సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతీయ మీడియా, వినోద పరిశ్రమ భవిష్యత్తుపై వేవ్స్ 2025లో చర్చ
చర్చాంశం: ‘ఇండియన్ ఎం అండ్ ఈ @100: రీఇమాజినింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్’
Posted On:
01 MAY 2025 7:15PM
|
Location:
PIB Hyderabad
ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వేవ్స్ 2025 ప్రారంభమైంది. తొలి రోజు ‘‘ఇండియన్ ఎం అండ్ ఈ @100: రీఇమాజినింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్’’ అనే అంశంపై చర్చ సాగింది. ఈ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2047 దిశగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ రంగం సాధించిన అభివృద్ధి, భవిష్యత్తు గురించి చర్చించారు. బిజినెస్ స్టాండర్డ్‌లో కంట్రిబ్యూటింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న వనితా కోహ్లి ఖండేకర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ చర్చను ప్రారంభిస్తూ.. 2000 నాటికి రూ.500 కోట్ల విలువ మాత్రమే ఉన్న మీడియా, వినోద రంగం ప్రస్తుతం రూ.70,000 కోట్ల పరిశ్రమగా ఎలా ఎదిగిందో వనితా కోహ్లి ఖండేకర్ వివరించారు. ఈ రంగానికి సంబంధించి తీసుకున్న రెండు విధానపరమైన నిర్ణయాలు ఈ వృద్ధికి కారణమని తెలిపారు. అవే చిత్రరంగానికి పరిశ్రమ హోదాను కల్పించడం, మల్టిప్లెక్స్ లకు ప్రారంభ పన్ను మినహాయింపులు ఇవ్వడం. కంటెంట్ నాణ్యతను మెరుగుపరచడంలో, ఆదాయాన్ని పెంపొందించడంలో ఏఐ సామర్థ్యం గురించి ముఖ్యమైన ప్రశ్నను ఆమె సంధించారు. దేశ సాంస్కృతిక, భాషా వైవిధ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. వైవిధ్యమైన భారతీయ ప్రేక్షకులకు తగినట్టుగా పరిశ్రమ వృద్ధి సమ్మిళితంగా, సున్నితంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
ఎం అండ్ ఈ రంగంలో ప్రకటనల ఆదాయంలో 60 శాతం డిజిటల్ వేదికల నుంచే వస్తోందని గ్రూప్ ఎం, మేనేజింగ్ డైరెక్టరయిన వినీత్ కర్ణిక్ తెలిపారు. గడచిన కొన్నేళ్లుగా ఈ రంగం అనేక ఇబ్బందులకు లోనైందని, ఇది కంటెంట్ వినియోగం, మార్కెటింగ్ విధానంలో ప్రాథమిక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. ఏఐ సామర్థ్యాన్ని అంగీకరిస్తూనే.. కంటెంట్ మానవీయంగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సంస్కృతిని మొబైల్ టెక్నాలజీ మార్పులకు గురి చేస్తున్న ఈ సమయంలో ఇది అవసరమని పేర్కొన్నారు. కథనాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతను నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే భవిష్యత్తు నిపుణులను సిద్ధం చేసేలా ముంబయి విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన నూతన కోర్సు గురించి ప్రేక్షకులకు తెలియజేశారు.
కంటెంట్ ప్రసారాలకు సంబంధించిన భవిష్యత్తు గురించి జెట్‌సింథసిస్ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన రజన్ నవానీ వివరించారు. ఇది ఇంటరాక్టివ్ అనుభవాలను అందించే హైబ్రిడ్ వేదికగా మారుతుందని విశ్వసించారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం భారత్‌కు 2-3 శాతం వాటా మాత్రమే ఉందని, 2047 నాటికి దీనిని విస్తరించాలని పేర్కొన్నారు. దీనికోసం ప్రతిభను అన్వేషించడంపై పెట్టుబడి పెట్టడం, దేశంలో పెట్టుబడి సామర్థ్యాన్ని విస్తరించడం అవసరమని పేర్కొన్నారు. వినోద రంగం కాలానుగుణంగా మార్పులు చెందుతోందని, వివిధ పద్ధతులకు తగినట్లుగా వేర్వేరు సాంకేతికతలు అవసరమవుతాయని తెలిపారు. ఆదాయాన్ని పెంపొందించాల్సిన అంశంపై వనిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అభివృద్ధి చెందిన మార్కెట్లతో పోలిస్తే.. భారత్‌లో తక్కువ ఆదాయమే వస్తోందని, అయితే స్థిరమైన ఆర్థిక వృద్ధి వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను ఉదాహరణగా వివరించారు. ఇక్కడ ప్రేక్షకులు దీన్ని వ్యక్తిగతంగా వినియోగిస్తూ, చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు.
మీడియా రంగంలో ఏఐ ఆవిష్కరణలకు భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా మార్చాలని ఈరోస్ నౌ సీఈవో విక్రమ్ తన్నా పిలుపునిచ్చారు. కంటెంట్ రూపకల్పన, పంపిణీ రెండింటినీ ఏఐ మార్చగలదని, వినియోగదారులను సైతం క్రియేటర్లుగా మారేందుకు నూతన మార్గాలను అందిస్తుందని వాదించారు. డిజిటల్ యుగం అనేక మార్పులు తీసుకువస్తుందని, ఈ రంగంలో భారత్ పోటీలో నిలబడాలంటే వ్యూహాత్మక జోక్యాలు అవసరమని ఆయన అన్నారు. నూతన సాంకేతికతలను సరళీకరించి - వాటిని ఇంటర్నెట్ తరహాలో అందుబాటులోకి తీసుకువస్తే.. వ్యాపారం దానంతట అదే విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమ అభివృద్ధిలో.. యంత్ర వినియోగాన్ని అర్థం చేసుకోవడం, ప్రకటనలు, ప్రేక్షకులను అలరించడంలో విస్తృతమైన కంటెంట్ వ్యవస్థను నియంత్రణ కీలకంగా మారతాయని వివరించారు.
భారతీయ ఎం అండ్ ఈ రంగంపై ముందుచూపుతో కూడిన దృక్పథాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శించింది. అలాగే దాని భవిష్యత్తును నిర్దేశించడంలో విధానాలు, సాంకేతికత, ప్రతిభ, సాంస్కృతిక నేపథ్యం పోషించే పాత్రను కూడా తెలియజేసింది. మే 4 వరకు జియో కన్వెన్షన్ సెంటర్లో వేవ్స్ 2025 కొనసాగుతుంది. దీనిలో ఆడియో-విజువల్, వినోద రంగంలో వస్తున్న అంతర్జాతీయ మార్పులను తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు.
***
Release ID:
(Release ID: 2126136)
| Visitor Counter:
11