ఆర్థిక మంత్రిత్వ శాఖ
2025 ఏప్రిల్ 20 నుంచి 30 వరకు అమెరికా, పెరూలో అధికారిక పర్యటనకు వెళుతున్న
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
ఐఎంఎఫ్-వరల్డ్ బ్యాంక్ స్ప్రింగ్ సమావేశాలలో పాల్గొననున్న కేంద్ర ఆర్థికమంత్రి
పలు దేశాలు, సంస్థలతో ద్వైపాక్షిక సమావేశాలతో పాటు జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ ఎంసీబీజీ) సమావేశాల్లో కూడా పాల్గొననున్న ఆర్థికమంత్రి
వివిధ వేదికలలో బహుపాక్షిక చర్చల్లో పాల్గొని, భారత ఆర్థిక ప్రగతిని చాటనున్న శ్రీమతి సీతారామన్
Posted On:
19 APR 2025 5:11PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2025 ఏప్రిల్ 20 నుంచి అమెరికా, పెరూలో అధికారిక పర్యటన ప్రారంభించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా 20 నుంచి 25 వరకు శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ లను సందర్శిస్తారు.
ఏప్రిల్ 20 నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అక్కడి స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలోని హూవర్ ఇనిస్టిట్యూషన్ లో 'వికసిత భారత్ 2047కు పునాదులు వేయడం' అనే అంశంపై ప్రధానోపన్యాసం చేస్తారు. అనంతరం ఒక ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు.
ఇన్వెస్టర్లతో రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రముఖ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థల ప్రధాన సీఈఓలతో సంభాషించడంతో పాటు, లో ఉన్న ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సంస్థల సీఈఓలతో శ్రీమతి సీతారామన్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రవాస భారతీయులతో ఏర్పాటయ్యే కార్యక్రమంలో శ్రీమతి సీతారామన్ పాల్గొంటారు. అక్కడ స్థిరపడిన భారతీయులతో సంభాషిస్తారు.
ఏప్రిల్ 22 నుంచి 25 వరకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పర్యటించనున్న నిర్మలా సీతారామన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు స్ప్రింగ్ మీటింగ్స్, రెండో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశాలు, డెవలప్మెంట్ కమిటీ ప్లీనరీ, ఐఎంఎఫ్సీ ప్లీనరీ, గ్లోబల్ సావరిన్ డెట్ రౌండ్ టేబుల్ (జీఎస్డీఆర్) సమావేశాల్లో పాల్గొంటారు.
వాషింగ్టన్ డి.సి.లో జరిగే స్ప్రింగ్ సమావేశాల సందర్భంగా శ్రీమతి సీతారామన్ - అర్జెంటీనా, బహ్రెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, సౌదీ అరేబియా, బ్రిటన్, అమెరికా సహా అనేక దేశాలకు చెందిన తన సహచరులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ఈయూ కమిషనర్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రెసిడెంట్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఆసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) అధ్యక్షుడు, ఫైనాన్స్ హెల్త్ కు సంబంధించి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక న్యాయవాది (యూఎన్ఎస్జీఎస్ఏ), అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లను శ్రీమతి సీతారామన్ కలుసుకుంటారు.
ఏప్రిల్ 26 నుంచి 30 వరకు పెరూలో తన మొదటి పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి తన మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, వాణిజ్య ప్రతినిధులతో కూడిన భారతీయ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తారు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం లక్ష్యంగా చర్చలు నిర్వహిస్తారు.
లిమాలో పర్యటనను ప్రారంభించనున్న శ్రీమతి సీతారామన్ పెరూ అధ్యక్షురాలు శ్రీమతి దినా బోలువార్టే, పెరూ ప్రధాన మంత్రి శ్రీ గుస్టావో అడ్రియన్జెన్ లతో భేటీ అవుతారు. అలాగే పెరూ ఆర్థిక, ఎకానమీ, రక్షణ, ఇంధనం, గనుల శాఖల మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులను కూడా కలుసుకుంటారు.
పెరూ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి భారత్, పెరూ దేశాలకు చెందిన ప్రముఖ వాణిజ్య ప్రతినిధులు పాల్గొనే ఇండియా-పెరూ బిజినెస్ ఫోరం సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం పెరూలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ పెట్టుబడిదారులు, వ్యాపార ప్రతినిధులతో పాటు, పెరూను సందర్శిస్తున్న భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందంతో కూడా శ్రీమతి నిర్మలా సీతారామన్ సమావేశమవుతారు.
***
(Release ID: 2122989)
Visitor Counter : 135