సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2025 యానిమేషన్ ఫిల్మ్ పోటీ ఫైనల్స్ లో మెరవనున్న ఇద్దరు ఒడియా కళాకారులు
సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించనున్న జాజ్ పూర్ కు చెందిన భాగ్యశ్రీ సత్పతి, భువనేశ్వర్ కు చెందిన రిషవ్ మొహంతి
Posted On:
26 APR 2025 8:19PM
|
Location:
PIB Hyderabad
మే 1 నుంచి 4 వరకు ముంబయిలో జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025) దేశంలో వర్ధమాన సృజనాత్మక ప్రతిభావంతులకు ప్రతిష్టాత్మక వేదికగా ఉపయోగపడుతుంది. వేవ్స్ ఆధ్వర్యంలో జరిగిన యానిమేషన్ ఫిల్మ్ మేకర్ కాంపిటీషన్ కు దేశవ్యాప్తంగా ఎంపికైన 42 మంది ఫైనలిస్టుల్లో ఒడిశాకు చెందిన ఇద్దరు యువ ప్రతిభావంతులు, జాజ్ పూర్ కు చెందిన భాగ్యశ్రీ సత్పతి, భువనేశ్వర్ కు చెందిన రిషవ్ మొహంతి తమదైన ముద్ర వేశారు.
ధర్మశాల, జాజ్‌పూర్‌కు చెందిన 22 ఏళ్ల చిత్ర దర్శకురాలు యానిమేషన్ కళాకారిణి అయిన భాగ్యశ్రీ సత్పతి ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)లో విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. భారతీయ పురాణాలు, ప్రాంతీయ జానపద కథల నుంచి ప్రేరణ పొందిన భాగ్యశ్రీ సంప్రదాయ గాథలను ఆధునిక భావాలతోనూ, సాహసోపేతమైన దృశ్య భాషతోనూ పునర్నిర్మించడం ఆమె ప్రత్యేకత.
ఆమె ఫైనలిస్ట్ ప్రాజెక్ట్ ‘పాసా’ ఒక కాన్సెప్ట్ సిరీస్. ఇది పురాణాలను సైకాలజికల్ డ్రామాతో మిళితం చేస్తూ, మానిప్యులేషన్, లింగ, నియంత్రణ వంటి అంశాలను అన్వేషిస్తుంది. భాగ్యశ్రీ గతంలో ‘హ్యాపీ బర్త్‌డే తారా’ వంటి ప్రముఖ చిత్రాలకు, అలాగే ఒడిశాలోని చిల్కా సరస్సుకు చెందిన ‘మా కాళి జై‘ ఆధారంగా ఒక డాక్యుమెంటరీ చిత్రానికి దర్శకత్వం వహించారు.
భువనేశ్వర్ కుచెందిన ఎన్ఐడీ అహ్మదాబాద్ విద్యార్థి రిషవ్ మొహంతి తన యానిమేషన్ డాక్యుమెంటరీ చిత్రం 'ఖట్టి'తో ఫైనల్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఆయన పనితనం కథ, దృశ్య కథనంపై లోతైన అవగాహనను ప్రతిబింబిస్తుంది, ప్రామాణిక, ఆకర్షణీయమైన డాక్యుమెంటేషన్ కోసం ఒక మాధ్యమంగా యానిమేషన్ సామర్థ్యాన్ని ప్రముఖంగా తెలియచేస్తుంది.
వేవ్స్ 2025 లో, ఫైనలిస్టులు తమ ప్రాజెక్టులను అంతర్జాతీయ న్యాయనిర్ణేతలు, ప్రపంచ వినోద పరిశ్రమకు చెందిన ప్రముఖుల ప్యానెల్ ముందు ఉంచుతారు. ఈ పోటీ ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది. మొదటి ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి రూ ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది. అంతేకాక, ఈ కార్యక్రమం భారతదేశ యానిమేషన్, విఎఫ్ఎక్స్ పరిశ్రమ ల అపారమైన ఆర్థిక సామర్థ్యాన్ని చాటిచెబుతుంది, ఇక్కడ ఒక యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ 100 నుండి 300 మంది నిపుణులకు ఉపాధిని సృష్టించగలదు.
వేవ్స్ 2025 భారతదేశ సృజనాత్మక ప్రతిభను కేవలం ఉత్సవంగా జరపడం కాకుండా అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, యానిమేషన్, వినోద రంగాలలో భారత్ ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది.
తమ విలక్షణమైన కథాకథన శైలి, వినూత్న భావనలతో భాగ్యశ్రీ సత్పతి, రిషవ్ మొహంతి జాతీయ వేదికపై ఒడిశాకు గర్వకారణంగా నిలవనున్నారు.
***
Release ID:
(Release ID: 2124771)
| Visitor Counter:
14