రక్షణ మంత్రిత్వ శాఖ
అభివృద్ధి చెందిన దేశంగా, అగ్ర సైనిక శక్తిగా భారత్ ఆవిర్భావం తథ్యం: రక్షణ మంత్రి
“స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్న దేశ రక్షణ రంగం, ప్రపంచ పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించగలదు”
శాంతి పరిరక్షణలో మన రక్షణ సామర్థ్యం విశ్వసనీయ నిరోధక శక్తిగా పనిచేయగలదు. శక్తిమంతంగా ఉన్నప్పుడే శాంతి స్థాపన సాధ్యం: రక్షణ మంత్రి
Posted On:
17 APR 2025 2:04PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈరోజు (ఏప్రిల్ 17 న) జరిగిన డిఫెన్స్ కాంక్లేవ్ కార్యమంలో పాల్గొన్న రక్షణమంత్రి శ్రీ రాజనాథ్ సింగ్, స్వయం సమృద్ధ, భవిష్యత్-సంసిద్ధ భారత్ గురించి ఆసక్తికర వివరణను సభ ముందుంచారు. స్వదేశీకరణ, సృజనాత్మకత, ప్రపంచ నాయకత్వ లక్ష్యాల వైపు స్పష్టమైన అడుగులు వేస్తున్న భారత్, తన సరిహద్దులను కాపాడుకుంటూ అంతర్జాతీయ రక్షణ వ్యవస్థలో తన పాత్ర కీలకమైందన్న సంకేతాలను చేరవేస్తోందన్నారు. “సంపూర్ణమైన అభివృద్ధి సాధించిన దేశంగా, ప్రపంచ అగ్ర సైనిక శక్తిగా భారత్ ఆవిర్భావం మరెంతో దూరం లేదు” అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, రక్షణ రంగ పునరుద్ధరణ, బలోపేతాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, రక్షణ అవసరాలను తీర్చుకునేందుకు భారత్ దిగుమతులపైనే ఆధారపడుతుందన్న అపోహను తొలగించడం తమ ముందున్న అతిపెద్ద సవాలని రక్షణ మంత్రి పేర్కొన్నారు. “దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, తన అవసరాలను తీర్చుకోవడం సహా ఎగుమతి అవకాశాలను సాధ్యం చేయగల రక్షణ పారిశ్రామిక వ్యవస్థను దేశం ఏర్పాటు చేసుకుంటుంది” అని శ్రీ రాజనాథ్ సింగ్ అన్నారు.
“స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్న దేశ రక్షణ రంగం, ప్రపంచ పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించగలదు” అని శ్రీ రాజనాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. మేకిన్ ఇండియా కార్యక్రమం కేవలం దేశ రక్షణ ఉత్పాదక వ్యవస్థల బలోపేతానికే పరిమితమవక, ప్రపంచ రక్షణ పంపిణీ వ్యవస్థలను పరిపుష్ఠం చేయగల సత్తా కలదని చెప్పారు. దేశ భద్రత, వ్యూహాత్మక స్వాతంత్ర్యాలు లక్ష్యంగా గల రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలు, ప్రపంచ పంపిణీ వ్యవస్థల్లో తలెత్తే ఆటుపోట్లను తట్టుకునే సత్తాను అందిస్తున్నాయన్నారు.
పెరుగుతున్న భారత్ రక్షణ సామర్థ్యం సంఘర్షణలకు ప్రేరేపించే ఉద్దేశంతో చేపట్టింది కాదని మంత్రి స్పష్టం చేశారు. “శాంతి పరిరక్షణ సాధనలో మా రక్షణ సామర్థ్యం విశ్వసనీయ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. శక్తిమంతంగా ఉన్నప్పుడే శాంతి స్థాపన సాధ్యపడుతుంది” అని రక్షణ మంత్రి చెప్పారు.
రానున్న రోజుల్లో యుద్ధరంగంలో చోటుచేసుకోనున్న మార్పులను ప్రస్తావిస్తూ, ముందు ముందు యుద్ధాలు మరింత హింసాత్మకంగా, అనూహ్యంగా మారతాయని అభిప్రాయపడ్డారు. సైబర్, అంతరిక్ష రంగాలు రణ క్షేత్రాలుగా మారుతున్నాయని, అభిప్రాయాలు, దృక్కోణాలను ప్రభావితం చేసే యుద్ధాలు కూడా నేడు పరిపాటయ్యాయని మంత్రి విశ్లేషించారు. ఇటువంటి సవాళ్ళను ఎదుర్కొనేందుకు సమగ్రమైన సామర్థ్యాల పెంపు, నిరంతర సంస్కరణల ప్రక్రియలు తప్పనిసరి అని శ్రీ రాజనాథ్ చెప్పారు. తమ మంత్రిత్వశాఖ 2025ను ‘సంస్కరణల సంవత్సరం’ గా ప్రకటించిందని తెలియజేశారు.
సంస్కరణల గురించి మాట్లాడుతూ, 200-ఏళ్ళ పురాతన ఆయుధ ఫ్యాక్టరీలను కంపెనీలుగా పరివర్తన చేయాలన్న ఆలోచన సాహసోపేతమైన చర్య అయినప్పటికీ అవసరమైందని చెప్పారు. “నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు సమర్థవంతంగా పని చేస్తూ, కొత్త అవతారంలో లాభాలను ఆర్జించే కేంద్రాలయ్యాయి. రెండు వందల ఏళ్ళ పైబడ్డ వ్యవస్థలో మార్పులు చేపట్టడమన్నది ఈ శతాబ్దపు అతి పెద్ద సంస్కరణగా లెక్కించవచ్చు” అని మంత్రి వ్యాఖ్యానించారు.
రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞాన వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను రక్షణ మంత్రి వివరించారు. ప్రభుత్వ ఆధీనంలోని అయిదు రక్షణ రంగ సంస్థ (డీపీఎస్‌యూ)లు దేశీయంగా తయారు చేయాల్సిన వస్తువలకు సంబంధించిన అయిదు జాబితాలను విడుదల చేశాయని తెలిపారు. ‘‘ఈ అయిదు సేవల జాబితాలో ఉన్న మొత్తం రక్షణ పరికరాలు, ఆయుధ వ్యవస్థలు, డిఫెన్స్ వాహనాల సంఖ్య 509. ఇవి ఇప్పుడు భారత్‌లోనే తయారవుతాయి. అదే విధంగా, డీపీఎస్‌యూ జాబితాలో చేర్చిన వస్తువుల సంఖ్య 5,012. వాటిలో వ్యూహాత్మక ప్రాధాన్యమున్న లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు, ఉప వ్యవస్థలు, విడి భాగాలు, పరికరాలు ఉన్నాయి’’ అని తెలిపారు.
రక్షణ బడ్జెట్లో 75 శాతాన్ని దేశీయ సంస్థల నుంచి కొనుగోళ్లకు కేటాయించామని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశంలో రక్షణ పరికరాల ఉత్పత్తి 2014లో రూ. 40,000 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.1.27 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘ఈ ఏడాది రక్షణ ఉత్పత్తి రూ.1.60 లక్షలను అధిగమిస్తుంది. 2029 నాటికి రూ.3 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’’ అని తెలిపారు.
2013-14లో మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతి రూ.686 కోట్లుగా ఉంటే.. 2024-25 నాటికి రూ. 23,622 కోట్లకు చేరుకున్నాయని రక్షణమంత్రి వెల్లడించారు. ‘‘మనదేశంలో తయారైన రక్షణ ఉత్పత్తులు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది మన ఎగుమతుల విలువ రూ. 30,000 కోట్లకు, 2029 నాటికి రూ. 50,000 కోట్లకు చేరుకోవాలి’’ అని చెప్పారు.
యువత, అంకుర సంస్థల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికతలను ప్రోత్సహించేందుకు ఐడెక్స్‌ను ప్రారంభించామని, ఇది ఎంపిక చేసిన అంకుర సంస్థలకు రూ.1.5 కోట్ల ఆర్థిక సాయం అందిస్తుందని తెలియజేశారు. ఈ చొరవ సాధించిన విజయం ద్వారా ఐడెక్స్ ప్రైమ్‌ను పరిచయం చేశామని, దీని ద్వారా అందించే ఆర్థిక సాయాన్ని రూ. 10 కోట్లకు పెంచామని తెలిపారు. వీటితో పాటు అదితి అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా అసాధారణ ఆవిష్కరణలకు రూ.25 కోట్ల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. ‘‘దేశంలో అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడమే మన లక్ష్యం. దీని కోసమే స్టార్టప్‌లు/ఎంఎస్ఎంఈల నుంచి రూ.2,400 కోట్ల విలువైన కొనుగోళ్లకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. అలాగే రూ. 1,500 కోట్ల విలువైన నూతన సాంకేతికతలకు సంబంధించిన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి సైతం ఆమోదించాం’’ అని తెలిపారు.
బలోపేతమవుతున్న దేశ వ్యూహాత్మక సామర్థ్యాల గురించి రక్షణ మంత్రి వివరించారు. క్షిపణి సాంకేతికత (అగ్ని, బ్రహ్మోస్), జలాంతర్గాములు (ఐఎన్ఎస్ అరిహంత్), యుద్ధ విమాన వాహక నౌక (ఐఎన్ఎస్ విక్రాంత్), కృత్రిమ మేధ, డ్రోన్లు, సైబర్ రక్షణ, హైపర్ సోనిక్ వ్యవస్థలు తదితరమైన వాటితో అభివృద్ధి చెందిన దేశాలతో సమాన స్థాయికి భారత్ చేరుకొందన్నారు. ‘‘ఏరో ఇంజిన్ల తయారీ ఇప్పటికీ సవాలుగానే ఉంది’’ అంటూనే కావేరీ ఇంజిన్ ప్రాజెక్టు, సఫ్రాన్, జీఈ, రోల్స్ రాయిస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు జరుగుతున్న చర్చల గురించి సైతం ప్రస్తావించారు.
నౌకా నిర్మాణంలో భారత్ సాధించిన విజయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. భారత నౌకాదళం, భారతీయ తీర రక్షక దళానికి చెందిన యుద్ధ నౌకల్లో 97 శాతం కంటే ఎక్కువే దేశీయ నౌకా నిర్మాణ కేంద్రాల్లో తయారవుతున్నాయని పేర్కొన్నారు. మన దేశంలో తయారైన నౌకలను మారిషస్, శ్రీలంక, వియత్నాం, మాల్దీవుల వంటి మితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, మాజీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, మాజీ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఛీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తులు) శ్రీ సంజీవ్ కుమార్, రక్షణ పరిశోధనాభివృద్ధి విభాగ కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్ డా. సమీర్ వి కామత్, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శ్రీ సంజయ్ మిత్రతో సహా ఉన్నతాధికారులు, నిపుణులు, అతిథులు పాల్గొన్నారు.
***
(Release ID: 2122593)
Visitor Counter : 35