ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవం;


‘ఆరోగ్య కేంద్రాల్లో అగ్నిమాపక భద్రత’ అంశంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి నేతృత్వంలో ప్రతిజ్ఞ


అన్ని స్థాయిల్లోని ఆరోగ్య రక్షణ కేంద్రాల్లో అగ్నిమాపక, విద్యుత్ ప్రమాదాల నుంచి భద్రత కోసం సమష్టి కృషి ఆవశ్యకతను చాటేలా ‘అగ్నిమాపక వారోత్సవం’

‘అత్యవసర తరలింపు, రోగుల భద్రతా వ్యూహాలు’, ‘ఆరోగ్య కేంద్రాల్లో ప్రమాద అవకాశాలున్న ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణ’ అంశాలపై ప్రతిజ్ఞ, వెబినార్‌కు వర్చువల్‌గా 3,000 మందికి పైగా హాజరు

ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై గవ్ వేదిక సహకారంతో ఆన్లైన్ ప్రతిజ్ఞ, ఫైర్ సేఫ్టీ క్విజ్

Posted On: 22 APR 2025 2:18PM by PIB Hyderabad

ఆరోగ్య కేంద్రాల్లో అగ్నిప్రమాదాల నివారణ, భద్రత అనే అంశానికి ప్రాధాన్యమిస్తూ.. అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల సహకారంతో ఏప్రిల్ 21 నుంచి 25 వరకు అగ్నిమాపక వారోత్సవాన్ని కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ‘ఆరోగ్య కేంద్రాల్లో అగ్నిమాపక భద్రత’ అనే అంశంపై ఈరోజు నిర్మాణ్ భవన్లో నిర్వహించిన దేశవ్యాప్త ప్రతిజ్ఞ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ నేతృత్వం వహించారు.

ప్రతిజ్ఞ కార్యక్రమంతోపాటు ‘అత్యవసర తరలింపు, రోగుల భద్రత వ్యూహాలు – ప్రమాద అవకాశాలున్న ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణ’  అంశంపై నిర్వహించిన వెబినార్‌కు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ప్రత్యక్షంగా హాజరవగా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాల నుంచి 3,000 మందికి పైగా వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో రక్షణ కల్పించడం అత్యావశ్యకమన్నారు. భద్రత కోసం పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవడంతోపాటు హాస్పిటళ్లలో అగ్నిమాపక చర్యలపై ఆరోగ్య సిబ్బంది ప్రమాద నివారణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అగ్నిప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకూ రోగుల తరలింపుపైనా ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్‌లను నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఆరోగ్య కేంద్రాల్లో భద్రతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని శ్రీమతి శ్రీవాస్తవ ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఫైర్ సేఫ్టీని పెంపొందించి, రక్షణ కల్పించడం కోసం.. ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలన్నీ ఈ కార్యకలాపాల్లో విశేషంగా పాల్గొనాలని, అత్యుత్త పద్ధతులను మంత్రిత్వ శాఖతో పంచుకోవాలని ఆమె కోరారు.

తమ తమ సంస్థలు, ఆరోగ్య రక్షణ కేంద్రాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లను చేపడతామనీ.. అగ్ని ప్రమాద నివారణ, అత్యవసర సమయాల్లో వ్యవహరించాల్సిన విధానం, సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించడం ద్వారా సంస్థల్లో ఫైర్ సేఫ్టీని పెంపొందిస్తామనీ.. అలాగే ప్రతీ రోగి, సహోద్యోగి, సంరక్షకుల భద్రతకు ప్రాధాన్యమిస్తామని,  అగ్ని ప్రమాదాలను నిరోధించడం కోసం సృజనాత్మక కార్యక్రమాలను చేపడతామని, భద్రతనూ ప్రమాదరాహిత్యంపై భరోసానూ విశ్వాసాన్నీ నెలకొల్పుతామని కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ప్రతిజ్ఞ చేశారు.

image.jpegimage.jpeg 

దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అగ్నిప్రమాదాల నివారణ, ఉపశమన చర్యల ప్రాధాన్యంపై అవగాహన పెంచడం కోసం అగ్నిమాపక వారోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను రూపొందించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఫైర్ సేఫ్టీపై దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞతో పాటు.. ఆరోగ్య కేంద్రాల్లో అగ్నిప్రమాద నివారణ చర్యలపై పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

ఆరోగ్య కేంద్రాల్లో ఫైర్ సేఫ్టీ, విద్యుత్ భద్రతపై రెండు రోజులు వరుస వెబినార్‌లను కూడా మంత్రిత్వ శాఖ నిర్వహించింది. నివారణ, నియంత్రణ పరమైన అనుమతి, అగ్ని ప్రమాదాల గుర్తింపు, నివారణ వ్యవస్థల నిర్వహణ- సంబంధిత కార్యకలాపాలు, రోగుల తరలింపు, ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా మాక్ డ్రిల్స్/ మాక్ విన్యాసాల నిర్వహణ వంటి కీలక అంశాలను అందులో చర్చించారు. ఈ వరుస వెబినార్లకు అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 3,000 మందికి పైగా హాజరయ్యారు.

క్రియాశీల భాగస్వామ్యాన్ని కోరుతూ అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక వివరణాత్మక చెక్ లిస్టును కూడా అందించింది. అగ్ని ప్రమాద, విద్యుత్ ప్రమాద నివారణపై పర్యవేక్షణ చేపట్టేలా అన్ని ఆరోగ్య కేంద్రాలను (ప్రభుత్వ, ప్రైవేటు) ఆదేశించాలని అందులో కోరారు. అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలుముఖ్యంగా వైద్య కళాశాలలు, పెద్ద తృతీయ స్థాయి హాస్పిటళ్లను కోరారు. పోస్టర్ తయారీ/ క్విజ్ పోటీలు, అగ్ని ప్రమాదాల గుర్తింపు- నిరోధక పరికరాలు/ వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకోవడం, మొదలైనవన్నీ ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఉన్నాయి.

ప్రైవేటు ఆరోగ్య రంగం కూడా క్రియాశీలక భాగస్వామిగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించి.. భారత వైద్య సంఘం, కేంద్ర మంత్రిత్వ శాఖలువిభాగాలు తమ రాష్ట్రజిల్లా స్థాయి శాఖల ద్వారా ‘అగ్నిమాపక వారోత్సవ’ కార్యకలాపాలను నిర్వహించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోరింది.

ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన మై గవ్ వేదిక సహకారంతో ఆన్లైన్ ప్రతిజ్ఞలను, ఫైర్ సేఫ్టీ క్విజ్‌ను  కూడా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రచురించింది. ఈ లింకుల ద్వారా ప్రతిజ్ఞను, క్విజ్ను చూడొచ్చు – https://pledge.mygov.in/fire-safety-in-healthcare/ https://quiz.mygov.in/quiz/quiz-on-fire-safety-at-healthcare-facilities/.

ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో రోగులు (ఔట్ పేషంట్లున్‌పేషంట్లు ఇద్దరూ), వారి సహాయకులుఆరోగ్య సిబ్బంది భద్రతశ్రేయస్సుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. ఆరోగ్య కేంద్రాల్లో అగ్నిప్రమాదాల నివారణభద్రతపై వివరణాత్మక సలహాలు, చెక్ లిస్టులు, మార్గదర్శకాలను జారీ చేయడం ద్వారా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోంది.  

 

***


(Release ID: 2123633) Visitor Counter : 6
Read this release in: English , Urdu , Hindi , Tamil