WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కథన కళ: వేవ్స్-2025 సందర్భంగా తన సినీ ప్రస్థాన విశేషాలను పంచుకున్న ఫర్హాన్ అక్తర్

కథనం, ఆత్మవిశ్వాసం, కళ ద్వారా తన పరిణామ క్రమాన్ని వివరించిన ఫర్హాన్ అక్తర్

 Posted On: 02 MAY 2025 5:19PM |   Location: PIB Hyderabad

ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, రచయిత ఫర్హాన్ అక్తర్ వేవ్స్-2025 వేదికగా జరిగిన ‘ది క్రాఫ్ట్ ఆఫ్ డైరెక్షన్’ మాస్టర్ క్లాస్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గౌరవ్ కపూర్ దీనికి సంధానకర్తగా వ్యవహరించారు. కథకుడిగా అక్తర్ ప్రయాణంపై ఓ సంగ్రహావలోకనాన్ని ఈ సదస్సు అందించింది. సినిమా పరిణామం, దర్శకత్వ సవాళ్లు, చిత్రనిర్మాణంలో ప్రామాణికత ఆవశ్యకతపై చర్చించారు.

 

చర్చను ప్రారంభిస్తూ వేవ్స్‌ను ‘అత్యంత సాధికారక కార్యక్రమం’గా అభివర్ణించిన ఫర్హాన్ తన సృజనకు మూలాలను వివరించారు. గాయకుడిగా, నటుడిగా, దర్శకుడిగా బహుముఖీనంగా సాగిన తన కెరీర్‌లో ఏదంటే ఎక్కువ ఇష్టమన్న ప్రశ్నకు – అది ‘పిల్లల్లో నీకు ఎవరంటే ఇష్టం’ అని అడగడం వంటిదని సమాధానమిచ్చారు. దేనికైనా కొంత ప్రాధాన్యం ఇచ్చే విషయాన్ని అంగీకరిస్తూనే, ప్రతీ పాత్ర తనదైన విధంగా సంతోషాన్నిస్తుందని చెప్పారు.

 

సమకాలీన హిందీ సినిమా దశాదిశలను శాసించిన దిల్ చాహ్తా హై సినిమా నిర్మాణంపై పునస్సమీక్షిస్తూ ఫర్హాన్ ఇలా అన్నారు - “నేను వాస్తవితను చెప్పాలనుకున్నాను. స్నేహం గురించి, మనలాంటి వ్యక్తుల గురించి రాయాలనుకున్నాను. మీరు ఇతరులను అనుకరించొద్దు. సమగ్రత లోపిస్తే ప్రేక్షకులు గ్రహిస్తారు” అని వ్యాఖ్యానించారు. నిజాయితీ, సహానుభూతి ఏ రచయితకైనా ముఖ్య లక్షణాలని ఆయన పేర్కొన్నారు. ఏకాగ్రతతో మెలగాలని, ఎదురుదెబ్బలను ప్రయాణంలో భాగంగా స్వీకరించాలని యువ సృజనకారులను ప్రోత్సహించారు.

 

తొలి చిత్రంలో నటించడంలో ఇబ్బందుల నుంచి సింక్ సౌండ్ వినియోగించే వరకు.. ఈ సదస్సు మొత్తం వారి మధ్య సంభాషణలతో సాగిపోయింది. అది చాలా మంది నటులకు కొత్త అనుభవమే. “వాళ్ళు డబ్బింగ్ కి అలవాటు పడ్డారు. సౌండ్ సింక్ చేయాల్సి రావడం వారిని భయపెట్టింది” అని ఆయన చెప్పారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం చిత్రనిర్మాణంలో అత్యంత ముఖ్యమైన అంశమన్నారు.

 

లక్ష్య సినిమా గురించి మాట్లాడుతూ.. లద్దాఖ్ లో షూటింగ్ వల్ల భౌతికంగా, భావోద్వేగపరంగా ఎదురైన అవరోధాలను వివరించారు. చిత్రీకరణ అనంతరం గుర్తించిన సాంకేతిక సమస్యలు గుండెలు పిండేసేవని గుర్తు చేసుకున్నారు. “మేం తిరిగి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అయితే మేం వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన షాట్లు వచ్చాయి’’ అని చెప్పిన ఆయన ‘‘ఏది జరిగినా దానికో కారణముంటుంది’’ అన్నారు.

 

డాన్ గురించి చెప్తూ.. రైలు ప్రయాణంలో ఒరిజినల్ స్కోర్‌ను వింటున్న సమయంలో ఆ ఐడియా ఎలా వచ్చిందో వివరించారు. ఆ సినిమాను రీమేక్ చేయడం కాదు, దాన్ని తిరిగి చిత్రించడమే సవాలు. “డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ... నేను ఏమి కొత్త అర్థం చెప్పగలను...? అదే నిజమైన పరీక్ష” అన్నారు. షారుఖ్ ఖాన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రాశానని, ఆయన కూడా స్వయంగా ఒరిజినల్ సినిమాకు పెద్ద అభిమానే అని చెప్పారు.

 

తండ్రి జావేద్ అక్తర్, సోదరి జోయా అక్తర్ ఇద్దరూ తన స్క్రిప్టులకు కీలకమైన సౌండింగ్ బోర్డులంటూ ప్రేమగా వారిని గుర్తు చేసుకున్నారు. “మా నాన్న చాలా కఠినంగా ఉండేవాడు. ఇదెందుకు చేస్తున్నావ్? అని ఆయన అడుగుతారు” తన తండ్రికి ఇష్టమైనవి ఏవని అడగగా.. దిల్ చాహ్తా హై, జిందగీ నా మిలేగీ దోబారా గురించి ఫర్హాన్ చెప్పారు.

 

భాగ్ మిల్కా భాగ్ కోసం తాను బాగా మారిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. మిల్కా సింగ్ స్ఫూర్తి తనలో ప్రేరణ నింపిందన్నారు. “కష్టపడి పనిచేయాలని, నైపుణ్యంపై దృష్టి పెట్టాలని భవిష్యత్తు తరాలకు చెప్పడం కోసం మిల్కా కథను ఎంచుకున్నాను. ఆ శక్తి మనల్ని ముందుకు నడిపింది’’ అని అన్నారు.

 

కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ ఫర్హాన్ సందేశం స్పష్టంగా ప్రతిధ్వనించింది: “ఎవరి కథలోనో ఓ పాత్రగా మిగిలిపోకు. సొంత కథను రాసుకో. క్రమశిక్షణను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి.”

 

ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలతో సదస్సు ముగిసింది. కేవలం సినిమా విషయాలు మాత్రమే కాక, తన మార్గాన్ని తానే నిర్దేశించుకునేలా కావాల్సిన ధైర్యాన్నిచ్చేలా... మాస్టర్ క్లాస్ అందరినీ ఆకట్టుకునేలా, నిజాయితీగా, స్ఫూర్తిదాయకంగా సాగింది.  

 


Release ID: (Release ID: 2126429)   |   Visitor Counter: 7