సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రసార నియంత్రణ రంగ వృద్ధి, భవిష్యత్తు సవాళ్లను స్పష్టం చేసిన వేవ్స్ 2025
Posted On:
01 MAY 2025 8:14PM
|
Location:
PIB Hyderabad
ముంబయిలో ఈ రోజు ప్రారంభమైన వేవ్స్ 2025 ప్రపంచ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరిగిన బ్రేక్ అవుట్ సమావేశాల్లో మీడియా-వినోద రంగ వృద్ధిని, సమతుల్య నియంత్రణ విధానం ఆవశ్యకతను గురించి ప్రధానంగా చర్చించారు.
డిజిటల్ యుగంలో ప్రసారాన్ని నియంత్రించడం - కీలక విధానాలు, సవాళ్లు అనే అంశంపై జరిగిన బ్రేక్ అవుట్ సమావేశంలో అంతర్జాతీయ, భారత మీడియా నియంత్రణ సంస్థలకు చెందిన ప్రముఖులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ శ్రీ అనిల్ కుమార్ లహోటి, ఆసియా-పసిఫిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ డెవలప్‌మెంట్ (ఏఐబీడీ) డైరెక్టర్ శ్రీమతి ఫిలోమెనా జ్ఞానప్రగాసం, ఆసియా-పసిఫిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ డెవలప్మెంట్ (ఏబీఐడి) సెక్రటరీ జనరల్ శ్రీ అహ్మద్ నదీమ్, మీడియాసెట్ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ శ్రీమతి కరోలినా లోరెంజో ప్యానెలిస్టులుగా పాల్గొన్నారు.
1995 కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణ) చట్టం నుంచి కేబుల్ టీవీ డిజిటలైజేషన్ వరకు భారత నియంత్రణ పరిణామాన్ని, అలాగే వినియోగదారుల ఎంపిక.. సేవల నాణ్యతపై ప్రస్తుతం ట్రాయ్ దృష్టి సారించడంపై శ్రీ లహోటి వివరించారు. వినియోగదారుల ప్రయోజనాల విషయంలో రాజీ లేని నియంత్రణల సడలింపు ద్వారా సమాన స్థాయిని నిర్ధారించడంలో ట్రాయ్ ప్రయత్నాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
వేగంగా వృద్ధి చెందుతున్న ఓవర్-ది-టాప్ (ఓటీటీ) వేదికలు, వాటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్యానెలిస్టులు చర్చించారు. 2024లో భారత డిజిటల్ మీడియా మార్కెట్ విలువ 9.7 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో, సమతుల్య నియంత్రణ ప్రాధాన్యం సంతరించుకుంది. డిజిటల్ రేడియో, సరళీకృత నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్, జాతీయ ప్రసార విధానం కోసం ట్రాయ్ ప్రతిపాదనలను శ్రీ లహోటి వివరించారు.
నియంత్రణతో పాటు మీడియా చైతన్యం ప్రాముఖ్యతను శ్రీమతి జ్ఞానప్రగాసం ప్రధానంగా ప్రస్తావించారు. జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూనే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికిగానూ నియంత్రణ కోసం దశలవారీ విధానం అవసరమని శ్రీ నదీమ్ పేర్కొన్నారు. మీడియాసెట్‌లోని అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ శ్రీమతి కరోలినా లోరెంజో మాట్లాడుతూ, వేదికల జవాబుదారీతనం విషయంలో యూరప్ అనుభవాన్ని ప్రస్తావించారు. స్మార్ట్ టీవీల వంటి సాంకేతికత క్రమంలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లలో ఎదురవుతున్న నెట్‌వర్క్ ప్రభావాల సవాళ్లను వివరించారు.
వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, నియంత్రణ సంక్లిష్టతను తగ్గిస్తూ సమన్వయ నియంత్రణను సాధించాల్సిన ఆవశ్యకతపై ఏకాభిప్రాయ సాధనతో సమావేశాన్ని ముగించారు.
* * *
Release ID:
(Release ID: 2126010)
| Visitor Counter:
23