రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ మంత్రిత్వ శాఖ, మైగవ్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాల కోసం ‘జ్ఞాన్‌పథ్ రూపకల్పన డిజైన్‌పై జాతీయ స్థాయి పోటీ’

Posted On: 30 APR 2025 1:05PM by PIB Hyderabad

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల (ఐడీసీ-2025) సందర్భంగా ‘జ్ఞానపథ్ రూపకల్పన డిజైన్‌పై జాతీయ స్థాయి పోటీ’ని ‘మైగవ్’ సహకారంతో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. మే 1 నుంచి 15 వరకు ఈ పోటీ జరుగుతుంది. దేశవ్యాప్తంగా యువత, పౌరుల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపడం, సృజనాత్మక వ్యక్తీకరణను పెంపొందించడం ఈ పోటీ లక్ష్యం. నేషనల్ కేడెట్ కోర్స్, నేషనల్ సర్వీస్ స్కీమ్ వలంటీర్లు, బడి పిల్లలు అమలు చేయాల్సిన ప్రణాళికలకు పోటీలో పాల్గొనే అభ్యర్థులు రూపకల్పన చేయాల్సి ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఎర్రకోట వద్ద జ్ఞానపథ్‌లో ప్రదర్శించేలా తగిన నేపథ్యాన్ని కూడా వారు రూపొందించాలి. అభ్యర్థులు ఓ అవగాహన కోసం కిందటి సంవత్సరాల డిజైన్లను చూడొచ్చు. మరింత సమాచారం కోసం ఈ సైట్‌ను వీక్షించండి:   https://www.mygov.in/

పోటీ విశేషాలు:

· మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.10,000 చొప్పున నగదు బహుమతి లభిస్తుంది.

· మొదటి 250 మంది అభ్యర్థులు ఎర్రకోట వద్ద నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాన్ని వీక్షించడం కోసం ఇ-ఇన్విటేషన్లను అందుకుంటారు. వారితోపాటు మరొకరికి (సంరక్షకుడు/జీవిత భాగస్వామి/బంధువు) అనుమతి ఉంటుంది.

· అభ్యర్థులందరికీ మైగవ్ జారీ చేసిన ఆన్ లైన్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందిస్తారు.

నియమ నిబంధనలు:

a)    ఈ పోటీలో పాల్గొనే వారు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి.

b)    ఒక అభ్యర్థి ఒకసారి మాత్రమే పోటీలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.

c)    మైగవ్ పోర్టల్ అవసరానికి అనుగుణంగా ఎంట్రీలు జేపీజీ/పీడీఎఫ్/మరేదైనా ఫార్మాట్‌లో ఉండాలి. పోటీ కోసం ప్రణాళిక (డిజైన్) రూపకల్పనలో ఏదైనా చిత్రం/లోగోను రిఫరెన్సుగా తీసుకుంటే.. రిఫర్ చేసిన ఆ చిత్రాన్ని తుది డిజైన్‌తోపాటు పోటీదారు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

d) పోటీలో పాల్గొనడానికి న్యాయబద్ధం కాని/అప్రామాణిక మార్గాల వినియోగం/ మాల్‌ప్రాక్టీస్ సహా ఒకరికి బదులు మరొకరు పాల్గొనడం, ఒకే వ్యక్తి రెండుసార్లు పాల్గొనడం వంటి వాటికి అవకాశం లేదు. అలా చేస్తే వారి అభ్యర్థిత్వం రద్దవుతుంది.

e)    కాపీరైట్ ఉన్న చిత్రాలను ఉపయోగించరాదు. దీనికి సంబంధించి ఓ అండర్‌టేకింగ్‌ను సమర్పించాలి. దానిని సమర్పించకపోతే ఆ ఎంపిక చెల్లదు. అంతేకాకుండా పోటీ నిర్వాహకులు లేదా వారి తరఫున పనిచేసే ఏదైనా ఏజెన్సీకి ఈ విషయంలో అన్ని హక్కులూ ఉంటాయి.

f)     స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఒక పోటీ/క్విజ్ కోసం ఒక మొబైల్ నెంబరు, ఒక ఇ-మెయిల్ ఐడీని ఒకరి కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు ఉపయోగించలేరు.

g)    ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఇ-ఇన్విటేషన్ మాత్రమే అందిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరయ్యేందుకు ప్రయాణం, వసతి, ఆహారం తదితర ఖర్చులనూ అతడు/ ఆమె భరించాలి.

h)    పోటీల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న ఉద్యోగులకు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హత లేదు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ అనర్హత వర్తిస్తుంది.

i)     ఎంట్రీల పరిశీలన ఆధారంగా, రక్షణ శాఖ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ విజేతలను ప్రకటిస్తుంది.

j)    ఎర్రకోట వద్ద జ్ఞానపథ్ డిజైన్ కోసం అభ్యర్థులెవరైనా సమర్పించిన డిజైన్లను రక్షణ మంత్రిత్వ శాఖ పాక్షికంగా లేదా పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ఈ పోటీ సమయంలో సమర్పించిన డిజైన్లకు సంబంధించి అభ్యర్థులు ఏ సమయంలోనూ కాపీరైట్ కోసం క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు.  

 

***


(Release ID: 2125509) Visitor Counter : 10