సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
“ప్రపంచవ్యాప్తంగా హృదయాలను హత్తుకునే కథలు’’ – కథన రంగ భవిష్యత్తుపై వేవ్స్- 2025లో అంతర్జాతీయ చర్చ
ప్రసారం, సినిమా, సాహిత్యాల సంగమం వేవ్స్- 2025
Posted On:
02 MAY 2025 7:40PM
|
Location:
PIB Hyderabad
తొలి వేవ్స్- 2025 సదస్సులో రెండో రోజు ‘ప్రపంచవ్యాప్తంగా హృదయాలను హత్తుకునే కథలు’ అనే అంశంపై నిపుణులైన వక్తలతో బృంద చర్చ నిర్వహించారు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీలో చీఫ్ స్టోరీ టెల్లింగ్ ఆఫీసర్ కైట్లిన్ యార్నాల్, వాల్ట్ డిస్నీ కంపెనీలో ఈవీపీ, కార్పొరేట్ డెవలప్‌మెంట్ హెడ్ జస్టిన్ వార్‌బ్రూక్; అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కెల్లీ డే, బీబీసీ స్టూడియోస్ ఆసియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్- జనరల్ మేనేజర్ ఫిల్ హార్డ్‌మన్, దేశంలో ప్రముఖ సినీ దర్శకులలో ఒకరైన రాజ్ కుమార్ హీరానీ ఈ చర్చలో పాలుపంచుకున్నారు. ప్రఖ్యాత రచయిత, దౌత్యవేత్త అమీశ్ త్రిపాఠి సంధానకర్తగా వ్యవహరించారు.
ప్రపంచవ్యాప్తంగా మీడియా, వినోదం, సాహిత్య రంగాల్లో దార్శనికులైన నిపుణులు, విఖ్యాత కథకులను ఈ సదస్సు ఒక్కచోట చేర్చింది. విప్లవాత్మకమైన మార్పులను తీసుకురాగల కథన శక్తిపై వారు చర్చించారు. స్ట్రీమింగ్ వేదికలు, ప్రసార దిగ్గజాల నుంచి సినిమా, సాహిత్యం వరకు.. ఆకట్టుకునే కథనాలు సరిహద్దులకు అతీతంగా సంస్కృతులకు ఎలా రూపమివ్వగలవో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఎలా అనుసంధానించగలవో అన్న అంశాలపై విలువైన అభిప్రాయాలను ఈ చర్చలో నిపుణులు పంచుకున్నారు. వ్యూహాత్మక, సృజనాత్మక, భావోద్వేగ శక్తులు అంతర్జాతీయంగా కథన రంగానికి చోదకాలుగా నిలుస్తున్నాయని ఈ చర్చ స్పష్టం చేసింది. అలాగే వివిధ దృక్పధాలు, సంస్కృతులు, సామాజిక మార్పులను అవి విశేషంగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నది.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సైన్స్, పరిశోధన, దృశ్య కథనాలను మిళితం చేసే శక్తిమంతమైన కథనాల రూపకల్పన దిశగా వ్యూహాత్మక లక్ష్యంపై కైట్లిన్ యార్నాల్ (నేషనల్ జియోగ్రాఫిక్) మాట్లాడారు. అత్యంత ప్రభావవంతమైన కంటెంటును రూపొందించడంలోని సవాళ్లూ, దానికి గల అవకాశాలూ రెండింటినీ వివరిస్తూ... కథనంలో ప్రామాణికత, ఔన్నత్యం ప్రధానమైనవని చర్చ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.
ప్రపంచంలో అత్యంత విస్తృతమైన వీక్షక పరిధి గలదిగా, అత్యంత వేగంగా పురోగమిస్తున్న మీడియా, వినోద మార్కెట్లలో ఒకటిగా భారతీయ మార్కెట్‌ను జస్టిన్ వార్‌బ్రూక్ (వాల్ట్ డిస్నీ) అభివర్ణించారు. భారతీయ మార్కెట్‌కు అమితమైన ప్రాధాన్యం ఉందన్నారు. భారతీయ కంపెనీలతో డిస్నీ సహకారంపై కూడా ఆయన మాట్లాడారు. సంస్కృతులను అనుసంధానించడానికి, కథనం ద్వారా అంతర్జాతీయంగా ప్రేక్షకుల మధ్య దూరాన్ని తగ్గించడానికి ఆ భాగస్వామ్యాలు ఎలా దోహదపడుతున్నాయో వివరించారు.
వైవిధ్యంతో కూడిన, స్థానికతను ప్రతిబింబించే కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తూ.. అంతర్జాతీయంగా విస్తరణనూ కంటెంట్ వ్యూహాన్నీ కెల్లీ డే (అమేజాన్ ప్రైం వీడియో) పర్యవేక్షిస్తున్నారు. దేశీయంగానూ అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఆర్థికంగా విజయం సాధించే కథనాలను సంస్థ ఎలా గుర్తిస్తుందని అడగగా.. దానికి ప్రత్యేకమైన అల్గారిథం ఏమీ లేదనీ; కథనంలో బలం, స్థానిక ప్రేక్షకులను అర్థం చేసుకోవడం, సరైన ఫార్మాట్లూ జానర్లను ఎంచుకోవడమే విజయానికి మూలమనీ ఆమె స్పష్టం చేశారు.
బ్రిటిష్ కంటెంటును ఆసియా ప్రేక్షకులకు తగిన విధంగా రూపొందించి అందించడంలో ఫిల్ హార్డ్‌మన్ (బీబీసీ స్టూడియో, ఆసియా) ముందువరుసలో నిలుస్తారు. నాణ్యమైన కంటెంట్ ఎన్నటికీ నిలిచి ఉంటుందని ఆయన అన్నారు. అవగాహన, సమాచారం- బీబీసీ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఉండే అర్థవంతమైన కథనాలను గుర్తించి, ప్రజలకు అందించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.
దేశంలో ప్రఖ్యాత దర్శకుల్లో రాజ్ కుమార్ హీరానీ ఒకరు. భారత్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ప్రేక్షకులను కథలో లీనం చేసేలా- భావోద్వేగపరంగా ఉత్తేజకరమైన, సామాజికంగా ప్రభావవంతమైన సినిమాలను తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. కథనం ఆత్మాశ్రయమైనదని, స్వీకరించే విధానం వ్యక్తిని బట్టి మారుతుందని చర్చలో ఆయన వివరించారు. ఏఐ సామర్థ్యంపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. సృజనాత్మకతను, కథనాన్ని మెరుగుపరచుకోవడానికి దర్శకులకు ఇదొక విలువైన సాధనమని పేర్కొన్నారు.
ప్రఖ్యాత రచయిత, దౌత్యవేత్త అమీశ్ త్రిపాఠి తన కథనంలో పురాణ గాథలు, సాంస్కృతిక వైశిష్ట్యాన్ని విశేషంగా మేళవిస్తున్నారు. ఆయన ఈ చర్చకు సంధానకర్తగా వ్యవహరించారు. భిన్న దృక్పథాలను సంధానిస్తూ, సరిహద్దులకు అతీతంగా ప్రజల్లో అనుసంధానాన్ని పెంచడంలో కథలకు గల సార్వత్రిక శక్తిని ప్రస్తావిస్తూ.. బృంద చర్చను నైపుణ్యంతో నడిపించారు.
***
Release ID:
(Release ID: 2126527)
| Visitor Counter:
6