రక్షణ మంత్రిత్వ శాఖ
‘రక్షణ ఉత్పత్తులకు పరిశ్రమ, నాణ్యతపరమైన హామీల అనుసరణ’పై న్యూఢిల్లీలో రెండు రోజుల వర్క్ షాప్
प्रविष्टि तिथि:
28 APR 2025 3:27PM by PIB Hyderabad
రక్షణ ఉత్పత్తులలో ‘పరిశ్రమ 4.0’తో పాటు ‘నాణ్యత హామీ (క్యూఏ) 4.0’ను అనుసరించే అంశంపై రెండు రోజుల వర్క్ షాప్ ను ఈ నెల 24, 25 లలో న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యశాలను రక్షణ శాఖ (ఎంఓడీ), రక్షణ ఉత్పత్తి విభాగం (డీడీపీ)లు క్వాలిటీ అష్యూరెన్స్ డైరెక్టరేట్ జనరల్ (డీజీక్యూఏ) ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేశాయి. రక్షణకు సంబంధించిన వివిధ ప్రభుత్వ రంగ సంస్థల (డీపీఎస్‌యూల)లో ఆటోమేషన్‌ను అమలు చేయడానికి, అలాగే ఒక సంస్థ సంపాదించిన అనుభవం నుంచి ఇతర సంస్థలు నేర్చుకోవడానికి ఎంతవరకు అవకాశాలున్నాయో మేధోమధనం జరపడం ఈ కార్యశాల లక్ష్యం.
ఈ కార్యశాలను ఎంఓడీ/ డీడీపీ సంయుక్త కార్యదర్శి (ల్యాండ్ సిస్టమ్స్) డాక్టర్ గరిమా భగత్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ, డీపీఎస్‌యూలతోనూ, పరిశ్రమతోనూ కలిసి పనిచేయడానికి రక్షణ శాఖ కట్టుబడి ఉందని, దీంతో ప్రపంచ స్థాయి రక్షణ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి పరిశ్రమ 4.0, క్యూఏ 4.0 ల అనుసరణతోపాటు ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బిగ్ డేటా ఎనలిటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్ చైన్ ల వంటి విశిష్ట సాంకేతికతలను ఉపయోగించుకొనేందుకు ఆస్కారం ఉండవచ్చని స్పష్టం చేశారు. డీజీక్యూఏ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎన్. మనోహరన్ ఈ కార్యశాలలో మాట్లాడుతూ, రక్షణ నాణ్యతకు సంబంధించిన జాతీయ స్థాయి సమావేశాన్ని వచ్చే నెల మే 8న నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిశ్రమ 4.0తో పాటు క్యూఏ 4.0 అనుసరణ విషయమై ఒక దార్శనిక పత్రాన్ని (విజన్ డాక్యుమెంట్) ఈ సమావేశంలో విడుదల చేయడంతోపాటు, ఇదే అంశంపై నిపుణుల బృందంతో చర్చ కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన వివరించారు.
ఈ కార్యశాలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి) శ్రీ సంజీవ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ‘సంస్కరణల సంవత్సరం’లో భాగంగా నిర్వహించారు.
***
(रिलीज़ आईडी: 2125004)
आगंतुक पटल : 18