవిష్యత్తును వివరించిన కిరణ్ మజుందార్ షా
అంకురసంస్థలు సినిమాలకు అతీతంగా ఆలోచిస్తూ గ్లోబల్ వేవ్స్ సృష్టించే బ్రాండ్లను రూపొందించాలి: షా
సంప్రదాయం-సాంకేతికతల సమ్మేళనంతో భారత్ సరికొత్త కథలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది: షా
Posted On:
02 MAY 2025 8:17PM
|
Location:
PIB Hyderabad
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) ప్రారంభ ఎడిషన్ రెండో రోజైన శుక్రవారం జరిగిన ఇన్ కన్వర్జేషన్ సమావేశంలో, ప్రముఖ ప్రపంచస్థాయి వ్యాపారవేత్త, బయోకాన్ సంస్థ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సృజనాత్మక కంటెంట్ రంగంలో ప్రమేయం గల భారత అంకురసంస్థలు సినిమాలకు అతీతంగా ఆలోచించి గ్లోబల్ వేవ్స్ సృష్టించే బ్రాండ్లను, వ్యవస్థలను అలాగే మేధో సంపత్తిని నిర్మించాలని సూచించారు.
"భారత ఆవిష్కరణల పునరుజ్జీవనం: ప్రపంచస్థాయి అంకుర సంస్థలు... తదుపరి దశాబ్దం" అనే అంశంపై ఫోర్బ్స్ ఎడిటర్-ఎట్-లార్జ్ మనీత్ అహుజాతో చర్చలో పాల్గొన్న మజుందార్ షా, కథలు చెప్పడంలో భారతీయుల ప్రపంచస్థాయి సామర్థ్యం గురించి మాట్లాడారు. రామాయణం గురించి ప్రస్తావిస్తూ, "భారత్ సంప్రదాయం, సాంకేతికతను మిళితం చేస్తూ కొత్త కథలను రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్టార్ వార్స్ కోసం జార్జ్ లూకాస్ భారతీయ ఇతిహాసాల నుంచి ప్రేరణ పొందినట్లే, మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ ఫ్రాంచైజీలుగా మార్చడానికి మనం సాంకేతికతను ఉపయోగించవచ్చు" అని అన్నారు.
భారత జనాభా, డిజిటల్ బలాలను ప్రస్తావిస్తూ ఆమె ఇలా అన్నారు... "ఒక బిలియన్‌కు పైగా స్మార్ట్‌ఫోన్‌లు, సాంకేతిక పరిజ్ఞానం గల జనరేషన్ జెడ్‌తో, భారత్ ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు సిద్ధంగా ఉంది. కానీ ఏ బ్లాక్‌బస్టర్ విషయంలోనైనా, ఒక ఆలోచన, వ్యూహం, అలాగే అవిశ్రాంతంగా దృష్టిసారించడం ద్వారా లభించే విజయం మొదట చిన్నగానే ప్రారంభమవుతుంది." అని తెలిపిన ఆమె, బయోకాన్‌ను ఒక గ్యారేజీలో ప్రారంభించి, దానిని ప్రపంచ బయోటెక్ శక్తిగా అభివృద్ధి చేసిన తన సొంత ప్రయాణాన్ని ఉటంకించారు.
భారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ గురించి ఆమె మాట్లాడుతూ... ఈ రంగంలో ఉన్నవారు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. "మీడియా-వినోద రంగం నేడు జీడీపీకి 20 బిలియన్ డాలర్లను సమకూరుస్తోంది. మనం మొదట 100 బిలియన్ డాలర్లను లక్ష్యంగా చేసుకోవాలి. అలాగే 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆరెంజ్ ఎకానమీ లక్ష్యంగా కృషి చేయాలి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రతిధ్వనిస్తుంది" అని షా పేర్కొన్నారు.
సృజనకారులు, అంకురసంస్థలకు సాధికారత కల్పించడం
భారత సృజనాత్మక రంగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఏఆర్, వీఆర్, లీనమయ్యే అనుభవాల కలయికను కీలక సరిహద్దులుగా ఆమె అభివర్ణించారు. "తదుపరి యునికార్న్స్ కేవలం యాప్‌లనే కాకుండా ఐపీ, టెక్, లీనమయ్యేలా కథలు చెప్పడం వంటి వాటిని అర్థం చేసుకునే సృజనకారులుగా ఉంటారు" అని ఆమె పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను ఉటంకిస్తూ, భారత సృజనాత్మక రంగం ఆకర్షణను మించి ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. "ఇది ప్రపంచవ్యాప్త ఔచిత్యం కలిగి ఉండాలి" అని ఆమె సూచించారు.
"ప్రతి గొప్ప ఆలోచన చిన్నగానే మొదలవుతుంది. అయితే దానిని మీరు ఎంత దూరం తీసుకువెళతారనేది కీలకం అవుతుంది. వైఫల్యం ప్రయాణంలో ఒక భాగం మాత్రమే" అని పేర్కొన్న ఆమె వాస్తవితకతను, నిలకడను కొనసాగించాలని అంకుర సంస్థలను కోరారు.
* * *
Release ID:
(Release ID: 2126583)
| Visitor Counter:
3