ఆర్థిక మంత్రిత్వ శాఖ
యూపీఐని ద్వారా రూ.2,000 కన్నా ఎక్కువ విలువ గల లావాదేవీలపై జీఎస్‌టీ విధించాలన్న ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదు
Posted On:
18 APR 2025 7:02PM by PIB Hyderabad
యూపీఐని ఉపయోగించి రూ.2,000 కన్నా ఎక్కువ విలువైన లావాదేవీలు చేస్తే వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వాదనలు పూర్తిగా తప్పనీ, అవి పెడదోవపట్టించేవనీ అలాంటి ప్రతిపాదనేదీ లేదు.
కొన్ని ఉపకరణాలను ఉపయోగిస్తూ చేసే చెల్లింపులకు సంబంధించి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వంటి చార్జీలపైన జీఎస్‌టీని విధిస్తున్నారు.
యూపీఐ ద్వారా వ్యక్తికీ, వ్యాపారికీ మధ్య (పర్సన్-టు-మర్చంట్) లావాదేవీలు జరిగిన సందర్భాల్లో ఎండీఆర్‌ను తొలగిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) 2019 డిసెంబరు 30నాటి గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నిర్ణయం 2020 జనవరి నుంచి వర్తిస్తుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ను వసూలు చేయడం లేదు. ఈ కారణంగా ఈ లావాదేవీలకు జీఎస్‌టీ వర్తించదు.
యూపీఐని ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేయడాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
యూపీఐ వాడకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో, 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఒక ప్రోత్సాహక పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ప్రత్యేకించి తక్కువ విలువ గల యూపీఐ (పీ2ఎమ్) లావాదేవీలకు ఉద్దేశించింది. లావాదేవీల ఖర్చులను ఎత్తివేసినందువల్ల చిన్న వర్తకులకు లాభం కలుగుతుంది. డిజిటల్ చెల్లింపుల్లో మరింత మంది పాలుపంచుకొనే వీలు ఏర్పడుతుంది. నవకల్పనకు దన్ను లభిస్తుంది.
ఈ పథకంలో భాగంగా గత కొన్నేళ్లలో చేసిన ప్రోత్సాహపూర్వక చెల్లింపులు, యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబించాయి. ఈ పథకంలో భాగంగా కొన్ని సంవత్సరాల్లో కేటాయింపు ఇలా ఉంది:
• 2021-22 ఆర్థిక సంవత్సరంలో: రూ. 1,389 కోట్లు
• 2022-23 ఆర్థిక సంవత్సరంలో: రూ. 2,210 కోట్లు
• 2023-24 ఆర్థిక సంవత్సరంలో: రూ. 3,631 కోట్లు
ఈ చర్యలు భారత్‌లో డిజిటల్ చెల్లింపుల అనుబంధ విస్తారిత వ్యవస్థకు చెప్పుకోదగ్గ స్థాయిలో తోడ్పాటు అందించాయి.
ప్రపంచవ్యాప్తంగా 2023లో చోటుచేసుకున్న వాస్తవ లావాదేవీల్లో 49 శాతం వాటా భారత్‌దేనని ఏసీఐ వరల్డ్‌వైడ్ రిపోర్టు 2024లో పేర్కొన్నారు. ఇది డిజిటల్ చెల్లింపుల నవకల్పనలో ప్రపంచంలో అగ్రగామిగా భారత్ స్థానాన్ని పునరుద్ఘాటించిన కథనమిది.
యూపీఐ లావాదేవీల విలువ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.21.3 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా, ఈ ఏడాది మార్చి నెలలో రూ.260.56 లక్షల కోట్లకు చేరుకొని చాలా వేగంగా వృద్ధి చెందాయి. ప్రత్యేకించి, పీ2ఎమ్ లావాదేవీలు రూ.59.3 లక్షల కోట్లకు చేరుకొన్నాయి. ఇది డిజిటల్ చెల్లింపు పద్ధతులను వ్యాపారులు రోజురోజుకూ ఆదరిస్తున్నారనీ, ఈ తరహా చెల్లింపు పద్ధతులంటే వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతోందని చాటిచెబుతోంది.
***
(Release ID: 2122973)
Visitor Counter : 53